=16 నుంచి స్పెషల్ డ్రైవ్
=బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ కిషన్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రతిఒక్కరికీ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం బ్యాంకర్ల జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18 ఏళ్ల పైబడిన వారు జనాభాలో 20 లక్షలకు పైగా ఉంటే... 8 లక్షల మందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయన్నారు. ఆర్‌బీఐ నిబంధలన ప్రకారం ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతాలు ఉండాలన్నారు. ప్రస్తుతం 12 లక్షల మందికి జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచేందుకు చ ర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈమేరకు విసృ్తత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని జిల్లా లీడ్ బ్యాంకు అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం గ్రామ ఆదర్శ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. గతంలో శాంతి భద్రతల కారణంగా ఇతర ప్రాంతాలకు తరలించిన 31 బ్యాంకులను తిరిగి సంబంధిత సర్వీసు ప్రాంతాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గత ఖరీఫ్‌లో జిల్లాలో రూ.1,260 కోట్ల పంట రుణాలను అందించాలని లక్ష్యం నిర్ధేశించుకోగా... రూ. 985.31 కోట్లను అందించామన్నారు. 79 శాతం మేర లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు.
ప్రస్తుత రబీ సీజన్‌లో రూ.540 కోట్లను పంట రుణాలుగా అందించాలన్న లక్ష్యాన్ని వంద శాతం చేరుకునేందుకు కృషి చేయాలని బ్యాంకర్లకు సూచించారు. బంగారుతల్లి, స్కాలర్‌షిప్‌లు, పింఛన్‌దారులకు వెంటనే బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు సహకరించాలన్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లతోపాటు సెట్వార్, ఐటీడీఏల ద్వారా అందించే పథకాలకు వెంటనే బ్యాంకు రుణాలను అందించాలన్నారు.
2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 12,026 మహిళా గ్రూపులకు రూ.266.86 కోట్ల బ్యాంకు రుణాలను అందించినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఎస్.విజయ్‌గోపాల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం సర్కార్, నాబార్డ్ ఏజీఎం ఉదయభాస్కర్, లీడ్ బ్యాంక్ అధికారి దత్‌తోపాటు వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికీ జీరో బ్యాలెన్స్ ఖాతాలు
Published Sat, Jan 4 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement