క్లీన్‌సిటీగా
మిర్యాలగూడ పట్టణంలోని పాత బస్టాండ్ స్థలం కూరగాయల వ్యాపారులకు నిలయం... దీనికి సమీపంలోని గణేష్
మార్కెట్ అతి పెద్ద వ్యాపార కేంద్రం.. ఇక్కడ అడుగడుగునా సమస్యలే. వర్షం వస్తే కూరగాయలు విక్రయించే పరిస్థితి
లేదు. ఈ వ్యాపార కేంద్రానికి వాహన పార్కింగ్ స్థలం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. చెత్తాచెదారం రోడ్లపై
వేస్తున్నారు. అదే విధంగా మున్సిపాలిటీలోని13వ వార్డు కలాల్‌వాడలోనూ ఇదే పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో ప్రజలు
ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మి ప్రజాప్రతినిధిగా కాకుండా
జర్నలిస్టుగా మారారు. ఒక్కొక్కరితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. క్లీన్‌సిటీగా మారుస్తానని హామీ
ఇచ్చారు. మిర్యాలగూడ పట్టణం నుంచి తిరునగరు నాగలక్ష్మి వీఐపీ రిపోర్ట్...
తిరునగరు నాగలక్ష్మి : నీపేరేమిటి? ఎంత కాలంగా వ్యాపారం చేస్తున్నావు?
మహిళా వ్యాపారి: నా పేరు చెన్నమ్మ. ఐదేండ్లుగా మార్కెట్‌లో పండ్ల వ్యా పారం చేస్తున్న.
నాగలక్ష్మి : మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా?
చెన్నమ్మ : రోడ్డుపైనే పండ్లు అమ్ముకుం టం. కనీసం ఒక అడ్డా కూడా ఇవ్వలె. అప్పుడప్పుడు బండి తీయిస్తారు. మాకేదైనా ఆదెరువు చూపండమ్మా.
నాగలక్ష్మి : మీ సమస్యలేంటి చెప్పమ్మా...? (పక్కనే డబ్బాలో మిషన్ కుడుతున్న మహిళతో)
రుక్మి : నేను మార్కెట్‌లో 40 ఏళ్లుగా కుట్టుమిషన్ పనిచేస్తున్న. మాకు ఇల్లు లేదు. కనీసం గుడిసె కూడా లేదు.
నాగలక్ష్మి : మీరే వ్యాపారం చేస్తారు?
వెంకటేశ్వర్లు: నేను మార్కెట్‌లో పొగా కు వ్యాపారం చేస్తున్నా. మంచినీటితో పాటు పారిశుద్ధ్య సమస్యలు ఉండేవి. ఇప్పుడిప్పుడే పరిష్కారమయ్యాయి.
నాగలక్ష్మి : రోడ్లు ఉన్నాయా?
వెంకటేశ్వర్లు : రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. రోడ్లు వేస్తే కొంత మేలు జరుగుతుంది.
నాగలక్ష్మి : మీ పేరు ఏమిటి? ఏయే సమస్యలు ఉన్నాయి?
ఖలీల్ : మార్కెట్‌లో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంది. మార్కెట్‌కు వచ్చే వారు కనీసం వాహనం నిలిపేందుకు స్థలం లేక రోడ్లుపై పెడుతున్నారు.
నాగలక్ష్మి : మార్కెట్ వస్తే ఏం సమస్యలు వస్తున్నాయి ? (మార్కెట్‌లో కూరగాయలు కొనే వ్యక్తితో)
మహిమూద్ : పార్కిగ్ స్థలం లేక మార్కెట్‌కు రాలేకపోతున్నాం. కూరగాయలు, ఇతర వ్యాపారులకే స్థలం సరిపడా లేదు. వాహనాలు నిలిపేందుకు చోటు లేదు.
నాగలక్ష్మి : ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి?
మహిమూద్ : చెత్త చెదారం రోడ్లపై వేస్తున్నారు. మార్కెట్‌కు వస్తే చాలు ముక్కు మూసుకోవాల్సి వస్తోంది.
నాగలక్ష్మి : పారిశుద్ధ్యం ఎలా ఉంది ? (పక్కనే ఉన్న మరో వ్యాపారి చంద్రకాంత్‌తో)
చంద్రకాంత్ : మార్కెట్‌లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. చిరు వ్యాపారులు చెత్త రోడ్లపైనే వేస్తున్నారు. దీంతో వర్షం వస్తే నానా ఇబ్బందులు పడుతున్నాం.
నాగలక్ష్మి : ఇంకా సమస్యలు ఉన్నాయా?
చంద్రకాంత్ : పార్కింగ్ సమస్య కూడా తీవ్రంగా ఉంది.
నాగలక్ష్మి : ఏం అవ్వా? బాగున్నావా? ఏం అమ్ముతున్నావు?
బాబి (ఐలాపురం): ఆకు కూరలు అమ్మడానికి వచ్చా.
నాగలక్ష్మి : రోజూ అమ్ముతావా?
బాబి : ఆదివారం ఒక్క రోజే కొత్తిమీర, పుదీన అమ్మడానికి వస్త.
నాగలక్ష్మి : మార్కెట్‌లో అమ్మడానికి స్థలం ఉందా? ఎక్కడ అమ్ముకుంటావు?
బాబి : మార్కెట్‌లో స్థలం లేక నందిపాడు రోడ్డులో చికెన్ సెంటర్ వద్ద అమ్ముకుంటా.
అక్కడినుంచి తిరునగరు నాగలక్ష్మి 13వ వార్డులోని కలాల్‌వాడకు వెళ్లారు. అక్కడ ఇంటి బయట ఉన్న ఓ మహిళను పలకరించారు.
నాగలక్ష్మి : ఏమమ్మా..నీ పేరు ఏమిటి? మీకేమైనా సమస్యలు ఉన్నాయా?
మహిళ : నా పేరు నాగమణి, మురుగు కాలువ సగం నిర్మించారు. మిగతా సగం నిర్మించలేదు. చెత్తాచెదారంతో మురుగు కాలవలు నిండిపోతున్నయ్.
నాగలక్ష్మి : కాలువలు మున్సిపాలిటీ వారు తీయడం లేదా?
నాగమణి : తీసి నెల రోజులైంది. మురుగు కాలువలు తీయకపోవడం వల్ల దోమలు విపరీతంగా ఉన్నాయి.
నాగలక్ష్మి : ఏం అవ్వా .. పింఛను వస్తుందా?
ఎల్లమ్మ : రావట్లేదు.
నాగలక్ష్మి : గతంలో వచ్చిందా?
ఎల్లమ్మ : గతంలో ఇచ్చారు. ఇంటికి అధికారులు వచ్చి వెళ్లారు. అయినా పింఛన్ ఇవ్వడం లేదు.
నాగలక్ష్మి : మీ కాలనీలో ఏం సమస్యలు ఉన్నాయి.
బంటు శ్రీనివాస్ : డ్రెమినేజీ సమస్య తీవ్రంగా ఉంది. మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదు.
నాగలక్ష్మి : మీ సమస్యను ఎవరి దృష్టికి తీసుకెళ్లారు?
బంటు శ్రీనివాస్ : అధికారులకు చెప్పాం. అయినా పట్టించుకోలేదు. దోమలు బెడద ఎక్కువగా ఉంది.
నాగలక్ష్మి : ఏం చిన్నా చదువుకుంటున్నావా? (వికలాంగ విద్యార్థి గణేష్‌తో)
గణేష్ : చదువుకుంటున్నాను. కానీ నాకు పింఛన్ రావడం లేదు.
నాగలక్ష్మి : గతంలో పింఛన్ వచ్చిందా?
గణేష్ : గతంలో ఇచ్చారు. కానీ ఇప్పడు పింఛన్ల జాబితాలో పేరు రాలేదు.
నాగలక్ష్మి : సదరమ్ సర్టిఫికెట్ ఉందా?
గణేష్ : సర్టిఫికెట్ ఉంది. అయినా పింఛన్ రాలే.
నాగలక్ష్మి : అమ్మా.. మీ సమస్యలేంటి?
పిట్టల చంద్రమ్మ : మా కాలనీలో మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదు. చెత్త తీయడం లేదు. కాలనీకి వచ్చే వారు ముక్కు మూసుకొని వస్తున్నారు.
నాగలక్ష్మి : మున్సిపాలిటీ వారికి చెప్పారా?
చంద్రమ్మ : చెప్పినా ఏం లాభం లేదు?
నాగలక్ష్మి : ఇంకా సమస్యలు ఉన్నాయా?
చంద్రమ్మ : మంచినీళ్ల ట్యాంకు నిర్మించాలి. నల్లాలు కూడా చిన్నగా వస్తున్నాయి.