vip Report
-
సంఘటితం చేస్తా
* మహిళా సంఘాలకు మెప్మా పీడీ సర్వేశ్వర్‌రెడ్డి భరోసా విఐపి రిపోర్టర్,విట్టా సర్వేశ్వరరెడ్డి నల్లగొండ మున్సిపాలిటీలో స్వయం సహాయక సంఘాలు మొత్తం 21 వేలు ఉన్నాయి. దీంట్లో కేవలం పట్టణ ప్రాంతంలోనే 1626 సంఘాలు ఉన్నాయి. మండల పరిధిలోని గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసిన తర్వాత గ్రామీణ సంఘాలు కూడా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోకి వచ్చాయి. అయితే గ్రామాలు విలీనం కాకముందు నల్లగొండ పట్టణంలో ఉన్న సంఘాలు పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. పావలా వడ్డీ రుణాలు, బుక్కీపింగ్, స్వయం ఉపాధి కల్పన వంటి అనేక సమస్యలు వారు ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రాంతంలోని సంఘాల సమస్యలు, వారికి కావాల్సిన అవసరాలు, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు వారికి అందుతున్నాయా..? లేదా?. బ్యాంకర్లు, మెప్మా సిబ్బంది నుంచి వారికి సహాయ,సహకారాలు అందుతున్నాయా..? లేదా ఇబ్బందులు ఏమైన పడుతున్నారా..? అనే విషయాలను తెలుసుకునేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రాజెక్టు డెరైక్టర్ వి.సర్వేశ్వరరెడ్డి ఆదివారం ‘సాక్షి ప్రతినిధి’గా మారారు. నల్లగొండ పట్టణంలోని 34 వ వార్డులో సంఘాలతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ పట్టణంలోని 34వ వార్డునుంచి సర్వేశ్వరెడ్డి వీఐపీ రిపోర్ట్. సర్వేశ్వర్‌రెడ్డి : అందరికీ నమస్కారం..? బాగున్నారా..? మహిళా సంఘాల సభ్యులు : నమస్కారం సార్..? బాగున్నాం. సర్వేశ్వర్‌రెడ్డి : సంఘాలు ఏవిధంగా పనిచేస్తున్నాయ్..? మహిళలు : సంఘాల నిర్వహణ బేషుగ్గానే ఉంది. సభ్యులందరం కలిసిగట్టుగానే పనిచేస్తున్నాం. (అందులో లక్ష్మి అనే సభ్యురాలి దగ్గరికి వెళ్లి మాట్లాడారు.) సర్వేశ్వర్‌రెడ్డి : సంఘాల్లో ఎప్పటినుంచి సభ్యురాలిగా ఉన్నారు..? లక్ష్మి : 14 సంవత్సరాల నుంచి సంఘంలో కొనసాగుతున్నాను. గతంలో రూరల్ సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. ఇప్పుడు అర్బన్‌లో మారాను. సర్వేశ్వర్‌రెడ్డి : సంఘాల్లో చేరిన తర్వాత ఎలాంటి పనులు చేస్తున్నారు..? లక్ష్మి : మా సంఘంలో సభ్యులు తలోపని చేసుకుంటున్నాం. సభ్యులందరు స్వయం ఉపాధి పొందుతున్నారు. (అక్కడే ఉన్న మరో సభ్యురాలు సరస్వతితో మాట్లాడారు) సర్వేశ్వర్‌రెడ్డి : బ్యాంక ర్ల నుంచి, మెప్మా సిబ్బంది నుంచి ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా...? సరస్వతి : బ్యాంకులు దశలవారీగా రుణాలు ఇస్తున్నారు. మెప్మా నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేవు. సర్వేశ్వర్‌రెడ్డి : మీ సంఘం అభివృద్ధి పరంగా ఏ స్థానంలో ఉంది? సరస్వతి : మా సంఘం ‘ఏ’గ్రేడ్‌లో ఉంది. పుస్తకాల నిర్వహణ, కంప్యూటర్ శిక్షణ పొందుతున్నాం. బుక్కీపింగ్ ఏ విధంగా చేయాలనే దా నిపై శిక్షణలు తీసుకున్నాం. సభ్యులు తీసుకున్న రుణాలు కూడా తిరిగి చెల్లింపులు జరిగేలా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. (అక్కడే ఉన్న మరో మహిళా సభ్యురాలు రశీదను పలకరించారు) సర్వేశ్వర్‌రెడ్డి : ముస్లిం మహిళలు సాధారణంగా బయటకు వచ్చి వ్యాపారులు చేసేందుకు ఆసక్తి చూపరు..అలాంటిది సంఘాల ద్వారా ఏ విధంగా లబ్ధిపొందుతున్నారు..? రశీద : మొదట్లో మేం చాలా పేదవాళ్లం. కానీ ఇప్పుడు సంఘాల్లో చేరిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాం. ఇండ్లీ బండి, మటన్, చికెన్, పాల వ్యాపారం పెట్టుకుంటున్నాం. సంఘం ఏర్పడిన మొదట్లో రూ.30 వేలు మాత్రమే రుణం తీసుకున్నాం. ప్రస్తుతం రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే స్థితికి మేం ఎదిగాం. సర్వేశ్వర్‌రెడ్డి : బ్యాంకర్లు లింకేజీలు ఇవ్వడంలో ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి..? (ధనమ్మ అనే మహిళతో) ధనమ్మ : బ్యాంకర్ల నుంచి మొదట్లో ఇబ్బంది ఉంది. వార్డుల వారీగా సంఘాలు విభజన జరిగిన తర్వాత నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేవు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరిస్తున్నారు. సర్వేశ్వర్‌రెడ్డి : మెప్మా నుంచి అమలవుతున్న పథకాలు మీకు ఏవిధంగా ఉపయోగపతున్నాయి...? (మరో మహిళ యాదమ్మతో) యాదమ్మ : జనశ్రీయోజన బీమా మా కుటుంబాన్ని కాపాడింది. మాకుటుంబంలో అనారోగ్య సమస్య వచ్చినప్పుడు బీమా పథకం నుంచి రూ.30 వేలు సాయం పొందాం. (గుంపులో ఉన్న మరో మహిళ దగ్గరికి వెళ్లారు. విజయారాణి అనే మహిళను పలకరిస్తూ..) సర్వేశ్వర్‌రెడ్డి : మగవాళ్ల దాడుల నుంచి మహిళలను కాపాడేందుకు ఏమైన కమిటీలు ఏర్పాటు చేశారా..? విజయారాణి : టీవీల్లో చూస్తున్నాం. అలాంటి కమిటీలు ఏర్పాటు చేస్తే మంచిది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక సెల్ ఏర్పాటు చేయాలి. మా సమస్యలపై అక్కడ చర్చించుకుని పరిష్కరించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తే బాగుటుంది. సర్వేశ్వర్‌రెడ్డి : త్వరలో సోషల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు కాబోతుంది. దానిపై మీ స్పందన..? (మహిళలందరినీ కలిపి) మహిళలు : కమిటీలో మహిళలు సభ్యులుగా ఉండాలి. మగవాళ్ల దాడుల నుంచి కాపాడుకునేందుకు అవసరమైన రక్షణ చర్యలను పోలీస్ శాఖ కల్పిస్తే బాగుంటుంది. నాటుసారాకు అలవాటు పడి 60 ఏళ్లు బతకాల్సిన మగవాళ్లు 40 ఏళ్లకే చనిపోతున్నారు. ఇలాంటి వాటిని నిరోధించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలి. సర్వేశ్వర్‌రెడ్డి : అంగన్ వాడీ కేంద్రాలకు శనగపప్పు, కందిపప్పు సప్లయ్ చేశారు కదా..? సంఘాలకు ఏమైన ప్రయోజనం కలిగిందా..? మహిళలు : అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేయడం వల్ల మాకు కొంతమేర కమీషన్ వచ్చింది. అన్ని పట్టణాల్లో కూడా సంఘాలు ఉన్నాయి. వాటిన్నింటికీ ప్రయోజనం కలిగేలా అంగన్వాడీ కేంద్రాలతో పాటు, హాస్టల్స్‌కు సరఫరా చేసే నిత్యావసరాలు, విద్యార్థులకు దుస్తులు కుట్టించే కార్యక్రమాన్ని కూడా పట్టణ సంఘాలకు అప్పగిస్తే బాగుంటుంది. తద్వారా మేం ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది. సర్వేశ్వర్‌రెడ్డి : స్వయం ఉపాధి శిక్షణలు ఇప్పిస్తే నేర్చుకుంటారా..? మహిళలు : సంఘాల్లో చదువుకున్న సభ్యులు ఉన్నారు. వారికి సెల్‌ఫోన్ రిపేరింగ్, అల్లికలు, టైలరింగ్, పూల అలంకరణ వంటి వాటిపై శిక్షణ ఇప్పిస్తే నేర్చుకుంటారు. శిక్షణ పొందిన వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తే స్వయంగా ఉపాధి పొందుతాం. సర్వేశ్వర్‌రెడ్డి : గతంలో సంఘాలకు సీఐఎఫ్ రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు. వాటిని సక్రమంగా వినియోగంచుకోలేదని ఫిర్యాదులొచ్చాయి..? మహిళలు : సీఐఎఫ్ ఫండ్‌ను సంఘాలు వివిధ అవసరాలకు ఉపయోగించుకున్నారు. సంఘాలకు తిరిగి చెల్లించడంతోపాటు వాటిని రుణాల రూపంలో మిగతావాటికి అందజేస్తున్నాం. మెప్మా పీడీ హామీలు.. * నల్లగొండ పట్టణంలో ఇప్పటివరకు ఒక్కటే పట్టణ సమైక్య ఉంది. కొత్తగా మరో సమైక్యను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. * పట్టణాల్లో సంఘాలను విస్తరింపజేస్తాం. * సంఘాల బలోపేతానికి ప్రత్యేక శిక్షణలు, ఉపాధి కల్పనకు కృషి. * పట్టణాల్లో వీధి వ్యాపారులకు చేయూత. * సంఘాలకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ రాయితీ, ఉపకారవేతనాలు వీలైనంత త్వరలో విడుదల. * జాతీయ జీవనోపాధుల మిషన్ కింద నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట మున్సిపాల్టీలు ఎంపికయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సాయంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం. -
క్లీన్‌సిటీగా
మిర్యాలగూడ పట్టణంలోని పాత బస్టాండ్ స్థలం కూరగాయల వ్యాపారులకు నిలయం... దీనికి సమీపంలోని గణేష్ మార్కెట్ అతి పెద్ద వ్యాపార కేంద్రం.. ఇక్కడ అడుగడుగునా సమస్యలే. వర్షం వస్తే కూరగాయలు విక్రయించే పరిస్థితి లేదు. ఈ వ్యాపార కేంద్రానికి వాహన పార్కింగ్ స్థలం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. చెత్తాచెదారం రోడ్లపై వేస్తున్నారు. అదే విధంగా మున్సిపాలిటీలోని13వ వార్డు కలాల్వాడలోనూ ఇదే పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మి ప్రజాప్రతినిధిగా కాకుండా జర్నలిస్టుగా మారారు. ఒక్కొక్కరితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. క్లీన్‌సిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు. మిర్యాలగూడ పట్టణం నుంచి తిరునగరు నాగలక్ష్మి వీఐపీ రిపోర్ట్... తిరునగరు నాగలక్ష్మి : నీపేరేమిటి? ఎంత కాలంగా వ్యాపారం చేస్తున్నావు? మహిళా వ్యాపారి: నా పేరు చెన్నమ్మ. ఐదేండ్లుగా మార్కెట్లో పండ్ల వ్యా పారం చేస్తున్న. నాగలక్ష్మి : మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా? చెన్నమ్మ : రోడ్డుపైనే పండ్లు అమ్ముకుం టం. కనీసం ఒక అడ్డా కూడా ఇవ్వలె. అప్పుడప్పుడు బండి తీయిస్తారు. మాకేదైనా ఆదెరువు చూపండమ్మా. నాగలక్ష్మి : మీ సమస్యలేంటి చెప్పమ్మా...? (పక్కనే డబ్బాలో మిషన్ కుడుతున్న మహిళతో) రుక్మి : నేను మార్కెట్లో 40 ఏళ్లుగా కుట్టుమిషన్ పనిచేస్తున్న. మాకు ఇల్లు లేదు. కనీసం గుడిసె కూడా లేదు. నాగలక్ష్మి : మీరే వ్యాపారం చేస్తారు? వెంకటేశ్వర్లు: నేను మార్కెట్లో పొగా కు వ్యాపారం చేస్తున్నా. మంచినీటితో పాటు పారిశుద్ధ్య సమస్యలు ఉండేవి. ఇప్పుడిప్పుడే పరిష్కారమయ్యాయి. నాగలక్ష్మి : రోడ్లు ఉన్నాయా? వెంకటేశ్వర్లు : రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. రోడ్లు వేస్తే కొంత మేలు జరుగుతుంది. నాగలక్ష్మి : మీ పేరు ఏమిటి? ఏయే సమస్యలు ఉన్నాయి? ఖలీల్ : మార్కెట్లో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంది. మార్కెట్‌కు వచ్చే వారు కనీసం వాహనం నిలిపేందుకు స్థలం లేక రోడ్లుపై పెడుతున్నారు. నాగలక్ష్మి : మార్కెట్ వస్తే ఏం సమస్యలు వస్తున్నాయి ? (మార్కెట్లో కూరగాయలు కొనే వ్యక్తితో) మహిమూద్ : పార్కిగ్ స్థలం లేక మార్కెట్‌కు రాలేకపోతున్నాం. కూరగాయలు, ఇతర వ్యాపారులకే స్థలం సరిపడా లేదు. వాహనాలు నిలిపేందుకు చోటు లేదు. నాగలక్ష్మి : ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి? మహిమూద్ : చెత్త చెదారం రోడ్లపై వేస్తున్నారు. మార్కెట్‌కు వస్తే చాలు ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. నాగలక్ష్మి : పారిశుద్ధ్యం ఎలా ఉంది ? (పక్కనే ఉన్న మరో వ్యాపారి చంద్రకాంత్‌తో) చంద్రకాంత్ : మార్కెట్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. చిరు వ్యాపారులు చెత్త రోడ్లపైనే వేస్తున్నారు. దీంతో వర్షం వస్తే నానా ఇబ్బందులు పడుతున్నాం. నాగలక్ష్మి : ఇంకా సమస్యలు ఉన్నాయా? చంద్రకాంత్ : పార్కింగ్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. నాగలక్ష్మి : ఏం అవ్వా? బాగున్నావా? ఏం అమ్ముతున్నావు? బాబి (ఐలాపురం): ఆకు కూరలు అమ్మడానికి వచ్చా. నాగలక్ష్మి : రోజూ అమ్ముతావా? బాబి : ఆదివారం ఒక్క రోజే కొత్తిమీర, పుదీన అమ్మడానికి వస్త. నాగలక్ష్మి : మార్కెట్లో అమ్మడానికి స్థలం ఉందా? ఎక్కడ అమ్ముకుంటావు? బాబి : మార్కెట్లో స్థలం లేక నందిపాడు రోడ్డులో చికెన్ సెంటర్ వద్ద అమ్ముకుంటా. అక్కడినుంచి తిరునగరు నాగలక్ష్మి 13వ వార్డులోని కలాల్‌వాడకు వెళ్లారు. అక్కడ ఇంటి బయట ఉన్న ఓ మహిళను పలకరించారు. నాగలక్ష్మి : ఏమమ్మా..నీ పేరు ఏమిటి? మీకేమైనా సమస్యలు ఉన్నాయా? మహిళ : నా పేరు నాగమణి, మురుగు కాలువ సగం నిర్మించారు. మిగతా సగం నిర్మించలేదు. చెత్తాచెదారంతో మురుగు కాలవలు నిండిపోతున్నయ్. నాగలక్ష్మి : కాలువలు మున్సిపాలిటీ వారు తీయడం లేదా? నాగమణి : తీసి నెల రోజులైంది. మురుగు కాలువలు తీయకపోవడం వల్ల దోమలు విపరీతంగా ఉన్నాయి. నాగలక్ష్మి : ఏం అవ్వా .. పింఛను వస్తుందా? ఎల్లమ్మ : రావట్లేదు. నాగలక్ష్మి : గతంలో వచ్చిందా? ఎల్లమ్మ : గతంలో ఇచ్చారు. ఇంటికి అధికారులు వచ్చి వెళ్లారు. అయినా పింఛన్ ఇవ్వడం లేదు. నాగలక్ష్మి : మీ కాలనీలో ఏం సమస్యలు ఉన్నాయి. బంటు శ్రీనివాస్ : డ్రెమినేజీ సమస్య తీవ్రంగా ఉంది. మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదు. నాగలక్ష్మి : మీ సమస్యను ఎవరి దృష్టికి తీసుకెళ్లారు? బంటు శ్రీనివాస్ : అధికారులకు చెప్పాం. అయినా పట్టించుకోలేదు. దోమలు బెడద ఎక్కువగా ఉంది. నాగలక్ష్మి : ఏం చిన్నా చదువుకుంటున్నావా? (వికలాంగ విద్యార్థి గణేష్‌తో) గణేష్ : చదువుకుంటున్నాను. కానీ నాకు పింఛన్ రావడం లేదు. నాగలక్ష్మి : గతంలో పింఛన్ వచ్చిందా? గణేష్ : గతంలో ఇచ్చారు. కానీ ఇప్పడు పింఛన్ల జాబితాలో పేరు రాలేదు. నాగలక్ష్మి : సదరమ్ సర్టిఫికెట్ ఉందా? గణేష్ : సర్టిఫికెట్ ఉంది. అయినా పింఛన్ రాలే. నాగలక్ష్మి : అమ్మా.. మీ సమస్యలేంటి? పిట్టల చంద్రమ్మ : మా కాలనీలో మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదు. చెత్త తీయడం లేదు. కాలనీకి వచ్చే వారు ముక్కు మూసుకొని వస్తున్నారు. నాగలక్ష్మి : మున్సిపాలిటీ వారికి చెప్పారా? చంద్రమ్మ : చెప్పినా ఏం లాభం లేదు? నాగలక్ష్మి : ఇంకా సమస్యలు ఉన్నాయా? చంద్రమ్మ : మంచినీళ్ల ట్యాంకు నిర్మించాలి. నల్లాలు కూడా చిన్నగా వస్తున్నాయి. -
‘దారి’చూపుతా
యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం, ఆలేరు మండలం కొలనుపాక మధిర గ్రామమైన బైరాంనగర్ మధ్య 4 కిలోమీటర్ల మేర రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ దూరం వరకు డాంబర్ రోడ్డు వేస్తే.. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట నుంచి ప్రపంచప్రఖ్యాతి గాంచిన కొలనుపాక గ్రామంతోపాటు నల్లగొండ, మెదక్, వరంగల్ జిల్లాల మధ్య దూరం తగ్గుతుంది...ఇక.. బైరాంనగర్ ప్రజలది వింత పరిస్థితి. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా గ్రామానికి ఆర్టీసీ బస్ సౌకర్యం లేదు. గ్రామానికి రోడ్డులేదని ఆ గ్రామ యువకులకు పిల్లను ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి. ఇక.. ధర్మారెడ్డిగూడెం, బైరాంనగర్ గ్రామాల మధ్య రోడ్డు వసతి కల్పిస్తే మెదక్ జిల్లా గజ్వేల్, సిద్దిపేట, వరంగల్ జిల్లా జనగామకు దూరం తగ్గుతుంది. రైల్వేట్రాక్ సమస్యలు తీరిపోతాయి. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి ఆదివారం ‘సాక్షి ప్రతినిధి’గా మారి ఆయా గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆలేరు మండలం బైరాంనగర్, యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం నుంచి గొంగిడి సునీతారెడ్డి వీఐపీ రిపోర్ట్. ఆలేరు మండలం కొలనుపాక మధిర గ్రామం బైరాంనగర్కు చేరుకున్న సాక్షి ప్రతినిధి గొంగిడి సునీతారెడ్డి అక్కడే ఉన్న మహిళలతో మాట్లాడారు. గొంగిడి సునీత : అమ్మా బాగున్నావా, నీ పేరేమిటి? మహిళ : మేడం బాగున్నాను. నా పేరు చిర్ర సుమలత. సంవత్సరాల తరబడి మా ఊరికి రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యం లేదు. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయమై ఎన్నో సార్లు గ్రామస్తులం యాదగిరిగుట్ట డిపో మేనేజర్‌కు వినతిపత్రాలు అందజేశాం. రోడ్డు లేదు, బస్సు రాలేదు. సునీత : ఒకేనమ్మా..మీ సమస్య నాకు అర్థమైంది.. పాప.. నీ పేరేమి..ఏం చదువుకుంటున్నావు? (విద్యార్థినితో) విద్యార్థిని : నా పేరు దివ్య. ఆలేరులో 8వ తరగతి చదువుకుంటున్నాను. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో బస్సు రావడం లేదు. అలాగే కొలనుపాక, బైరాంనగర్ గ్రామాల మధ్య ఉన్న వాగుపై వంతెన నిర్మించాల్సి ఉంది. చదువుకోవడానికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నాం. సునీత : రోడ్డు సౌకర్యం కల్పిస్తే బస్సు వస్తుంది. ఆ ప్రయత్నం చేస్తా. అక్కడే ఉన్న మరో మహిళ లక్ష్మిని పలకరించారు. ఏమమ్మా..మీకు మంచినీళ్లు వస్తున్నాయా? లక్ష్మి : మేడం. తాగునీళ్లు లేవు. గ్రామంలో నీటి శుద్ధి ప్లాంట్ లేదు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల నుపాకకు వెళ్లి ఫిల్టర్ నుంచి మంచినీటిని తెచ్చుకుంటున్నాం. గ్రామంలో మంచినీటి ఫిల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సునీత : మీ సమస్యను నోట్ చేసుకుంటున్నా. ఎమ్మెల్యేను చూసిన పలువురు వృద్ధులు ఆమె దగ్గరకు వచ్చారు. వారిలో నంద మైసయ్య అనే వృద్ధుడితో సునీత మాట్లాడారు. ఏం పెద్దాయనా..పింఛన్ వస్తుందా? నందమైసయ్య : పెన్షన్ కోసం దరఖాస్తు ఫారాన్ని సర్పంచ్‌కు అందజేశా. ఈ నెల పెన్షన్ అందలేదు. పెన్షన్ వస్తదో రాదో అర్థం కావడం లేదు. సునీత : అర్హులందరికీ ప్రభుత్వం పింఛన్ ఇస్తుంది. మీరేం భయపడకండి. సునీత అక్కడినుంచి కొద్దిదూరం నడుచుకుంటూ అక్కడ ఉన్న ఓ మహిళ వద్దకు వెళ్లి..నీ పేరేమిటీ? ఎందుకమ్మా..అలా ఉన్నావు..? మహిళ : మేడం నా పేరు నంద నిర్మల. ఫ్లోరిన్ సమస్యతో వెన్నుపూస వంగిపోయింది. ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందడం లేదు. మందులు వాడుతున్నాను. నెలనెలా మందుల కోసం డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఆరోగ్య పరంగా ఆదుకోవాలి. ఇప్పటి వరకు 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. సునీత : చూడమ్మా..ఏం బాధపడకు. ప్రభుత్వ పరంగా సహకారం కోసం నా వంతు కృషి చేస్తా. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ రైతు బుచ్చిరెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడారు. సునీత : ఏం పెద్దాయన గ్రామానికి 108 వాహనం వస్తుందా? బుచ్చిరెడ్డి : గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 108 కాదు కదా.. ఏ వాహనమూ రావడం లేదు. మా ఊరికి పిల్లనివ్వాలంటే కూడా భయపడుతున్నారు. సునీత : బాబు.. మీ ఊర్లో ఆటోలు ఉన్నాయా? (పక్కనే ఉన్న నంద మహేందర్‌తో) నంద మహేందర్ : మాఊర్లో ఆటోలు లేవు, బస్‌లు రావు, ఎవరికైనా ఆపతి వస్తే 250 రూపాయలు ఇస్తే కొలనుపాక నుంచి ఆటో వస్తుంది. అక్కడినుంచి ఆలేరుకు వెళ్లాలి. లేదంటే ఇక అంతే. బస్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. సునీత : బాబు ఏం చేస్తున్నావు? (మరో యువకుడు శ్రీరామ్‌తో) శ్రీరామ్ : నేను భువనగిరిలో ఎమ్మెస్సీ చదవుతున్నాను. గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాక వరకు సైకిల్‌పై పోయి అక్కడినుంచి బస్‌లో భువనగిరికి పోతా. తిరిగి అలాగే ఇంటికి చేరుకుంటాను. రోడ్డుసౌకర్యం ఏర్పడితే చాలామంది చదువుకోవడానికి వెళ్తారు. కనీస వసతులు లేక చదువు అర్ధంతరంగా ఆగిపోతుంది. మీరే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. సునీత : ఏం సర్పంచ్ శ్రీనివాస్ గారు..గ్రామసమస్యలను చెప్పండి (ఆయన పక్కనే ఉన్నారు) గంగుల శ్రీనివాస్ : గ్రామంలో ప్రధానంగా సీసీ రోడ్డు వేయించాలి. ప్రధానం రోడ్డు సౌకర్యం లేక విద్యార్ధులు చదవలేకపోతున్నారు. బైరామ్నగరం- కొలనుపాకల మధ్య వాగుపై వంతెన నిర్మించాలి, నీటిశుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. సునీత : మీ సమస్యలు, బాధ నాకు అర్థమైంది. సాధ్యమైనంత త్వరలో పరిష్కారమయ్యేలా చూస్తా. సరేనండి..మీరేం కోరుకుంటున్నారు (పక్కనే ఉన్న ఎంపీటీసీ మాజీ సభ్యుడు అంజయ్యతో) అంజయ్య : మేడం.. నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఉపాధి హామీలో రోడ్డు కోసం కొంత పనిచేశాం. కొలనుపాక వాగుపై కల్వర్టులు , రోడ్డు లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం వస్తే చాలా కష్టం, ప్రమాదం జరిగితే సరైన వాహన సౌకర్యం అందుబాటులో ఉండదు కాబట్టి రోడ్డు వసతిని వెంటనే కల్పించాలి. సునీత అక్కడినుంచి రోడ్డు మార్గం గుండా యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం వచ్చారు.. అక్కడ పెద్దఎత్తున గుమిగూడిన మహిళలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగితెలుసుకున్నారు. అక్కడే సునీత : సదరం సర్టిఫికెట్ తీసుకున్నావా? (యాదమ్మ అనే వికలాంగురాలితో) యాదమ్మ : సర్టిఫికెట్ అంటే ఏమిటో నాకు తెలియదు, వికలాంగుల పింఛన్‌కోసం దరఖాస్తు చేసుకున్నా. సదరం క్యాంపు ఉందని నాకు ఎవరూ చెప్పలేదు. ఆ విషయం తెలియదు. మీరు ఎలాగైనా పింఛన్ ఇప్పించాలి. (యాదమ్మకు భరోసానిచ్చిన సునీత..అంతటితో రిపోర్టింగ్ ముగించారు.) -
వీఐపీ రిపోర్ట్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
సంస్థాన్‌నారాయణపురంలోని సర్వేల్ గురుకులం దేశానికే తలమానికం.. అఖిల భారత సర్వీసుకు ఎంతో మందిని అందించిన సరస్వతీ నిలయం.. అవిభాజ్య రాష్ట్రంలోనే మొట్టమొదటి గురుకుల విద్యాలయం. 1971లో నాటి ముఖ్యమంత్రి పీవీ నర్సింహారావు చేతుల మీదుగా పురుడు పోసుకుంది. తెలంగాణ పది జిల్లాలకు స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా పనిచేస్తోంది. వంద మందికిపైగా ఈ పాఠశాల విద్యార్థులు దేశంలోనే అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్ఎస్లు, డాక్టర్లుగా ఎంపికై, దేశవ్యాప్తంగా సేవ చేస్తున్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన గురుకులం మనుగడకే ప్రస్తుతం ప్రమాదం ఏర్పడింది. సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతోంది. ఆ గురుకులాన్ని, పక్క గ్రామానికే చెందిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆదివారం సాక్షి ప్రతినిధిగా మారి అక్కడి సమస్యలను అడిగితెలుసుకున్నారు. సర్వేల్ గురుకులం నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వీఐపీ రిపోర్ట్... కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి: మీ పేరేమిటి? గురుకులంలో ఏమేం సమస్యలున్నాయి? ప్రిన్సిపాల్: నాపేరు కేవీఎన్ ఆచారి. అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గెస్ట్ టీచర్లతో కాలం వెళ్లదీస్తున్నాం. 40ఏళ్ల క్రితం నిర్మిం చిన రేకుల షెడ్లలో తరగతులు నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన ఈ పాఠశాలలో మోడల్ స్కూల్ భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు 2, 3కోట్ల రూపాయలు అవసరమవుతాయి. తాగునీటి సమస్య ఉంది. కూసుకుంట్ల: మీ ఎమ్మెల్యే ఇక్కడ బోరు వేయించిండు అంటున్నరు. మోటారు పెట్టిండ్ర. ఆచారి: పెట్టలే, మోటారు మంజూరు ఇప్పియ్యలే. కూసుకుంట్ల: మరి మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? ఆచారి: తీసుకెళ్లలేదు. కూసుకుంట్ల : మరి.. ఆయనను కలిసి మోటారు పెట్టించాల్సిన బాధ్యత మీదే కదా. ఆచారి : నాదే బాధ్యత సర్. కూసుకుంట్ల: అధ్యాపక పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఎంతకాలం నుంచి ఉన్నాయి? ఆచారి: ఏడెనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1996 నుంచి ఇదే పరిస్థితి. గెస్ట్ టీచర్లతో బోధన చేయిస్తున్నాం. కూసుకుంట్ల: ఎందుకు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఆచారి : ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఇటీవల గురుకుల పాఠశాలల కార్యదర్శి శేషుకుమారి దృష్టికి తీసుకెళ్లా. కూసుకుంట్ల: గురుకులం గతంలో ఎంతో మందిని అఖిల భారత సర్వీసులకు అందించింది. ఇప్పుడెందుకు ఎంపిక కావడంలేదు. ఆచారి : 100మందికి పైగా ఈ పాఠశాల విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు ఎంపికయ్యారు. లాటరీ పద్ధతిలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడమే కొంపముంచింది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఓ విద్యార్థితో మాట్లాడారు. కూసుకుంట్ల: బాబు నీ పేరేమిటి? ఎక్కడినుంచి వచ్చావు? విద్యార్థి: సార్! నాపేరు అశోక్. మాది మిర్యాలగూడ. కూసుకుంట్ల: మీ నాన్న ఏంచేస్తారు. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు? అశోక్: వ్యవసాయం చేస్తాడు, గొప్ప ఇంజినీర్ కావాలనుకుంటున్నాను. కూసుకుంట్ల: బాబు నీపేరేమిటి? మీకు ఏమేం సమస్యలున్నాయి?(మరో విద్యార్థినిని ప్రశ్నిస్తూ) విద్యార్థి: సార్, నా పేరు సతీష్. అన్ని బాగానే ఉన్నాయి. అనంతరం పదో తరగతి గదిలోకి వెళ్లారు. కూసుకుంట్ల: సార్! మీ పేరేమిటీ? ఏం బోధిస్తారు? టీచర్: సార్ నాపేరు శంకరయ్య. గణితం బోధిస్తాను. కూసుకుంట్ల: ఇది ఏ తరగతి, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? శంకరయ్య: పదో తరగతి సార్, రెండు సెక్షన్లున్నాయి. 43మంది చొప్పున విద్యార్థులున్నారు. కూసుకుంట్ల: గత ఏడాది ఎంత మందికి 10 జీపీఏలు వచ్చాయి? శంకరయ్య: సార్ 80శాతం మందికి 10పాయింట్లు వచ్చాయి. మిగతావారికి 9.8, 9.7 చొప్పున వచ్చాయి. తరగతిలో ఉన్న ఓ విద్యార్థి దగ్గరికి వెళ్లి బాబు నీ పేరేమిటి? బోధన ఎలా ఉంది? విద్యార్థి: సార్ నాపేరు రవీంద్రబాబు, బాగా అర్థమవుతోంది. కూసుకుంట్ల: టీచర్ల ఖాళీలున్నాయని చెబుతున్నారు, అన్ని సబ్జెక్టులు చెబుతున్నారా? రవీంద్రబాబు: అన్ని సబ్జెక్టులు చెబుతున్నారు. కానీ, ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ సైన్స్, తెలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గెస్ట్ టీచర్లతో చెప్పిస్తున్నారు. తరగతి గదిలొఓ ఇద్దరు ముగ్గురు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడినుంచి గ్రౌండ్ దగ్గరికి వెళ్లారు. కూసుకుంట్ల: బాబు నీ పేరేమిటి?, ఆట వస్తువులున్నాయా? విద్యార్థి: నాపేరు బూటాసింగ్, సరిగా లేవు, సొంత డబ్బులతో కొనుకుంటున్నాం. కూసుకుంట్ల: పీఈటీ గారు ప్రభుత్వం ఇవ్వడంలేదా? పీఈటీ: సార్ నాపేరు అజయ్‌కుమార్, ప్రభుత్వం ఏడాదికి రూ.5వేలే ఇస్తోంది. అందులోనే అన్నీ కొనుగోలు చేయాలి. గ్రౌండ్లు బాగు చేసుకోవాలి. అక్కడినుంచి సమీపంలోని తాగునీటి ట్యాంకు వద్దకు వెళ్లారు. కూసుకుంట్ల: బాబు నీ పేరు ఏమిటి? పాఠశాలలో తాగునీటి సమస్య ఉందా? విద్యార్థి: సార్ నాపేరు నరేశ్, కృష్ణాజలాలు 10, 15రోజులకోసారి వస్తున్నాయి. 40వేల లీటర్ల సామర్థ్యమున్న ఓవర్‌హెడ్ ట్యాంకును పడగొట్టారు. 20వేల లీటర్లదే నిర్మించారు. ఏ మాత్రమూ సరిపోవడంలేదు. కూసుకుంట్ల: సీఎం కేసీఆర్ ఏదో వాటర్ గ్రిడ్ అంటున్నారు. తెలుసా? నరేశ్: కేసీఆర్ ఆలోచనలు, నిర్ణయాలు చాలా బాగున్నాయి. వాటర్‌గ్రిడ్ గురిం చి తెలుసు. వాటర్‌గ్రిడ్ ఏర్పాటుతో మా నీటి సమస్య రుతుంద నుకుంటున్నా. ఎమ్మెల్యే ఏం హామీలిచ్చారంటే.. మోడల్ స్కూల్ భవన నిర్మాణానికి, ఆట వస్తువుల కొనుగోలుకు, గ్రౌండ్ అభివృద్దికి నిధులిప్పిస్తా. నిత్యం కృష్ణాజలాలు వచ్చేలా కృషి చేస్తా. ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకు నిర్మించడంతో పాటు వాటర్‌గ్రిడ్ నుంచి కనెక్షన్ ఇప్పిస్తా. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకీ కృషిచేస్తా. విద్యార్థుల భోజనానికి సన్నబియ్యం ఇప్పిస్తా. పక్కనే ఉన్న జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశ పెట్టడంతో పాటు కేజీ నుంచి పీజీ వరకు పాఠశాల స్థాయిని పెంచుతా. అఖిలభారత సర్వీసులకు 100మందికి పైగా.. సర్వేల్ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు నేడు అఖిల భారత సర్వీసుల్లో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఈఎస్, ఐఆర్టీఎస్, ఐటీఎస్ ఇలా ఏ రంగంలో చూసినా ఈ పాఠశాల పూర్వ విద్యార్థులుంటారు. గతంలో ఎస్సెస్సీలో ఈ పాఠశాల విద్యార్థులదే రాషస్థ్రాయి ర్యాంకుల పంట. ఇక్కడి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా కేంద్ర, రాష్ట్ర సర్వీసులలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొంత మంది శాస్త్రవేత్తలుగా, వైద్యులుగా, ఇంజినీర్లుగా దేశవిదేశాలలో పనిచేస్తున్నారు. ప్రస్తుత హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, ఐజీ వై.నాగిరెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ టి.ప్రభాకర్‌రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, హైదరాబాద్ జాయింట్ కమిషనర్ బి.మల్లారెడ్డి, సీనియర్ ఐఏఎస్‌లు బి.వెంకటేశ్, ఏ.దినకర్‌బాబు, ఎల్.శశిధర్, జినుకల బాబు, ఐఎఫ్ఎస్ డాక్టర్ డీఎన్.రాం బాబు, ఐఆర్ఈఎస్ రణదీర్‌రెడ్డి , ఐఆర్ఎస్ పి.అంజన్‌కుమార్ త దితరులు ఈ పాఠశాలలో విద్యార్థులే.