సంఘటితం చేస్తా | VIP Reporter by vitta sarveshwar Reddy | Sakshi
Sakshi News home page

సంఘటితం చేస్తా

Published Mon, Dec 22 2014 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM

సంఘటితం చేస్తా

సంఘటితం చేస్తా

* మహిళా సంఘాలకు మెప్మా పీడీ సర్వేశ్వర్‌రెడ్డి భరోసా
విఐపి రిపోర్టర్,విట్టా సర్వేశ్వరరెడ్డి

నల్లగొండ మున్సిపాలిటీలో స్వయం సహాయక సంఘాలు మొత్తం 21 వేలు ఉన్నాయి. దీంట్లో కేవలం పట్టణ ప్రాంతంలోనే 1626 సంఘాలు ఉన్నాయి. మండల పరిధిలోని గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసిన తర్వాత  గ్రామీణ సంఘాలు కూడా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోకి వచ్చాయి. అయితే గ్రామాలు విలీనం కాకముందు నల్లగొండ పట్టణంలో ఉన్న సంఘాలు పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. పావలా వడ్డీ రుణాలు, బుక్‌కీపింగ్, స్వయం ఉపాధి కల్పన వంటి అనేక సమస్యలు వారు ఎదుర్కొంటున్నారు.

పట్టణ ప్రాంతంలోని సంఘాల సమస్యలు, వారికి కావాల్సిన అవసరాలు, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు వారికి అందుతున్నాయా..? లేదా?. బ్యాంకర్లు, మెప్మా సిబ్బంది నుంచి వారికి సహాయ,సహకారాలు అందుతున్నాయా..? లేదా ఇబ్బందులు ఏమైన పడుతున్నారా..? అనే విషయాలను తెలుసుకునేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రాజెక్టు డెరైక్టర్ వి.సర్వేశ్వరరెడ్డి ఆదివారం ‘సాక్షి ప్రతినిధి’గా మారారు. నల్లగొండ పట్టణంలోని 34 వ వార్డులో సంఘాలతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ పట్టణంలోని 34వ వార్డునుంచి సర్వేశ్వరెడ్డి వీఐపీ రిపోర్ట్.
 
సర్వేశ్వర్‌రెడ్డి : అందరికీ నమస్కారం..? బాగున్నారా..?
మహిళా సంఘాల సభ్యులు : నమస్కారం సార్..? బాగున్నాం.
 
సర్వేశ్వర్‌రెడ్డి : సంఘాలు ఏవిధంగా పనిచేస్తున్నాయ్..?
మహిళలు : సంఘాల నిర్వహణ బేషుగ్గానే ఉంది. సభ్యులందరం కలిసిగట్టుగానే పనిచేస్తున్నాం. (అందులో లక్ష్మి అనే సభ్యురాలి దగ్గరికి వెళ్లి మాట్లాడారు.)
 
సర్వేశ్వర్‌రెడ్డి : సంఘాల్లో ఎప్పటినుంచి సభ్యురాలిగా ఉన్నారు..?
లక్ష్మి : 14 సంవత్సరాల నుంచి సంఘంలో కొనసాగుతున్నాను. గతంలో రూరల్ సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. ఇప్పుడు అర్బన్‌లో మారాను.
 
సర్వేశ్వర్‌రెడ్డి : సంఘాల్లో చేరిన తర్వాత ఎలాంటి పనులు చేస్తున్నారు..?
లక్ష్మి : మా సంఘంలో సభ్యులు తలోపని చేసుకుంటున్నాం. సభ్యులందరు స్వయం ఉపాధి పొందుతున్నారు.
 (అక్కడే ఉన్న మరో సభ్యురాలు సరస్వతితో మాట్లాడారు)
 
సర్వేశ్వర్‌రెడ్డి : బ్యాంక ర్ల నుంచి, మెప్మా సిబ్బంది నుంచి ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా...?
సరస్వతి : బ్యాంకులు దశలవారీగా రుణాలు ఇస్తున్నారు. మెప్మా నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేవు.
 
సర్వేశ్వర్‌రెడ్డి : మీ సంఘం అభివృద్ధి పరంగా ఏ స్థానంలో ఉంది?
సరస్వతి : మా సంఘం ‘ఏ’గ్రేడ్‌లో ఉంది. పుస్తకాల నిర్వహణ, కంప్యూటర్ శిక్షణ పొందుతున్నాం. బుక్‌కీపింగ్ ఏ విధంగా చేయాలనే దా నిపై శిక్షణలు తీసుకున్నాం. సభ్యులు తీసుకున్న రుణాలు కూడా తిరిగి చెల్లింపులు జరిగేలా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. (అక్కడే ఉన్న మరో మహిళా సభ్యురాలు రశీదను పలకరించారు)

సర్వేశ్వర్‌రెడ్డి : ముస్లిం మహిళలు సాధారణంగా బయటకు వచ్చి వ్యాపారులు చేసేందుకు ఆసక్తి చూపరు..అలాంటిది సంఘాల ద్వారా ఏ విధంగా లబ్ధిపొందుతున్నారు..?
రశీద : మొదట్లో మేం చాలా పేదవాళ్లం. కానీ ఇప్పుడు సంఘాల్లో చేరిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాం. ఇండ్లీ బండి, మటన్, చికెన్, పాల వ్యాపారం పెట్టుకుంటున్నాం. సంఘం ఏర్పడిన మొదట్లో రూ.30 వేలు మాత్రమే రుణం తీసుకున్నాం. ప్రస్తుతం రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే స్థితికి మేం ఎదిగాం.
 
సర్వేశ్వర్‌రెడ్డి : బ్యాంకర్లు లింకేజీలు ఇవ్వడంలో ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి..? (ధనమ్మ అనే మహిళతో)
ధనమ్మ : బ్యాంకర్ల నుంచి మొదట్లో ఇబ్బంది ఉంది. వార్డుల వారీగా సంఘాలు విభజన జరిగిన తర్వాత నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేవు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరిస్తున్నారు.
 
సర్వేశ్వర్‌రెడ్డి : మెప్మా నుంచి అమలవుతున్న పథకాలు మీకు ఏవిధంగా ఉపయోగపతున్నాయి...? (మరో మహిళ యాదమ్మతో)
యాదమ్మ : జనశ్రీయోజన బీమా  మా కుటుంబాన్ని కాపాడింది. మాకుటుంబంలో అనారోగ్య సమస్య వచ్చినప్పుడు బీమా పథకం నుంచి రూ.30 వేలు సాయం పొందాం. (గుంపులో ఉన్న మరో మహిళ దగ్గరికి వెళ్లారు. విజయారాణి అనే మహిళను పలకరిస్తూ..)

సర్వేశ్వర్‌రెడ్డి : మగవాళ్ల దాడుల నుంచి మహిళలను కాపాడేందుకు ఏమైన కమిటీలు ఏర్పాటు చేశారా..?
విజయారాణి : టీవీల్లో చూస్తున్నాం. అలాంటి కమిటీలు ఏర్పాటు చేస్తే మంచిది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక సెల్ ఏర్పాటు చేయాలి. మా సమస్యలపై అక్కడ చర్చించుకుని పరిష్కరించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తే బాగుటుంది.
 
సర్వేశ్వర్‌రెడ్డి :  త్వరలో సోషల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు కాబోతుంది. దానిపై మీ స్పందన..? (మహిళలందరినీ కలిపి)
మహిళలు : కమిటీలో మహిళలు సభ్యులుగా ఉండాలి. మగవాళ్ల దాడుల నుంచి కాపాడుకునేందుకు అవసరమైన రక్షణ చర్యలను పోలీస్ శాఖ కల్పిస్తే బాగుంటుంది. నాటుసారాకు అలవాటు పడి 60 ఏళ్లు బతకాల్సిన మగవాళ్లు 40 ఏళ్లకే చనిపోతున్నారు. ఇలాంటి వాటిని నిరోధించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలి.
 
సర్వేశ్వర్‌రెడ్డి : అంగన్ వాడీ కేంద్రాలకు శనగపప్పు, కందిపప్పు సప్లయ్ చేశారు కదా..? సంఘాలకు ఏమైన ప్రయోజనం కలిగిందా..?
మహిళలు : అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేయడం వల్ల మాకు కొంతమేర కమీషన్ వచ్చింది. అన్ని పట్టణాల్లో కూడా సంఘాలు ఉన్నాయి. వాటిన్నింటికీ ప్రయోజనం కలిగేలా అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు, హాస్టల్స్‌కు సరఫరా చేసే నిత్యావసరాలు, విద్యార్థులకు దుస్తులు కుట్టించే కార్యక్రమాన్ని కూడా పట్టణ సంఘాలకు అప్పగిస్తే బాగుంటుంది. తద్వారా మేం ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది.
 
సర్వేశ్వర్‌రెడ్డి : స్వయం ఉపాధి శిక్షణలు ఇప్పిస్తే నేర్చుకుంటారా..?
మహిళలు : సంఘాల్లో చదువుకున్న సభ్యులు ఉన్నారు. వారికి సెల్‌ఫోన్ రిపేరింగ్, అల్లికలు, టైలరింగ్, పూల అలంకరణ వంటి వాటిపై శిక్షణ ఇప్పిస్తే నేర్చుకుంటారు. శిక్షణ పొందిన వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తే స్వయంగా ఉపాధి పొందుతాం.
 
సర్వేశ్వర్‌రెడ్డి : గతంలో సంఘాలకు సీఐఎఫ్ రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు. వాటిని సక్రమంగా వినియోగంచుకోలేదని ఫిర్యాదులొచ్చాయి..?
మహిళలు : సీఐఎఫ్ ఫండ్‌ను సంఘాలు వివిధ అవసరాలకు ఉపయోగించుకున్నారు. సంఘాలకు తిరిగి చెల్లించడంతోపాటు వాటిని రుణాల రూపంలో మిగతావాటికి అందజేస్తున్నాం.
 
మెప్మా పీడీ హామీలు..
* నల్లగొండ పట్టణంలో ఇప్పటివరకు ఒక్కటే పట్టణ సమైక్య ఉంది. కొత్తగా మరో సమైక్యను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
* పట్టణాల్లో సంఘాలను విస్తరింపజేస్తాం.
* సంఘాల బలోపేతానికి ప్రత్యేక శిక్షణలు, ఉపాధి కల్పనకు కృషి.
* పట్టణాల్లో వీధి వ్యాపారులకు చేయూత.
* సంఘాలకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ రాయితీ, ఉపకారవేతనాలు వీలైనంత త్వరలో విడుదల.
* జాతీయ జీవనోపాధుల మిషన్ కింద  నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట మున్సిపాల్టీలు ఎంపికయ్యాయి.  కేంద్ర ప్రభుత్వ సాయంతో  పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement