చౌకదుకాణాల్లో కాలం చెల్లిన గోధుమ పిండి
సివిల్ సప్లయ్ గోడౌన్ నుంచి రేషన్ దుకాణానికి
నెంటూరులో వెలుగు చూసిన బాగోతం
సీఎం ఇలాఖాలో ఇదేమి చోద్యం
వర్గల్ : రోజుకో రకమైన దందా వెలుగు చూస్తున్నాయి. అధికారుల ఉదాసీన వైఖరితో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రజారోగ్యాన్ని ప‘రేషన్’ చేస్తున్నారు. వారు చేసే ప్రయోగాలకు బీదోడే బలవుతున్నాడు. కాలం చెల్లిన గోధుమ పిండిని పేద ప్రజలకు అంటకడుతున్నా అధికారులు మొద్ద నిద్ర వీడడంలేదు. ఏకంగా సీఎం ఇలాఖాలో ఈ దందా సాగుతున్నా చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు చేపట్టడంలేదు.
ప్రభుత్వం బియ్యం, చక్కెరతోపాటు గోధుమ పిండి, పప్పు తదితర నిత్యావసర సరుకులను చౌక ధరల దుకాణాలు (రేషన్ దుకాణాలు) ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నది. ఈ సరుకులను కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీ సివిల్ సప్లయ్ గోడౌన్‌కు చేరవేస్తోంది. వీటి నాణ్యతను అక్కడి గోడౌన్ ఇన్‌చార్జ్ పరిశీలించి డీలర్లకు అందజేస్తారు. అయితే వర్గల్ మండలానికి గజ్వేల్ సివిల్ సప్లయ్ గోడౌన్ ద్వారా రేషన్ సరుకులు సరఫరా అవుతాయి. ఇక్కడి గోడౌన్‌కు కాలం చెల్లిన గోధుమ పిండి ప్యాకెట్లు చేరాయి.
అయితే ప్యాకెట్ల మీద పాత తేదీలు కనపడకుండా కొత్త తేదీలతో కూడిన స్టిక్కర్లు అంటేశారు. ఇదిలాఉండగా ఆ గోధుమ పిండి ప్యాకెట్లలో కొన్నింటిని నెంటూర్ రేషన్ డీలర్‌కు గత నెల ఏప్రిల్ 13న అంటగట్టారు. డీలర్ సైతం తేదీలను చూడకుండా గ్రామస్తులకు వాటిని పంపిణీ చేశారు. స్టిక్కర్లు అంటేసి ఉన్న గోధుమ పిండి ప్యాకెట్లు చూసి కొందరు గ్రామస్తులు అనుమానంతో పరిశీలించగా అసలు విషయం బయటపడింది. స్టిక్కర్ల కింద 2014 ప్రత్యక్షం కావడంతో సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. పేద ప్రజలను మోసగించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా అధికారులకు నివేదిస్తాం
నెంటూరు రేషన్ దుకాణం ద్వారా కాలం చెల్లిన గోధుమ పిండి విక్రయించిన వ్యవహారం నా దృష్టికి వచ్చింది. సరుకులు వెనక్కు తెప్పించి వినియోగదారులకు నాణ్యమైన గోధుమ పిండి ప్యాకెట్లు పంపిణి చేస్తాం. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. అక్రమార్కులపై చర్యలు తప్పవు.
- శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్, వర్గల్
స్టిక్కర్లు గమనించలేదు
గోడౌన్‌లోకి సరుకులు వచ్చిన సందర్భంలో గోధుమ పిండి ప్యాకెట్ల మీద ఎక్స్‌పైరీ తేదీలు కనపడకుండా స్టిక్కర్లు అంటించి ఉన్న విషయం గమనించలేదు. ఇలాంటి సరుకులను వెనక్కి పంపించాలని నెంటూరు రేషన్ డీలర్‌కు సూచించా. ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉంటాం.
- పద్మావతి,
గజ్వేల్ సివిల్ సప్లయ్ గోడౌన్ ఇన్‌ఛార్జి
స్టిక్కరింగ్ వ్యవహారంపై విచారణ
నెంటూరు రేషన్ దుకాణం ద్వారా సరఫరా అయిన కాలం చెల్లిన గోధుమ పిండి ప్యాకెట్లు సీజ్ చేయిస్తా. ఘటనపై విచారణ చేపడతాం. పేదల సరుకుల విషయంలో అవకతవకలు సహించబోం.
-గడా ఓఎస్డీ హన్మంతరావు
ప్రజారోగ్యం.. ప‘రేషన్’
Published Thu, May 7 2015 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement
Advertisement