public distribution
-
త్వరలో రష్యా ప్రజలకు కరోనా టీకా
మాస్కో: కరోనా వైరస్‌ను నిరోధించే ‘స్పుత్నిక్ –వీ’ టీకా త్వరలో మాస్కోలో ప్రజా పంపిణీకి సిద్ధమవుతోందని రష్యా అధికార మీడియా గురువారం వెల్లడించింది. అయితే, పూర్తిస్థాయిలో భద్రత, సామర్థ్య పరీక్షలు జరపకుండానే ఈ టీకాను మార్కెట్లోకి తీసుకురావాలన్న ప్రయత్నాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు కూడా వచ్చాయి. స్పుత్నిక్–వీ టీకాలు ప్రజాపంపిణీ కోసం పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయని గతవారమే రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది. త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలకు వాటిని పంపించనున్నామని పేర్కొంది. ‘గమాలెయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ’ రూపొందించిన ఈ టీకా అవసరమైన అన్ని నాణ్యత పరీక్షల్లో విజయవంతమైందని స్పష్టం చేసింది. పూర్తిస్థాయి మానవులపై పూర్తిస్థాయిలో ప్రయోగాలు ముగియకముందే, వినియోగానికి ప్రభుత్వ అనుమతి పొందిన తొలి టీకాగా స్పుత్నిక్–వీ నిలిచింది. అనుమతి పొందిన తరువాత అడ్వాన్స్డ్ ట్రయల్స్‌ను కొనసాగించారు. సుమారు 40 వేల మందిపై జరుగుతున్న ఫేజ్ 3 ప్రయోగ ఫలితాలు అక్టోబర్, నవంబర్‌ల్లో వెలువడే అవకాశముంది. -
తవ్వేకొద్దీ అవినీతి
సాక్షి, నరసరావుపేట( గుంటూరు): పట్టణంలో రేషన్ డీలర్ల అక్రమాలు తవ్వేకొద్దీ బయట పడుతున్నాయి. ఇప్పటికే అనేక రేషన్ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించి నిల్వల్లో తేడాలున్నట్లు గుర్తించారు. మరి కొందరు దుకాణదారులు బియ్యాన్ని నల్లబజారుకు తరలించి.. షాపులకు తాళాలు వేసుకుని పరారవుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఒక వైపు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేసి అంతటా పారదర్శకత తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపడుతుంటే.. మరో వైపు కొందరు డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అధికారుల తనిఖీల్లో రేషన్ డీలర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వెళ్లిన ప్రతి చౌకదుకాణంలో ఏదో ఒక లోపం కనిపిస్తుండటంతో అధికారులు విస్తుపోతున్నారు. సోమవారం రేషన్ షాపులపై దాడులు నిర్వహించిన పౌరసరఫరాల శాఖ అధికారులు వందల క్వింటాళ్ల బియ్యాన్ని డీలర్లు పక్కదారి పట్టించడాన్ని గుర్తించారు. ఐదుగురు డీలర్లపై కేసులు నమోదు చేయటంతో పాటు క్రిమినల్ కేసులకు సిఫారసు చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని డీలర్లు గత కొన్నేళ్లుగా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో అనేక మంది కార్డుదారులు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు ప్రభుత్వం మారటంతో చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల రొంపిచర్లలో అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డ రేషన్ బియ్యం నరసరావుపేట చౌకడిపోల నుంచి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆర్డీవో కె. శ్రీనివాసరావు పట్టణంలోని అన్ని చౌకదుకాణాలను తనిఖీలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కార్డుదారులకు పంపిణీ చేయగా ఉండాల్సిన నిల్వ రేషన్ బియ్యం, కందిపప్పు, పంచదార ఏ ఒక్క చౌకదుకాణంలో అందుబాటులో లేవు. మరోవైపు అధికారులు తనిఖీలతో అక్రమార్కులు డిపోలకు తాళాలు వేసుకొని అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు. తమ అవినీతి బండారం ఎక్కడ బయట పడుతుందోనని ఏ ఒక్క డీలర్ అధికారులకు సహకరించడం లేదు. ఐదు షాపులపై కేసులు : డీటీ నిమ్మతోటలోని 44వ నంబర్ చౌకదుకాణంపై అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టి 33 క్వింటాళ్ల రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్టు గుర్తించారు. దీంతో సోమవారం మిగిలిన చౌక డిపోలను పరిశీలించేందుకు పౌరసరఫరాల శాఖ డీటీ అశోక్, వీఆర్వోలు పట్టణంలోని పలు దుకాణాలకు వెళ్లి స్టాక్ రిజష్టర్లను పరిశీలించారు. అక్కడ ఉండాల్సిన నిల్వల్లో భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు. షాపు నంబర్ 12లో 37 క్వింటాళ్ల బియ్యం, రెండు క్వింటాళ్ల పంచదార, 2.8 క్వింటాళ్ల కంది పప్పు, అదే విధంగా షాపు నంబర్ 15లో 17.28 క్వింటాళ్ల బియ్యం, 31 కేజీల పంచదార, షాపు నంబర్ 16లో 40.4 క్వింటాళ్ల బియ్యం, 1.21 క్వింటాళ్ల పంచదార, షాపు నంబర్ 18లో 43.87 క్వింటాళ్ల బియ్యం, 1.14 క్వింటాళ్ల పంచదార వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. 19 నంబర్ షాపు రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని, సబంధిత డీలర్లపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు డీటీ తెలిపారు. క్రిమినల్ చర్యలకు సిఫారసు.. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించిన డీలర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసులకు సిఫారసు చేయనున్నట్లు డీటీ అశోక్ తెలిపారు. వందలాది క్వింటాళ్ల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్ల విచారణలో తేలిందన్నారు. ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే అరుగురు డీలర్లపై 6(ఎ) కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
ప్రజాపంపిణీకి ఇబ్బంది రానీయం
–ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం –జేసీ హరికిరణ్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నగరంలో డిసెంబరు నెల ప్రజా పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. వంద మంది డీలర్లు సస్పెండ్ అయినందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ... కొన్ని షాపులకు ఇన్చార్జీలను నియమిస్తున్నామన్నారు. మరికొన్ని షాపులకు తాత్కాలిక డీలర్లుగా నియమించేందుకు ఈ–పాస్ మిషన్లను ఆపరేట్ చేయగల యువకులను గుర్తిస్తున్నామన్నారు. ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసి అక్రమాలకు పాల్పడిన 149 మంది డీలర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. డీలర్లు కోర్టుకు వెళ్లారని, దీనిపై శుక్రవారం తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాసాధికార సర్వేలో జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉందని వెల్లడించారు. -
కిరోసిన్ కష్టాలు!
అనంతపురం అర్బన్: ప్రజలకు మెరుగైన సేవలందిస్తామంటూ ఆ శాఖ మంత్రి మొదలు అధికారులు చెప్పుకుంటున్నా పౌరసరఫరాల శాఖలో వాస్తవ పరిస్థితులు తద్భిన్నంగా ఉన్నాయి. గత మూడు నెలలుగా నిత్యావసరాల పంపిణీలో అడుగడుగునా లోపాలు కనిపిస్తున్నాయి. కిందిబేడలు విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఉంటే... కిరోసిన్ విషయంలో అధికారులు పర్యవేక్షణ లోపం... హోల్‌సేలర్ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే... ఈ నెల కోటా కిరోసిన్‌ని కొన్ని రేషన్ దుకాణాలు, హాకర్లకు సరఫరానే కాలేదు. జిల్లా వ్యాప్తంగా 43 వేల లీటర్లు ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. అనంతపురం నగరంలోని దాదాపు 45 మంది డీలర్లు, హాకర్లకు 19 వేల లీటర్లు సరఫరా కాలేదంటున్నారు. కొన్ని చౌక ధర దుకాణాల డీలర్లకు కిరోసిన్ సరఫరా చేయకపోవడం అంటూ ఒక రకంగా ప్రజలను ఇబ్బందికి గురిచేసినట్లే అవుతుంది. డీలర్ల ఫిర్యాదు వరకు మౌనం హోల్‌సేలర్ కిరోసిన్‌ని జిల్లాలోని కొన్ని చౌక ధరల దుకాణాలకు, హాకర్లకు ఈ నెల సరఫరా చేయలేదు. ఈ విషయం అధికారులకు డీలర్లు ఫిర్యాదు చేసేంతవరకు మౌనంగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజా పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా అనేదానిపై అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా పర్యవేక్షణ ఉండి ఉంటే హోల్‌సేలర్ సరఫరా కాలేదన్న విషయం వెంటనే తెలిసి ఉండేది. అలా కాకుండా డీలర్లు పిర్యాదు చేసిన తరువాత అధికారుల్లో కదలిక వచ్చిందంటే ఎంత బాధ్యతారహితంగా ఉన్నారో స్పష్టమవుతోంది. లోగుట్టు వ్యవహారమనే విమర్శలు హోల్‌సేలర్ కిరోసిన్ సరఫరా చేయలేదన్న విషయాన్ని డీలర్లు చెప్పే వరకు అధికారులు పట్టించుకోక పోవడం వెనుక లోగుట్టు వ్యవహారం ఉందనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ నెల కోటాలో కొన్ని దుకాణాలకు సరఫరాను ఎగనామం పెడితే అది మిగులుగా ఉంటుంది. ఈ మొత్తాన్ని బ్లాక్‌లో విక్రయించే ఎత్తుగడతో భాగంగానే వ్యవహారం నడిపినట్లు ఆరోపలు వినవస్తున్నాయి. కొందరు డీలర్లకు, హాకర్లకు ఈ నెల కోటాని హోల్‌సేలర్ సరఫరా చేయని విషయం కొందరు అధికారులకు తెలిసే జరిగిందనే విమర్శలు ఉన్నాయి. -
చౌకదుకాణ డీలర్ల సమ్మెబాట
కాకినాడ సిటీ :డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో చౌకదుకాణ డీలర్లు సమ్మె బాట పట్టారు. గత ఐదు రోజులుగా కలెక్టరేట్ వద్ద డివిజన్ల వారీగా రిలే నిరాహారదీక్షలు చేపట్టిన డీలర్లు సోమవారం సాయంత్రం దీక్షలను విరమించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం నుంచి సమ్మెలోకి వెళుతున్నట్టు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణపై మంగళవారం విజయవాడలో జరిగే రాష్ట్ర సంఘ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. డీలర్ల సమ్మెతో జూన్ నెల ప్రజాపంపిణీలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడనుంది. ఈనెల 20వ తేదీతో కార్డుదారులకు రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ ముగిసింది. అయితే నేటి వరకూ జూన్ నెల సరుకులకు సంబంధించి డీడీలను తీయలేదు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ 80శాతం మంది డీలర్లు డీడీలు తీయడానికి నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,650 చౌకదుకాణాల పరిధిలో సుమారు 15లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ 19వేల మెట్రిక్ టన్నుల బియ్యం, ఇతర రేషన్ సరుకులను జూన్ నెలకు సంబంధించి మండలస్థాయి స్టాక్‌పాయింట్ గోదాముల నుంచి చౌకదుకాణాలకు చేరవేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే డీలర్లు డీడీలు తీయని కారణంగా రిలీజ్ ఆర్డర్లు జారీ కాలేదు. ఈనేపథ్యంలో రేషన్ సరఫరా విషయంలో గందరగోళం నెలకొంది. అయితే అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటో తేదీ నుంచి కార్డుదారులకు రేషన్‌సరుకులు అందజేసే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అయితే పరిస్థితులను బట్టి చూస్తే కార్డుదారులకు జూన్ నెల రేషన్ పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కమీషన్ పెంచాలి డీలర్ల కమీషన్ పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని చౌకధరల దుకాణ డీలర్ల సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షులు అమజాల వీరబ్రహ్మం డిమాండ్ చేశారు. క్వింటాలుకు రూ.70తో పాటు ఈ-పోస్ డీలర్లకు కార్డుకు రూ.5 ఇస్తామన్న హామీ అమలయ్యేవరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. జాయింట్‌కలెక్టర్-2 మార్కండేయులు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులకు డీలర్లు వినతి పత్రాలను డీలర్లు అందజేశారు. జిల్లాలో ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి వచ్చిన సరుకులను షాపుల దగ్గర దండికాటాపై తూచి డీలర్లకు అప్పగించాలన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో అక్రమంగా లోడింగ్, అన్లోడింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు డీలర్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ నాయకులు ఆర్.సత్యనారాయణ, అడపా వెంకటరమణ, నల్లా వెంకటేశ్వరరావు, కేవీవీ రమణ, టి.రాజశేఖర్, నందిపాటి ఎల్లయ్య పాల్గొన్నారు. -
అక్రమాలకు రహదారి
రంగు మార్చి.. అడ్డంగా దోచేసి! దారి మళ్లుతున్న నీలి కిరోసిన్ అడ్డాగా మారిన జాతీయ రహదారులు కిరోసిన్ వినియోగం తగ్గడమే అక్రమార్కులకు వరం సాక్షి, కర్నూలు : ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందాల్సిన నీలి కిరోసిన్ దారి మల్లుతోంది. డీజిల్‌గా చెలామణి చేస్తూ అక్రమార్కులు అడ్డంగా దోచేస్తున్నారు. డీజిల్ ధరకు రెక్కలు రావడం.. కిరోసిన్ తక్కువ ధరకు లభిస్తుండటంతో కల్తీ వ్యాపారం జోరందుకుంది. జిల్లా మీదుగా వెళ్తున్న 251.5 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారి ఈ వ్యాపారానికి వేదికగా మారింది. ప్యాపిలి నుంచి తుంగభద్ర నది బ్రిడ్జి వరకు 119 కిలోమీటర్ల 44వ జాతీయ రహదారి ఉండగా.. కర్నూలు నగర శివార్లలోని దిన్నెదేవరపాడు నుంచి చాగలమర్రి మండలం వరకు 132.5 కిలోమీటర్ల పొడవున 18వ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారు ల్లోని నీలి కిరోసిన్ అడ్డాల్లో కల్తీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు ప్రతి నెలా 22వేల కిలో లీటర్ల కిరోసిన్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. దీపం, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు కలిగిన వారికి ప్రతి నెలా లీటరు కిరోసిన్ ఇస్తుండగా.. గ్యాస్ లేని కుటుంబాలకు నాలుగు లీటర్లు పంపిణీ చేస్తోంది. అయితే కిరోసిన్ వినియోగం తగ్గడంతో రేషన్ దుకాణాల్లో విక్రయించే లీటరు రూ.15 కిరోసిన్.. బహిరంగ మార్కెట్లో రూ.25 నుంచి రూ.30 పలుకుతోంది. ప్రధానంగా కర్నూలు, డోన్, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో నీలి కిరోసిన్ నల్ల బజారుకు తరలుతోంది. రూపు మారుతోందిలా.. అడ్డదారిలో సేకరించిన నీలి కిరోసిన్‌లో కాస్త కెమికల్ పౌడర్, యాసిడ్ కలిపి మోటార్ సాయంతో డ్రమ్ములో కలిపితే రెండు గంటల్లో డీజిల్ రంగులోకి మారుతుంది. ఇలా డీజిల్‌గా మార్చిన కిరోసిన్ అమ్మకాలు ఒక ఎత్తయితే.. కొందరు లారీ డ్రైవర్లు యాజమానులకు తెలియకుండా నేరుగా కిరోసిన్‌నే ట్యాంకుల్లో పోస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలు జిల్లాలో కోకొల్లలు. కల్తీ డీజిల్ వాడినా, నేరుగా కిరోసిన్ వాడినా వాహనాలు దెబ్బతినడంతో పాటు కాలుష్యం పెరుగుతుంది. చౌక దుకాణాల నుంచే కిరోసిన్ పక్కదారి పడుతుండటంతో అడ్డాల్లో అక్రమ వ్యాపారం మూడు లారీలు, ఆరు పీపాలుగా సాగిపోతోంది. ఇలా కలిసొస్తోంది.. లీటరు డీజిల్ ధరకు రెండు లీటర్ల కిరోసిన్ వస్తోంది. మైలేజీ ఒకేలా రావడంతో ఎక్కువ మంది కిరోసిన్ వైపు మొగ్గుచూపుతున్నారు. కర్నూలు, నంద్యాల పట్టణాల్లో రోజుకు 1,500 లీటర్ల కిరోసిన్ ఇలా దారి మల్లుతున్నట్లు అనధికార అంచనా. ప్రస్తుతం ఇళ్లలో కిరోసిన్ వినియోగించే వారు తక్కువయ్యారు. పూరి గుడిసెలోనూ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఈ పరిస్థితి అక్రమాలకు ఊతమిస్తోంది. కిరోసిన్ ఇవ్వడమే తప్ప కార్డుదారులు సమర్థంగా వినియోగించుకునే పరిస్థితి కరువైంది. ఫలితంగా బ్లాక్ మార్కెట్ ఊపందుకుంటోంది. చర్యలు చేపడతాం : ప్రభాకర్‌రావు, డీఎస్ఓ పేదలకు చేరాల్సిన నీలి కిరోసిన్ బయటి మార్కెట్‌కు తరలుతున్న విషయం నా దృష్టికి రాలేదు. కల్తీ చేసి వాహనాలకు వినియోగిస్తున్న విషయంపై సిబ్బంది చేత తనిఖీలు చేయిస్తా. అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోం. -
కర్తవ్యం, కార్యాచరణ మారాల్సిందే!
ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చే సంస్థ రెండు లక్ష్యాలను కచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. గ్లోబల్ ప్రపంచంలో భారత్ స్థానాన్ని పటిష్టపరచి, సుస్థిరం చేసేందుకు దోహదపడాలి. కాలానుగుణంగా పాలనలో, ప్రజా పంపిణీలో సరైన ఫలితాలను సాధించేలా కేంద్ర-రాష్ట్ర సంబంధాల్ని మెరుగపరచగలగాలి. ప్రధాని, కొందరు కేంద్ర మంత్రులు, సీఎంలతో కొత్త సంస్థ ఏర్పాటు అంటేనే సందేహాలు రేగుతున్నాయి. ఇది కొత్త సీసాలో పాతసారాయేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీని వెనుక దేశహితం తప్ప రాజకీయ దృష్టి కోణం లేదని నిరూపించుకోవాలి. ప్రణాళికా సంఘం కార్యాలయమున్న ‘యోజన భవన్’లో రెండు బ్లాక్‌ల మూత్రశాలల మరమ్మతుకు 35 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కానీ, దారిద్య్రరేఖ దిగువనున్న వారిని ఖరారు చేయడానికి ప్రణాళికా సంఘం చెప్పిన లెక్కలే విచిత్రంగా కనిపించాయి. పట్టణ ప్రాంతాల్లో నెలకు 860 రూపాయలకు మించి, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 673 రూపాయలకు మించి వ్యయం చేసే కుటుంబాల వారు పేదలు కారట! ప్రణాళికా సంఘం కూడా సమాధానం చెప్పజాలని విమర్శ ఇది. మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విజన్ నుంచి పుట్టిన ప్రణాళికా సంఘం కాలక్రమంలో అసంబద్ధంగా తయారయిం దనడంలో వీసమెత్తు సందేహం లేదు. కానీ, నెహ్రూ ఆలోచనా విధానం, భావజాలం ఇంకా భారత్‌పై ప్రభావం చూపకూడదనే ఆరెస్సెస్ వంటి సంస్థల తలంపే ఈ సంఘానికి మంగళం పాడటానికి కారణమైతే మాత్రం అది ఆత్మహత్యా సదృశమే! ‘తలనొప్పి వస్తే మందేసుకుంటారు తప్ప తలే తీసేసుకోరు కదా!’ అనే వారూ ఉన్నారు. ఆరున్నర దశాబ్దాల కాలంలో దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులొచ్చాయి, ప్రణాళికా రచనలోనూ మార్పులు రావాల్సిందే. ప్రణాళికా సంఘాన్ని కొనసాగిస్తూ అవసరాల కనుగుణంగా మార్చుకోవచ్చని వారు సూచిస్తారు. నిజానికి ఇప్పుడు ప్రణాళికా సంఘాన్నే రద్దు చేయనుండటం పట్ల ఒక్క కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవరికీ పెద్ద ఆందోళన లేదు. దాని స్థానంలో ఏ ప్రత్యామ్నాయాన్ని తెస్తున్నారు? అన్నది వేయి రూకల ప్రశ్న! పెనం మీద కనలిపోతున్నపుడు ఏం చేసైనా దిగిపోవాలని ఉంటుంది, కానీ, పొయ్యిలోనే పడిపోతే? అలా జరగొద్దనేది అందరి ఆర్తి, ఆకాంక్ష. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నుంచి, దేశంలోని ఓ పెద్ద సంఘం రద్దు కాబోతోందన్న చర్చ అంతటా ఆసక్తిని రేపుతోంది. ఇటీవల ముఖ్యమంత్రులతో భేటీలో ప్రధాని ‘టీమ్ ఇండియా’ను ఏర్పాటు చేస్తామని వెల్లడించడంతో అంతకుమించిన ఆసక్తి, ఆర్తి కొత్త సంస్థ స్వరూప స్వభావాలెలా ఉంటాయనే వైపు చర్చను దారి మళ్లించింది. ప్రణాళికా సంఘం రాజ్యాంగబద్ధ మైన సంస్థో, చట్టబద్ధమైన సంస్థో కాదు. కనుక కేంద్ర ప్రభుత్వపు ఒక తీర్మా నంతో వచ్చినట్టే, అది మరో తీర్మానంతో ఏకంగా రద్దయిపోతుంది, అదేమంత కష్టమైన పనికాదు. కాకపోతే, ఇప్పటివరకెదురైన ప్రణాళికా లోపాల్ని సరిది ద్దుతూ, ప్రస్తుత అవసరాల్ని నిర్వచిస్తూ భవిష్యత్తుకు ఉపయోగపడే బహుళ ప్రయోజనకరమైన కొత్త సంస్థను ఏర్పాటు చేయడం చాలా అవసరం. రాజ కీయ ఉద్దేశాలు, దురుద్దేశాలు లేకుండా అదెలా ఉంటుందన్నదే చాలా ముఖ్యం. ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాదు! ఈ దేశంలో ఆర్థిక విధానాలకు వ్యూహాత్మకమైన మెరుగులు దిద్దే అవసరమ న్నది, స్వాతంత్య్రపు తొలి రోజుల నుంచి నేటి వరకూ నిరంతరంగా వస్తున్నదే. దేశ ఆర్థిక, సాంకేతిక, మానవ, ఇతరేతర వనరుల్ని అంచనా వేయడం, హేతు బద్ధంగా వినియోగించుకోవడం, అందుకవసరమైన ప్రాథమ్యాల నిర్ణయం, కేటాయింపులు, వివిధ దశలపై నిఘా-నియంత్రణ అన్నీ ప్రణాళికా సంఘం బాధ్యతలే! భవిష్యత్ అవసరాల్ని లెక్కించడం, తీర్చే ప్రణాళికలు రచించడం కూడా దాని బాధ్యత. సమాఖ్య రాజ్యమైన భారత్‌లో కేంద్ర-రాష్ట్ర సంబంధాల్ని ఇది చాలా ప్రభావితం చేస్తుంది. అందుకోసం ప్రత్యేకంగాఏర్పడ్డ ఈ సంఘం దేశంలో సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంచేదిగా ఉండాలని రాజకీయ పక్షాలు ఆశిస్తున్నాయి. పరాయి పాలన నుంచి విముక్తి పొందిన పేద దేశంగా భారత్ నిలకడైన, వేగిరమైన ప్రగతి సాధించడానికి ప్రణాళిక అవసరాన్ని నాటి ప్రధాని పలు సందర్భాల్లో నొక్కి చెప్పారు. మొదట్లో నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖల్లో ప్రణాళికలపై ఆయన ఆలోచనలు తొంగి చూసేవి. దేశ పరిస్థితుల దృష్ట్యా ‘ఆహారోత్పత్తి పెంచండి’ అంటూ, 1942 ప్రాంతంలో అప్పటి మధ్యంతర ప్రభుత్వం విశేష ప్రచారం చేపట్టింది. రెండో ప్రపంచ యుద్ధ పర్యవసానంగా బర్మా నుంచి బియ్యం రావని గ్రహించి, ఆ నినాద ప్రచారాన్ని మరో అయిదేళ్ల పాటు కొనసాగించాలనీ నిర్ణయించింది. సదరు విషయాన్ని నెహ్రూ ఒక లేఖలో ప్రస్తావించారు. బహుశా! ఇందులోంచి పుట్టిందేనేమో పంచవర్ష ప్రణాళిక ఆలోచన. సమాచార సేకరణ-వ్యాప్తి, వ్యూహం, ప్రణాళిక వంటివి యుద్ధంలో, పేదరిక నిర్మూలనలో ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని నెహ్రూ గట్టి విశ్వాసం. భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లోని అధికరణం 39 ప్రకారం, కేంద్ర ప్రభుత్వపు ఉత్తర్వుతో 1950 మార్చి 15న సంఘం ఏర్పడింది. మొదట్లో బాగుండింది. మంచి ఫలితాలొచ్చాయి. సమాఖ్య స్ఫూర్తికి గ్రహణం సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాల్సిన సంస్థ కాలక్రమంలో అందుకు పూర్తి విరుద్ధంగా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఓ ఉపకరణంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ప్రాంతీయ రాజకీయ శక్తులు బలపడ్డ క్రమంలోనే, కేంద్రంలోని జాతీయపార్టీలకు అది నచ్చక, సంఘ దుర్వినియోగం పెరిగి సమాఖ్య స్ఫూర్తి చెడిందనే బలమైన అభిప్రాయం పెరగసాగింది. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు వేర్వేరు నైసర్గిక, భౌగోళిక, సామాజిక, రాజకీయార్థిక స్వరూపాల్లో ఉన్నపుడు కేంద్రం ఏకపక్షంగా రూపొందించే ప్రణాళికలు, ఆర్థిక విధానాలు ఎలా సరిపోతాయనే వాదన బలం పుంజుకుంది. ఏకరీతి విధానాల్ని నిర్వచించడం, అమలు చేయాలనుకోవడం సాధ్యపడేది కాదనే సత్యం పార్టీలకతీతంగా ఢిల్లీ అధికార పీఠంపై ఉన్నవారికీ తెలుసు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య, కేంద్రం-రాష్ట్రాల మధ్య, సరిహద్దు-సారూప్యత కలిగిన వివిధ రాష్ట్రాల మధ్య సయోధ్య కోసం కృషి చేయాల్సింది కూడా ప్రణాళికా సంఘం, దానికి అనుబంధంగా పనిచేసే వివిధ విభాగాలే! ఇంతే కాకుండా, దేశానికి ఏం కావాలి? అని నిర్ధారించి వ్యూహాత్మకంగా భవిష్యత్ దర్శనం చేసే మేధావివర్గాన్ని ప్రభుత్వంతో అనుసంధాన పరిచే బాధ్యత కూడా ఈ సంఘానిదే! జాతీయాభివృద్ధి మండలి (ఎన్డీసీ), అంతర్రాష్ట్ర మండలి (ఐఎస్సీ) ప్రణాళికా సంఘం నీడలోనే పనిచేస్తాయి తప్ప వాటితో పెద్దగా ప్రయోజనం ఉండదని రాష్ట్రాలు ఎప్పుడూ పెదవి విరుస్తుంటాయి. వారి అనుభవాలు అలాంటివి. రాష్ట్రాల్లో బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా వారి వారి వార్షిక ప్రణాళికలు ఖరారయిన సందర్భాలెన్నో! అసలు ఈ ప్రణాళికలే ఓ పనికిమాలిన తంతు అనే విమర్శ కూడా ఉంది. రాష్ట్ర అవసరాలకు 180 డిగ్రీలు పూర్తి భిన్నంగా ఉన్నా, కేంద్ర పథకాల్ని అమలు చేస్తే తప్ప నిధులు రాని స్థితిని రాష్ట్రాలు ఈసడిస్తాయి. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్ని యధాతథంగానో, కొంచెం మార్చో రాష్ట్రాలు అమలు చేయాల్సిరావడం దురదృష్టకరమని రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా అభిప్రాయపడతాయి. ‘భిక్షాపాత్ర పట్టుకొని యోజన భవన్లో నిలబడాలి, మా అవసరాల ప్రకారం కాదు, వారి విధానాల ప్రకారమే నిధులిస్తామంటారు, అలాగే ఖర్చు పెట్టాలంటారు. ఇదెలా మింగుడు పడుతుంది?’ అనే కొందరు రాష్ట్రాధినేతల ఆవేదనలో నిజముంది. రాష్ట్రాల్లో ఉండే వివిధ రాజకీయ ప్రత్యర్థి పక్షాల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంలోని పాలకపక్షం వివక్ష చూపే సందర్భాలు కూడా కోకొల్లలు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానే, కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించగానే అత్యధిక ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేయడం వెనుక కారణమిదే. ఇంతకీ ఏం కోరుకుంటున్నారు! బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు ఉండాలన్న స్ఫూర్తే సమాఖ్య రాజ్యానికి అసలుసిసలు బలం. ప్రణాళికా సంఘం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండటం వరకు ఇబ్బంది లేదు. అది వారి రాజకీయ అవసరాలు తీర్చే ఉపకరణంగా మారటం రాష్ట్రాలకు గిట్టదు. రాష్ట్రాల సొంత అవసరాలకు తగిన రీతిలో విధానాలు, కార్యక్రమాల రూపకల్పన, ఆర్థికవనరుల వినియోగం ఉండాలని కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం పేర్కొంటోంది. అదే భావనతో రాష్ట్రాలకు పూర్తిగా సహకరించే విధంగా, రద్దు కానున్న ప్రణాళికా సంఘం స్థానే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే సర్వత్రా హర్షిస్తారు. దేశంలో 1991 ఆర్థిక సరళీకరణ విధానాలు అమల్లోకి వచ్చి దాదాపు పావు శతాబ్ది అవుతోంది. మార్కెట్ చోదక ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత ప్రణాళికా సంఘం సంబద్ధత, దాని విధానాల హేతుబద్ధత ఎంత అన్న ప్రశ్న తరచూ తలెత్తుతోంది. అందువల్ల, మారిన పరిస్థితుల్లో సరికొత్త అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని కొత్త సంస్థను రూపొందించాలి. ప్రభుత్వానికి ప్రయివేటు రంగానికి మధ్య మరింత సయోధ్య, ఉభయ ప్రయోజనకర కార్యాచరణ కావాలి. అంతర్జాతీయంగా, దౌత్యపరంగా కూడా పటిష్టమైన వ్యూహం, ఎత్తుగడలు అవసరం. ఇప్పటికే ఇంధన వినియోగంలో నాలుగో అతి పెద్ద దేశంగా ఉన్న మన దేశ ఇంధన భద్రత శూన్యం. 2030 నాటికి ప్రపంచంలో 50 శాతం ఇందన వినియోగం చేసే విధంగా సాగుతున్న మన ఇంధన భద్రత విధానానికి, మన దౌత్యనీతికి పొంతనే లేదు. కొత్తగా వచ్చే సంస్థ కచ్చితంగా సాధించాల్సిన లక్ష్యాలు రెండుంటాయి. ఒకటి, గ్లోబల్ ప్రపంచంలో భారత్ స్థానాన్ని పటిష్టపరచి, సుస్థిరం చేసేందుకు దోహదపడాలి. రెండు, పాలన- ప్రజా పంపిణిలో సరైన ఫలితాలు సాధించేలా కేంద్ర-రాష్ట్ర సంబంధాల్ని ఎప్పటికప్పుడు మెరుగుపరిచేలా ఒక నిరంతర ప్రకియను ఈ సంస్థ కొనసాగించాలి. ప్రధాని నేతృత్వంలో, కొందరు కేంద్ర మంత్రులు, కొంత మంది ముఖ్యమంత్రులతో కొత్త సంస్థను ఏర్పరుస్తారనగానే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. కొత్త సీసాలో పాతసారాయినే ముందుకు తెస్తారా? అనే అనుమానాలు పొడసూపుతున్నాయి. కాదని, దీని వెనుక దేశహితం తప్ప పచ్చి రాజకీయ దృష్టి కోణం లేదని నిరూపించుకోవాలి. ఈమెయిల్: dileepreddy@sakshi.com - దిలీప్ రెడ్డి -
ఆర్డీవోలు ఉన్నారా.. లేరా?
అధికారులు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు? డీఆర్వోపై మంత్రి పరిటాల సునీత ఆగ్రహం మదనపల్లె: ‘ముఖ్యమంత్రి సొంత జిల్లా లో అసలు ఆర్డీవోలు ఉన్నారా.. లేరా? ఉంటే వాళ్లేమైనా ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్లా? సమీక్ష సమావేశానికి ఎందుకు రాలేదు’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి పరిటాల సునీత డీఆర్వోపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం స్థానిక సీఎల్ఆర్సీ భవనం లో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశానికి జిల్లాలోని జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల గైర్హాజరుపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమావేశంలో అధికారులంతా ఉత్సాహంగా లేకపోవడంతో ‘మీరింకా కాంగ్రెస్ ప్రభుత్వ నిద్రనుంచి లేవలే దా.. త్వరగా లేవండి లేచి విధులు సక్రమంగా నిర్వర్తించండి’ అంటూ చలోక్తులు విసిరారు. అంతేకాకుండా వచ్చే సమావేశానికి అధికారులు రాకుంటే నేరుగా వారి ఇళ్లకు వెళ్ళి మాట్లాడుతాన ని ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఆధార్ అనుసంధానం 90 శాతం జరగడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థను ప్రజలకు నేరుగా చేరవేసేలా పౌరసరఫరాల శాఖ కృషి చేయాలన్నారు. పార్టీలకతీతంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులం తా నిబధ్ధతతో పనిచేయాలని సూచిం చారు. అధికారులు కార్యాలయాల్లో ఉండకుండా గ్రామస్థాయిలో పర్య టిం చి ప్రజాసమస్యలను తెలుసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కిరోసిన్ పంపిణీలో పక్కా మోసం జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందనీ.. మోసా న్ని అరికట్టేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. రేషన్‌షాపుల్లో 9రకాల నిత్యావసర సరుకులను ఒకేసారి సరఫరా చేసేలా తమ శాఖ ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. సరుకుల కేటాయింపులో తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చౌకదుకాణాల్లో ఇస్తున్న కొన్ని సరుకుల్లో నాణ్యత లేవని తన దృష్టికి వచ్చిందన్నారు. మహిళలతో చర్చించి వాటి స్థానంలో వేరే వస్తువులను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్, మదనపల్లె మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్, డీఎస్వో విజయరాణి, డీఆర్వో శేష య్య, రెవెన్యూ, తూనికలు, కొలతలు శాఖ అధికారులు పాల్గొన్నారు.