‘దారి’చూపుతా
యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం, ఆలేరు మండలం కొలనుపాక మధిర గ్రామమైన బైరాంనగర్ మధ్య 4 కిలోమీటర్ల మేర రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ దూరం వరకు డాంబర్ రోడ్డు వేస్తే.. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట నుంచి ప్రపంచప్రఖ్యాతి గాంచిన కొలనుపాక గ్రామంతోపాటు నల్లగొండ, మెదక్, వరంగల్ జిల్లాల మధ్య దూరం తగ్గుతుంది...ఇక.. బైరాంనగర్ ప్రజలది వింత పరిస్థితి. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా గ్రామానికి ఆర్టీసీ బస్ సౌకర్యం లేదు. గ్రామానికి రోడ్డులేదని ఆ గ్రామ యువకులకు పిల్లను ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి. ఇక.. ధర్మారెడ్డిగూడెం, బైరాంనగర్ గ్రామాల మధ్య రోడ్డు వసతి కల్పిస్తే మెదక్ జిల్లా గజ్వేల్, సిద్దిపేట, వరంగల్ జిల్లా జనగామకు దూరం తగ్గుతుంది. రైల్వేట్రాక్ సమస్యలు తీరిపోతాయి. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి ఆదివారం ‘సాక్షి ప్రతినిధి’గా మారి ఆయా గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆలేరు మండలం బైరాంనగర్, యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం నుంచి గొంగిడి సునీతారెడ్డి వీఐపీ రిపోర్ట్.
ఆలేరు మండలం కొలనుపాక మధిర గ్రామం బైరాంనగర్‌కు చేరుకున్న సాక్షి ప్రతినిధి గొంగిడి సునీతారెడ్డి అక్కడే ఉన్న మహిళలతో మాట్లాడారు.
గొంగిడి సునీత : అమ్మా బాగున్నావా, నీ పేరేమిటి?
మహిళ : మేడం బాగున్నాను. నా పేరు చిర్ర సుమలత. సంవత్సరాల తరబడి మా ఊరికి రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యం లేదు. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయమై ఎన్నో సార్లు గ్రామస్తులం యాదగిరిగుట్ట డిపో మేనేజర్‌కు వినతిపత్రాలు అందజేశాం. రోడ్డు లేదు, బస్సు రాలేదు.
సునీత : ఒకేనమ్మా..మీ సమస్య నాకు అర్థమైంది.. పాప.. నీ పేరేమి..ఏం చదువుకుంటున్నావు? (విద్యార్థినితో)
విద్యార్థిని : నా పేరు దివ్య. ఆలేరులో 8వ తరగతి చదువుకుంటున్నాను. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో బస్సు రావడం లేదు. అలాగే కొలనుపాక, బైరాంనగర్ గ్రామాల మధ్య ఉన్న వాగుపై వంతెన నిర్మించాల్సి ఉంది. చదువుకోవడానికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నాం.
సునీత : రోడ్డు సౌకర్యం కల్పిస్తే బస్సు వస్తుంది. ఆ ప్రయత్నం చేస్తా. అక్కడే ఉన్న మరో మహిళ లక్ష్మిని పలకరించారు. ఏమమ్మా..మీకు మంచినీళ్లు వస్తున్నాయా?
లక్ష్మి : మేడం. తాగునీళ్లు లేవు. గ్రామంలో నీటి శుద్ధి ప్లాంట్ లేదు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల నుపాకకు వెళ్లి ఫిల్టర్ నుంచి మంచినీటిని తెచ్చుకుంటున్నాం. గ్రామంలో మంచినీటి ఫిల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
సునీత : మీ సమస్యను నోట్ చేసుకుంటున్నా. ఎమ్మెల్యేను చూసిన పలువురు వృద్ధులు ఆమె దగ్గరకు వచ్చారు. వారిలో నంద మైసయ్య అనే వృద్ధుడితో సునీత మాట్లాడారు. ఏం పెద్దాయనా..పింఛన్ వస్తుందా?
నందమైసయ్య : పెన్షన్ కోసం దరఖాస్తు ఫారాన్ని సర్పంచ్‌కు అందజేశా. ఈ నెల పెన్షన్ అందలేదు. పెన్షన్ వస్తదో రాదో అర్థం కావడం లేదు.
సునీత : అర్హులందరికీ ప్రభుత్వం పింఛన్ ఇస్తుంది. మీరేం భయపడకండి. సునీత అక్కడినుంచి కొద్దిదూరం నడుచుకుంటూ అక్కడ ఉన్న ఓ మహిళ వద్దకు వెళ్లి..నీ పేరేమిటీ? ఎందుకమ్మా..అలా ఉన్నావు..?
మహిళ : మేడం నా పేరు నంద నిర్మల. ఫ్లోరిన్ సమస్యతో వెన్నుపూస వంగిపోయింది. ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందడం లేదు. మందులు వాడుతున్నాను. నెలనెలా మందుల కోసం డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఆరోగ్య పరంగా ఆదుకోవాలి. ఇప్పటి వరకు 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి.
సునీత : చూడమ్మా..ఏం బాధపడకు. ప్రభుత్వ పరంగా సహకారం కోసం నా వంతు కృషి చేస్తా. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ రైతు బుచ్చిరెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడారు.
సునీత : ఏం పెద్దాయన గ్రామానికి 108 వాహనం వస్తుందా?
బుచ్చిరెడ్డి : గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 108 కాదు కదా.. ఏ వాహనమూ రావడం లేదు. మా ఊరికి పిల్లనివ్వాలంటే కూడా భయపడుతున్నారు.
సునీత : బాబు.. మీ ఊర్లో ఆటోలు ఉన్నాయా? (పక్కనే ఉన్న నంద మహేందర్‌తో)
నంద మహేందర్ : మాఊర్లో ఆటోలు లేవు, బస్‌లు రావు, ఎవరికైనా ఆపతి వస్తే 250 రూపాయలు ఇస్తే కొలనుపాక నుంచి ఆటో వస్తుంది. అక్కడినుంచి ఆలేరుకు వెళ్లాలి. లేదంటే ఇక అంతే. బస్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది.
సునీత : బాబు ఏం చేస్తున్నావు? (మరో యువకుడు శ్రీరామ్‌తో)
శ్రీరామ్ : నేను భువనగిరిలో ఎమ్మెస్సీ చదవుతున్నాను. గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాక వరకు సైకిల్‌పై పోయి అక్కడినుంచి బస్‌లో భువనగిరికి పోతా. తిరిగి అలాగే ఇంటికి చేరుకుంటాను. రోడ్డుసౌకర్యం ఏర్పడితే చాలామంది చదువుకోవడానికి వెళ్తారు. కనీస వసతులు లేక చదువు అర్ధంతరంగా ఆగిపోతుంది. మీరే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి.
సునీత : ఏం సర్పంచ్ శ్రీనివాస్ గారు..గ్రామసమస్యలను చెప్పండి (ఆయన పక్కనే ఉన్నారు)
గంగుల శ్రీనివాస్ : గ్రామంలో ప్రధానంగా సీసీ రోడ్డు వేయించాలి. ప్రధానం రోడ్డు సౌకర్యం లేక విద్యార్ధులు చదవలేకపోతున్నారు. బైరామ్‌నగరం- కొలనుపాకల మధ్య వాగుపై వంతెన నిర్మించాలి, నీటిశుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి.
సునీత : మీ సమస్యలు, బాధ నాకు అర్థమైంది. సాధ్యమైనంత త్వరలో పరిష్కారమయ్యేలా చూస్తా.
సరేనండి..మీరేం కోరుకుంటున్నారు (పక్కనే ఉన్న ఎంపీటీసీ మాజీ సభ్యుడు అంజయ్యతో)
అంజయ్య : మేడం.. నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఉపాధి హామీలో రోడ్డు కోసం కొంత పనిచేశాం. కొలనుపాక వాగుపై కల్వర్టులు , రోడ్డు లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం వస్తే చాలా కష్టం, ప్రమాదం జరిగితే సరైన వాహన సౌకర్యం అందుబాటులో ఉండదు కాబట్టి రోడ్డు వసతిని వెంటనే కల్పించాలి.
సునీత అక్కడినుంచి రోడ్డు మార్గం గుండా యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం వచ్చారు.. అక్కడ పెద్దఎత్తున గుమిగూడిన మహిళలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగితెలుసుకున్నారు. అక్కడే
సునీత : సదరం సర్టిఫికెట్ తీసుకున్నావా? (యాదమ్మ అనే వికలాంగురాలితో)
యాదమ్మ : సర్టిఫికెట్ అంటే ఏమిటో నాకు తెలియదు, వికలాంగుల పింఛన్‌కోసం దరఖాస్తు చేసుకున్నా. సదరం క్యాంపు ఉందని నాకు ఎవరూ చెప్పలేదు. ఆ విషయం తెలియదు. మీరు ఎలాగైనా పింఛన్ ఇప్పించాలి.
(యాదమ్మకు భరోసానిచ్చిన సునీత..అంతటితో
రిపోర్టింగ్ ముగించారు.)