ఫీజు రాయితీలో ‘అక్రమార్కులు’ | Discounted fees in the 'Irregulars' | Sakshi
Sakshi News home page

ఫీజు రాయితీలో ‘అక్రమార్కులు’

Published Sat, Jan 17 2015 12:45 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

ఫీజు రాయితీలో ‘అక్రమార్కులు’ - Sakshi

ఫీజు రాయితీలో ‘అక్రమార్కులు’

మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ మండలం జంగారెడ్డిపల్లికి చెందన ఓ విద్యార్థి ఇబ్రహీంపట్నం లోని గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్న ఆ విద్యార్థి రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి ఫీజు రాయితీతోపాటు ఉపకారవేతనం పొందుతున్నాడు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో ఉచితంగా వసతి పొందుతున్నాడు. అయితే ఆ విద్యార్థి తండ్రి ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగి.
     కేవలం ఒక విద్యార్థి మాత్రమే కాదు.. జిల్లాలో ఫీజురాయితీ పొందుతున్న మూడులక్షల మంది విద్యార్థుల్లో పెద్ద సంఖ్యలో ఇలాంటి సర్కారు ఉద్యోగం చేసే వారి పిల్లలు అక్రమంగా లబ్ధి పొందుతున్నారు.
 
 * సర్కారు కొలువులున్నా.. వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్!
* జిల్లాలో పెద్దఎత్తున అనర్హులు
* క్రిమినల్ కేసులకు సిద్ధమవుతున్న అధికారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పేదవిద్యార్థులకు ఉన్నత విద్యనందించాలనే సదుద్దేశం తో తలపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో అక్రమార్కులు చొరబడ్డారు. రూ.లక్షల ప్రజాధనాన్ని అప్పనంగా స్వాహా చేస్తూ ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమార్కులు దర్జాగా లబ్ధిపొందుతుండగా.. అసలైన అర్హులు మాత్రం సీట్లు దొరక్క చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు.

సంక్షేమశాఖ అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్య, సాంకేతిక విద్య, పీజీ తదితర కేటగిరీలకు సంబంధించి 1,054 కాలేజీలున్నాయి. ఇందులో వసతులు, అనుమతులు, ఇతర కారణాలవల్ల కొన్ని కాలేజీలు మూతపడడంతో ప్రస్తుతం 935 కాలేజీలు కొనసాగుతున్నాయి. వాటిల్లో దాదాపు 3లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రస్తుత మొదటి సంవత్సరం విద్యార్థులను మినహాయిస్తే.. 1,45,992 మంది విద్యార్థులు ఇప్పటికే ఒక ఏడాదికిపైగా ఫీజు రాయితీ, ఉపకారవేతనాలు పొందారు.

హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, జిల్లాలో రికార్డుస్థాయిలో కాలేజీలుండడంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉన్నాయి. ప్రభుత్వం ఉన్నత విద్యకోసం భారీగా నిధులు ఖర్చు చేస్తుండడం,  క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండా అధికారులు సర్టిఫికెట్లు ఇస్తుండడం అక్రమార్కులకు వరంగా మారింది. దీంతో తప్పుడు వివరాలు సమర్పించి ఫీజు రాయితీ పొందుతున్నారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌లో పారదర్శకతకోసం చర్యలు చేపడుతోంది. మరోవైపు జిల్లాలో అక్రమార్కుల వివరాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
 
ఇద్దరిపై క్రిమినల్ కేసులు
పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రాయితీ నిధుల్లో అక్రమాల తంతు భారీగానే ఉంది. అయితే అక్రమంగా ఫీజులు పొందేవారి వివరాలతో సంక్షేమశాఖకు ఫిర్యాదు వస్తేనే ఆయా అధికారులు స్పందిస్తున్నారు. గతేడాది ఇలా ఇద్దరు విద్యార్థుల అక్రమ భాగోతంపై అధికారులకు ఫిర్యాదులందాయి. దీంతో ఆ ఇద్దరి ఆర్థికస్థితిపై విచారణ చేపట్టిన బీసీ సంక్షేమశాఖ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయగా.. ప్రస్తుతం ఈ విషయంపై న్యాయ విచారణ సాగుతోంది.

ఇటీవల మరికొన్ని ఫిర్యాదులు సైతం బీసీ సంక్షేమశాఖకు అందగా.. వాటిపై ప్రాథమిక విచారణ చేపడుతున్నట్లు సమాచారం. నిబధనలకు విరుద్ధంగా ఫీజురాయితీ పొందేవారి వివరాలు సమర్పిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఉప సంచాలకులు వి.వి.రమణారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement