ఆ విగ్రహాల ‘ఇనుము’ అక్రమార్కుల పరం | ganesh idols iron illegally sail | Sakshi
Sakshi News home page

ఆ విగ్రహాల ‘ఇనుము’ అక్రమార్కుల పరం

Published Mon, Sep 19 2016 6:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

ఆ విగ్రహాల ‘ఇనుము’ అక్రమార్కుల పరం - Sakshi

ఆ విగ్రహాల ‘ఇనుము’ అక్రమార్కుల పరం

సాక్షి, సిటీబ్యూరో: దేవుడి విగ్రహాల తుక్కునూ వదిలిపెట్టకుండా రూ.కోట్లు స్వాహా చేస్తున్న ఘనుల భాగోతమిది.. భక్తజన నీరాజనాలతో నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడి విగ్రహాల తయారీలో వినియోగించే ఇనుము ఇపుడు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నగరంలో వినాయకనిమజ్జనం పూర్తయిన ప్రతిసారీ ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోన్న తంతు ఇది. వీరికి కళ్లెం వేయడం తమ పరిధిలో లేదని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు పేర్కొంటున్నారు.  

విలువ రూ.5 కోట్లు..?
ఈసారి హుస్సేన్‌సాగర్‌లో నవరాత్రుల సందర్భంగా సుమారు 56 వేల విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. సుమారు పదివేల టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. ఇందులో ఇనుము(ఉక్కు) మూడువేల టన్నులు అంటే..30 లక్షల కిలోలు తుక్కుగా లభ్యమైందని అంచనా. దీనికి కిలో రూ.16 చొప్పున అక్రమార్కులు విక్రయించి సుమారు రూ.5 కోట్లు స్వాహా చేసినట్లు సమాచారం. నిమజ్జనం అనంతరం హుస్సేన్‌ సాగర్‌లో వ్యర్థాలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి హుస్సేన్‌సాగర్‌లో 56 వేల  విగ్రహాలతోపాటు సాగర్‌లోకి చేరుకున్న ఎటువంటి వ్యర్థాలైనా తొలగించాల్సి ఉంది. ఇటీవల ఈ బాధ్యతను హెచ్‌ఎండీఏ తీసుకుంది.

సాగర్‌ జలాశయం నుంచి తొలగించిన వ్యర్థాలన్నింటిని లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న డంపింగ్‌ యార్డులో వేస్తున్నారు. అక్కడి జీహెచ్‌ఎంసీ వాటిని తరలించాల్సి ఉంది. అయితే ఏటా నిమజ్జనం అవుతున్న విగ్రహాల నుంచి ఇనుమును కొందరు వ్యక్తులు తీసుకుని అమ్ముకుంటున్నారు. ఈ సారి కూడా వీరు అదే పనిలో నిమగ్నమయ్యారు. వద్దని వారించే సాహసం అధికారులు చేయలేకపోతున్నారు. నిమజ్జనం కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఎన్‌టీఆర్‌ మార్‌్గతోపాటు ట్యాంక్‌బండ్‌పై మొత్తం 23 క్రేన్లు ఏర్పాటు చేశారు.

ఆయా క్రేన్లు నిమజ్జనం చేసిన విగ్రహాల నుంచి ఇనుము తీసి అక్కడే పోగేస్తున్నారు. దీన్ని గంపగుత్తగా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు చేతులు కలిపి పెద్ద ఎత్తున ఉక్కును సేకరిస్తున్నారు. పెద్ద ఎత్తున పోగుచేసి ఒకేసారి అమ్మి కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులే నేరుగా నిమజ్జన ప్రాంతాల నుంచి వాహనాల్లో ఉక్కును తీసుకెళ్తున్నారు.

ఆదాయ వనరే అయినా..
సాధారణంగా ఆదాయ వనరులను పెంచుకునేందుకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తాయి. ఇందులో భాగంగా కొత్త మార్గాలను కూడా అన్వేషిస్తాయి. కాని నగరంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వినాయక విగ్రహాల ద్వారా వచ్చే ఇనుము ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా చెప్పవచ్చు. హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం అయ్యే విగ్రహాల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. అంతేస్థాయిలో విగ్రహాలకు వాడే స్టీల్‌ కూడా పెరుగుతున్నట్లే. అయితే ఏటా వేల టన్నుల ఇనుమును తుక్కుగా విక్రయించడం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం తప్పక వస్తోంది.

ఈ కాసుల రుచికి మరిగిన చాలా మంది ప్రైవేటు వ్యక్తులు ఏళ్లుగా ఇనుమును సేకరించి విక్రయిస్తున్నారు. ఎటువంటి ఖర్చు లేకుండా కోట్లు వెనకేసుకుంటున్నట్లు అధికారులే స్వయంగా చెబుతుండడం విషయం. ఇంత పెద్ద మొత్తంలో ఇనుము ద్వారా డబ్బులు అక్రమార్కుల జేబుల్లోకి పోతున్నా.. ఆదాయ వనరుగా మలచుకోవడంలో ప్రభుత్వ శాఖలు తీవ్రంగా విఫలమయ్యాయి. మొత్తం స్టీల్‌ని సేకరించి బహిరంగ వేలం వేస్తే.. అనుకున్న దానికంటే ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారులకు తెలియక కాదు. రాజకీయ అండదండలతో ఏమీ చేయలేకపోతున్నామని వారు నర్మగర్భంగా చెబుతున్నారు.

టెండర్‌ వేస్తే బాగుంటుంది..
నిమజ్జమైన విగ్రహాల ఇనుమును సేకరించి వేలం వేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. వ్యర్థాల వెలికితీత పనుల్ని ప్రభుత్వం చేయిస్తుండగా.. దాన్ని ఫలితాన్ని మాత్రం వ్రైవేటు వ్యక్తులు అనుభవిస్తున్నారు. దినికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. స్థానిక వ్యక్తులు గ్రూప్‌గా ఏర్పడి ఇనుమును తీసుకెళ్లి అమ్ముకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాల తొలగింపులో భాగంగా వచ్చే ఇనుమును వేలం వేసే అంశాన్ని జీహెచ్‌ఎంసీ పరిశీలించాలి.
                       – టి.చిరంజీవులు, హెచ్‌ఎండీఏ కమిషనర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement