మహిళల కన్నెర్ర | Tasmac liquor shops Women's groups Lock shops | Sakshi
Sakshi News home page

మహిళల కన్నెర్ర

Published Tue, Oct 14 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

మహిళల కన్నెర్ర

మహిళల కన్నెర్ర

టాస్మాక్ మద్యం దుకాణాలపై మహిళా సంఘాలు కన్నెర్ర చేశాయి. మహిళా సంఘాలు, యువజన సంఘాల నేతృత్వంలో మంగళవారం టాస్మాక్ దుకాణా లకు తాళం వేసే కార్యక్రమం చేపట్టారు. పలుచోట్ల దుకాణాలకు తాళం వేశారు. దీన్ని అడ్డుకునే క్రమంలో మహిళా, యువజన సంఘాలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
 
 సాక్షి, చెన్నై:రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధమే లక్ష్యంగా అనేక పార్టీలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, ఆలయాలు, పాఠశాలల పక్కన ఉన్న టాస్మాక్ దుకాణాలను తొలగిం చాలని డిమాండ్ చేస్తూ తరచూ ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ‘టాస్మాక్ దుకాణాలకు తాళం’ అనే నినాదంతో మహిళా సంఘాలు, యువజన సంఘాలు నిరసన బాట పట్టాయి. రాష్ట్రంలో పలుచోట్ల దుకాణాలకు తాళం వేశారు. ఈ తాళాల్ని పగులగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వాటిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. తోపులాటలు, వాగ్యుద్ధాలు సాగాయి. కొన్నిచోట్ల మహిళల సంఖ్యకు తగ్గట్టుగా మహిళా పోలీసులు లేక పోవడంతో పోలీసులు చోద్యం చూడక తప్పలేదు. నగరంలోని కోయంబేడు మార్కెట్లో నాలుగు మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిని టార్గెట్ చేసి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉదయాన్నే ఆ దుకాణాలకు తాళం వేసే పనిలో పడ్డాయి.
 
 రెండు దుకాణాలకు తాళం వేశారు. మరో రెండు దుకాణాలకు తాళం వేసే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసిస్టెంట్ పోలీసు కమిషనర్ మోహన్ రాజు నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు రఘుపతి, శివకుమార్, హరికుమార్ అక్కడికి చేరుకుని ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు రావడంతో వారిని కట్టడి చేయడానికి శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి దుకాణానికి తాళం వేస్తుండగా అతడిపై పోలీసులు ప్రతాపం చూపించడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల తీరును దుయ్యబడుతూ ప్రధాన మార్గంలో రాస్తారోకోకు దిగారు. దీంతో వాహనాల రాక పోకలు స్తంభించారుు. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మహిళల్ని బుజ్జగించారు. మాధవరంలో మహిళా సంఘం నాయకురాలు తమిళ్‌సెల్వి నేతృత్వంలో రెండు దుకాణాలకు తాళం వేశారు. వీటిని తొలగించే క్రమంలో మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్యుద్ధం చోటు చేసుకుంది. పోలీసుల తోపులాటలో ఐదుగురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. వ్యాసార్పాడి, శర్మా నగర్, సెంగుండ్రంలోని మూడు టాస్మాక్ దుకాణాలకు మహిళలు తాళం వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement