మంత్రి సవిత నియోజకవర్గంలో టీడీపీ నేతల బరి తెగింపు
ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా..కర్ణాటకకూ తరలింపు
పోలీసులు పట్టుకొంటే స్టేషన్లలోనే బెదిరింపులు
చూసీ చూడనట్లు రెవెన్యూ అధికారులు
బోర్లు ఎండిపోయి, వ్యవసాయానికి నష్టమంటున్న రైతులు
పెనుకొండ: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. నియోజకవర్గం పరిధిలోని పెన్నా నదితో పాటు వాగులు, వంకల్లోని ఇసుకను టీడీపీ నేతలు కొల్లగొడుతున్నారు. నిత్యం ట్రాక్టర్లలో సమీప పట్టణాలకు, కర్ణాటకలోని ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వీరు ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వేయడం వల్ల బోర్లు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
టీడీపీ, జనసేన నాయకులు పలువురు నియోజకవర్గంలోని శెట్టిపల్లి, కొండంపల్లి, గోనిపేట, రొద్దం, పరిగి వద్ద పెన్నా నది నుంచి ఇసుక భారీగా తోడేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకను నియోజవర్గ పరిధిలో వారికి రూ.2 వేల నుంచి రూ.2,500కు విక్రయిస్తున్నారు. కర్ణాటక ప్రాంతాలకు లోడుకు రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీరి అక్రమ రవాణాను పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.
ఎక్కడైనా పోలీస్ సిబ్బంది ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటే డబ్బు బెదిరించి విడిపించుకొని పోతున్నారు. ఇసుక తోలుకోమని మంత్రే చెప్పారని, అడ్డుకుంటే మీ కథ చూస్తామంటూ బెదిరిస్తున్నారు. అయినా ట్రాక్టర్లను పోలీసుస్టేషన్‌కు తరలిస్తే పెద్దఎత్తున కూటమి నాయకులు అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇసుక వ్యవహారంలో తలదూర్చడమే లేదు.
బోర్లు ఎండిపోతాయి
కొందరు నాయకులు రోజూ ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వేసి, తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది వ్యవసాయాన్ని దెబ్బ తీస్తుంది. ఇసుక రీచ్‌ల సమీపంలోని భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇసుక అవసరం ఉన్న వారు తగిన అనుమతి పొంది తోలుకుంటే మంచిదే. కానీ ఇది వ్యాపారంగా మారిపోయింది. శెట్టిపల్లి, కొండంపల్లి, గోనిపేట ప్రాంతాల నుంచి ఇసుక భారీగా తరలివెళుతోంది. వంకలు, వాగులు కూడా త్వరలోనే ఖాళీ కానున్నాయి. – గోపాలరెడ్డి, కొండంపల్లి, పెనుకొండ మండలం
Comments
Please login to add a commentAdd a comment