సమస్యలు హెవీ ! | Heavy problems | Sakshi
Sakshi News home page

సమస్యలు హెవీ !

Published Wed, Nov 19 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

సమస్యలు హెవీ !

సమస్యలు హెవీ !

ప్రభుత్వ యంత్రాంగం ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ధాన్యం సేకరణకు పలు అడ్డంకులు ఎదురుకానున్నాయి.  గత ఏడాది నుంచి కొత్త షావుకార్లుగా చెప్పుకుంటున్న పౌరసరఫరాల శాఖ సిబ్బంది  ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ నిబంధనలు, చెల్లింపులకు సింగిల్ విండో విధానం లేకపోవడం, సిబ్బంది కొరత  గుదిబండగా తయారయ్యాయి.   మరో వైపు రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని ఎగరేసుకుపోడానికి దళారులు కాపుకాసి ఉన్నారు.
 
 విజయనగరం కంటోన్మెంట్ :   ఈ ఏడాది డ్వాక్రా మహిళా సంఘాలు, సహకార పరపతి సంఘాలతో ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు.     ఇప్పటికే జిల్లాలోని 81 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.  డ్వాక్రా సంఘాల ద్వారా 61 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా మరో 20 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆయా గ్రామాలు, వార్డులను ఇప్పటికే గుర్తించారు.   ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో నాట్లు ఆలస్యమైన కొన్ని చోట్ల మినహా దాదాపుగా సంతృప్తికరంగా ఉభాలు జరిగాయని భావిస్తున్నారు.  దిగుబడిలో 30 శాతం సొంత అవసరాలకు పోగా మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు.  80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని   లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.   ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ ఉద్యోగులను కూడా భాగస్వాములను చేస్తున్నారు. సివిల్ సప్లైస్ డీటీలు, వ్యవసాయ శాఖ సిబ్బందిని కూడా నియమించి, వారికి   బాధ్యతలను అప్పగించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.  వారు ఉన్న నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలుకు అనుమతులిస్తారు. దీంతో  రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది.
 
 సవాలక్ష నిబంధనలు
   ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేసే సమయంలో  నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి.  ధాన్యం కొనుగోలులో వ్యర్థపదార్థాలు  ఒక శాతం, చెత్త, పొల్లు ఒక శాతం మాత్రమే ఉండాలి. అంత కన్నా ఎక్కువ ఉన్నట్టు తేలితే సంబంధిత ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. ఈ కారణంగా సిబ్బంది నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు.  రంగుమారిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యం ఐదు శాతం మించి ఉండకూడదు.  పూర్తిగా తయారు కాని ధాన్యం మూడు  శాతం మించి ఉండకూడదు.  నాణ్యత లేని ధాన్యం ఇందులో కల్తీ అవకూడదు. అటువంటి ధాన్యం ఆరు శాతం మించి ఉండకూడదు. ముఖ్యంగా ధాన్యంలో తేమ శాతం 17 శాతం మించి ఉండకూడదు. ఈ పరీక్షలన్నీ చేశాక అధికారులు ధాన్యం తీసుకుంటారు. దీని బదులు సాధారణ వ్యాపారులయితే ఇన్ని పరీక్షలు లేకుండా కొంచెం చేత్తో నలిపి బియ్యం రంగు చూసి కొనుగోలు చేస్తారు.
 
 చెల్లింపుల్లో జాప్యం
   ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యానికి చెల్లింపులు వెంటవెంటనే జరుగవన్న అపవాదు ఉంది.  నిబంధనల ప్రకారం కనీసం వారం రోజుల్లో ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ అంతకన్నా ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.  చెక్కుల రూపంలో చెల్లింపులు చేయడం వల్ల రైతులు ప్రభుత్వానికి ధాన్యం విక్రయించేందుకు ముందుకు వచ్చే అవకాశం లేదు.    ప్రైవేటు వ్యాపారులయితే వెంటనే డబ్బులు ఇస్తారని రైతులు చెబుతున్నారు.
 
 అడ్వాన్సులతో పొంచిఉన్న వ్యాపారులు, దళారులు
    మిల్లర్లు, వ్యాపారులతో పోటీ పడి ధాన్యాన్ని కొనుగోలు చేద్దామని పౌరసరఫరాల శాఖ అనుకుంటున్నప్పటికీ అది సాధ్యంకాని పనిలా కనిపిస్తోంది.  ఇప్పటికే  వ్యాపారులు, దళారులు... రైతులకు కొంత నగదును అడ్వాన్సుగా ఇచ్చి ఉన్నారు. అడ్వాన్సు తీసుకున్న రైతులు తప్పనిసరిగా ఆ వ్యాపారికే ధాన్యం విక్రయించాయి. దీంతో వ్యాపారులు తాము కొనాల్సిన ధాన్యాన్ని ముందుగానే రిజర్వు చేసుకున్నట్టవుతోంది. తాము ఎంత ధాన్యం కొనగలమో ప్రైవేటు వ్యాపారులు చెబుతుంటే, దానికి భిన్నంగా అధికారులు తాము ఎంత కొనుగోలు చేయగలమో తెలిపే పరిస్థితి లేదు. లక్ష్యం మాత్రం 80వేల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించుకున్నారు.
 
 సిబ్బంది కొరత
 జిల్లాలో ధాన్యం సేకరణకు సిబ్బంది కొరత వేధిస్తోంది. గతంలో ఔట్‌సోర్సింగ్ నుంచి కొంతమందిని నియమించుకున్నారు. ఇప్పటివరకూ ఈ విషయంలో స్పష్టత లేదు. అదేవిధంగా సివిల్ సప్లైస్ శాఖలో మేనేజర్ పోస్టు ఇన్‌చార్జి అధికారి నిర్వహిస్తున్నారు. కేవలం  ఇద్దరు సహాయ మేనేజర్లుండగా వారితో కొనుగోలు కార్యక్రమం నిర్వహిస్తారనుకుంటే ఆ ఇద్దరు మేనేజర్లకు బదిలీ చేశారు.  వీరిద్దరి స్థానంలో ఇద్దరిని నియమించాల్సి ఉండగా కేవలం శ్రీకాకుళం నుంచి వరసయ్య అనే అధికారిని నియమించారు. మరో పక్క కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలకు సంబంధించి సిబ్బంది నియామకం పక్కాగా ఉండాలి. కానీ ఇవేమీ కనిపించే పరిస్థితి లేదు.  
 
 కొనుగోలు చేస్తాం
 జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పక్కాగా ఏర్పాటు చేశాం. వీటి ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తాం. ఈ నెలాఖరు నుంచే కొనుగోలు కేంద్రాలు  ప్రారంభిస్తాం. జాయింట్‌కలెక్టర్ బి రామారావు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని పకడ్బంధీగా చేపడతాం.
   -ఎం గణపతిరావు, ఇన్‌ఛార్జి మేనేజర్,
 జిల్లా పౌరసరఫరాల శాఖ, విజయనగరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement