
జిల్లాకో పాల శీతలీకరణ కేంద్రం
మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుకు సర్కారు నిర్ణయం
ఒక్కో కేంద్రంలో రెండు లక్షల నుంచి మూడు లక్షల లీటర్ల సేకరణ
హైదరాబాద్: తెలంగాణలో పాడిపరిశ్రమ అభివృద్ధికి, ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాల సేకరణ, పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ఒక పాల శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఒక్కోదాంట్లో రెండు లక్షల నుంచి మూడు లక్షల లీటర్ల పాలు సేకరించి, శీతలీకరణ చేయడానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పాల వ్యాపారానికి విపరీతమైన అవకాశాలు ఉన్నందున రైతులకు దీని నుంచి అదనపు ఆదాయం సమకూర్చే విధంగా కార్యక్రమాలు రూపొందించనుంది.
ఒక్క హైదరాబాద్‌లో ప్రతీరోజు 20 లక్షల లీటర్లపాలు విక్రయిస్తుంటే.. అందులో ప్రభుత్వ పాల డెయిరీ నుంచి కేవలం నాలుగు లక్షల లీటర్ల పాలు మాత్రమే సేకరిస్తున్నారని, ఇందులోనూ లక్ష లీటర్లు కర్ణాటక నుంచి వస్తుండగా, మూడు లక్షల లీటర్లు తెలంగాణ నుంచి వస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. ఇక్కడ పాల ఉత్పత్తికి అవకాశాలు ఉన్నందున రైతులను, మహిళా సంఘాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రస్తుతం పాల శీతలీకరణ కేంద్రాలు లేక పాల సేకరణ కూడా సరిగా సాగడంలేదన్నారు. అలాగే తెలంగాణలో మత్స్య సంపదను పెంచడానికి కోల్‌కతాకు చెందిన సంస్థతో సంప్రదించినట్లు ఆయన వెల్లడించారు.