రంగు మార్చి.. అడ్డంగా దోచేసి!
దారి మళ్లుతున్న నీలి కిరోసిన్
అడ్డాగా మారిన జాతీయ రహదారులు
కిరోసిన్ వినియోగం తగ్గడమే అక్రమార్కులకు వరం
సాక్షి, కర్నూలు : ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందాల్సిన నీలి కిరోసిన్ దారి మల్లుతోంది. డీజిల్‌గా చెలామణి చేస్తూ అక్రమార్కులు అడ్డంగా దోచేస్తున్నారు. డీజిల్ ధరకు రెక్కలు రావడం.. కిరోసిన్ తక్కువ ధరకు లభిస్తుండటంతో కల్తీ వ్యాపారం జోరందుకుంది. జిల్లా మీదుగా వెళ్తున్న 251.5 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారి ఈ వ్యాపారానికి వేదికగా మారింది. ప్యాపిలి నుంచి తుంగభద్ర నది బ్రిడ్జి వరకు 119 కిలోమీటర్ల 44వ జాతీయ రహదారి ఉండగా.. కర్నూలు నగర శివార్లలోని దిన్నెదేవరపాడు నుంచి చాగలమర్రి మండలం వరకు 132.5 కిలోమీటర్ల పొడవున 18వ జాతీయ రహదారి ఉంది.
ఈ రహదారు ల్లోని నీలి కిరోసిన్ అడ్డాల్లో కల్తీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు ప్రతి నెలా 22వేల కిలో లీటర్ల కిరోసిన్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. దీపం, ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు కలిగిన వారికి ప్రతి నెలా లీటరు కిరోసిన్ ఇస్తుండగా.. గ్యాస్ లేని కుటుంబాలకు నాలుగు లీటర్లు పంపిణీ చేస్తోంది. అయితే కిరోసిన్ వినియోగం తగ్గడంతో రేషన్ దుకాణాల్లో విక్రయించే లీటరు రూ.15 కిరోసిన్.. బహిరంగ మార్కెట్‌లో రూ.25 నుంచి రూ.30 పలుకుతోంది. ప్రధానంగా కర్నూలు, డోన్, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో నీలి కిరోసిన్ నల్ల బజారుకు తరలుతోంది.
రూపు మారుతోందిలా..
అడ్డదారిలో సేకరించిన నీలి కిరోసిన్‌లో కాస్త కెమికల్ పౌడర్, యాసిడ్ కలిపి మోటార్ సాయంతో డ్రమ్ములో కలిపితే రెండు గంటల్లో డీజిల్ రంగులోకి మారుతుంది. ఇలా డీజిల్‌గా మార్చిన కిరోసిన్ అమ్మకాలు ఒక ఎత్తయితే.. కొందరు లారీ డ్రైవర్లు యాజమానులకు తెలియకుండా నేరుగా కిరోసిన్‌నే ట్యాంకుల్లో పోస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలు జిల్లాలో కోకొల్లలు. కల్తీ డీజిల్ వాడినా, నేరుగా కిరోసిన్ వాడినా వాహనాలు దెబ్బతినడంతో పాటు కాలుష్యం పెరుగుతుంది. చౌక దుకాణాల నుంచే కిరోసిన్ పక్కదారి పడుతుండటంతో అడ్డాల్లో అక్రమ వ్యాపారం మూడు లారీలు, ఆరు పీపాలుగా సాగిపోతోంది.
ఇలా కలిసొస్తోంది..
లీటరు డీజిల్ ధరకు రెండు లీటర్ల కిరోసిన్ వస్తోంది. మైలేజీ ఒకేలా రావడంతో ఎక్కువ మంది కిరోసిన్ వైపు మొగ్గుచూపుతున్నారు. కర్నూలు, నంద్యాల పట్టణాల్లో రోజుకు 1,500 లీటర్ల కిరోసిన్ ఇలా దారి మల్లుతున్నట్లు అనధికార అంచనా. ప్రస్తుతం ఇళ్లలో కిరోసిన్ వినియోగించే వారు తక్కువయ్యారు. పూరి గుడిసెలోనూ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఈ పరిస్థితి అక్రమాలకు ఊతమిస్తోంది. కిరోసిన్ ఇవ్వడమే తప్ప కార్డుదారులు సమర్థంగా వినియోగించుకునే పరిస్థితి కరువైంది. ఫలితంగా బ్లాక్ మార్కెట్ ఊపందుకుంటోంది.
చర్యలు చేపడతాం : ప్రభాకర్‌రావు, డీఎస్‌ఓ
పేదలకు చేరాల్సిన నీలి కిరోసిన్ బయటి మార్కెట్‌కు తరలుతున్న విషయం నా దృష్టికి రాలేదు. కల్తీ చేసి వాహనాలకు వినియోగిస్తున్న విషయంపై సిబ్బంది చేత తనిఖీలు చేయిస్తా. అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోం.
అక్రమాలకు రహదారి
Published Fri, May 15 2015 5:41 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement
Advertisement