ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇనాపరేటివ్‌గా మారిన ఖాతాల సంఖ్యను సత్వరమే తగ్గించుకోవాలని బ్యాంక్‌లను ఆర్‌బీఐ కోరింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇనాపరేటివ్ ఖాతాలకు సంబంధించి గణాంకాలను ప్రతీ త్రైమాసికానికి ఒకసారి ఆర్‌బీఐకి నివేదించాలని కోరింది.
ఈ తరహా ఇనాపరేటివ్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిధులు ఉండిపోవడం పట్ల ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని సమస్యల కారణంగా ఖాతాలు నిరుపయోగంగా లేదా స్తంభించిపోయినట్టు తమ తనిఖీల్లో తెలిసినట్టు వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని బ్యాంకుల్లో ఈ తరహా ఖాతాల సంఖ్య అధికంగా ఉండడం, వాటిల్లో నిధులు ఉండిపోవడాన్ని ఆర్‌బీఐ గుర్తించింది.
దీంతో వాటిని తగ్గించుకోవాలని, సులభంగా యాక్టివేట్ చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడాన్ని సైతం పరిశీలించాలని పేర్కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023 చివరి నాటికి ఇనాపరేటివ్ ఖాతాలలో రూ. లక్ష కోట్లకు పైగా డిపాజిట్‌లు స్తంభించాయి. వీటిలో రూ. 42,270 కోట్లు అన్‌క్లెయిమ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.
ఇదీ చదవండి: ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా..?
ప్రభుత్వరంగ ఎస్‌బీఐ ఇప్పటికే ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం గమనార్హం. ఇక కస్టమర్లకు సంబంధించి ఆధార్ అప్‌డేటెషన్ సేవలను సైతం అందించాలని, ఆధార్ ఆధారిత సేవలకు వీలు కల్పించాలని బ్యాంక్‌లను ఆర్‌బీఐ కోరింది. ఇనాపరేటివ్ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేందుకు కస్టమర్లు బ్యాంక్ శాఖలను సంప్రదించినప్పటికీ, పేరు ఇతర వివరాలు సరిపోకపోవడం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment