కాకినాడ సిటీ :డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో చౌకదుకాణ డీలర్లు సమ్మె బాట పట్టారు. గత ఐదు రోజులుగా కలెక్టరేట్ వద్ద డివిజన్ల వారీగా రిలే నిరాహారదీక్షలు చేపట్టిన డీలర్లు సోమవారం సాయంత్రం దీక్షలను విరమించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం నుంచి సమ్మెలోకి వెళుతున్నట్టు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణపై మంగళవారం విజయవాడలో జరిగే రాష్ట్ర సంఘ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. డీలర్ల సమ్మెతో జూన్ నెల ప్రజాపంపిణీలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడనుంది. ఈనెల 20వ తేదీతో కార్డుదారులకు రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ ముగిసింది. అయితే నేటి వరకూ జూన్ నెల సరుకులకు సంబంధించి డీడీలను తీయలేదు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ 80శాతం మంది డీలర్లు డీడీలు తీయడానికి నిరాకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,650 చౌకదుకాణాల పరిధిలో సుమారు 15లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ 19వేల మెట్రిక్ టన్నుల బియ్యం, ఇతర రేషన్ సరుకులను జూన్ నెలకు సంబంధించి మండలస్థాయి స్టాక్‌పాయింట్ గోదాముల నుంచి చౌకదుకాణాలకు చేరవేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే డీలర్లు డీడీలు తీయని కారణంగా రిలీజ్ ఆర్డర్లు జారీ కాలేదు. ఈనేపథ్యంలో రేషన్ సరఫరా విషయంలో గందరగోళం నెలకొంది. అయితే అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటో తేదీ నుంచి కార్డుదారులకు రేషన్‌సరుకులు అందజేసే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అయితే పరిస్థితులను బట్టి చూస్తే కార్డుదారులకు జూన్ నెల రేషన్ పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
కమీషన్ పెంచాలి
డీలర్ల కమీషన్ పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని చౌకధరల దుకాణ డీలర్ల సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షులు అమజాల వీరబ్రహ్మం డిమాండ్ చేశారు. క్వింటాలుకు రూ.70తో పాటు ఈ-పోస్ డీలర్లకు కార్డుకు రూ.5 ఇస్తామన్న హామీ అమలయ్యేవరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. జాయింట్‌కలెక్టర్-2 మార్కండేయులు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులకు డీలర్లు వినతి పత్రాలను డీలర్లు అందజేశారు. జిల్లాలో ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి వచ్చిన సరుకులను షాపుల దగ్గర దండికాటాపై తూచి డీలర్లకు అప్పగించాలన్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో అక్రమంగా లోడింగ్, అన్‌లోడింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు డీలర్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ నాయకులు ఆర్.సత్యనారాయణ, అడపా వెంకటరమణ, నల్లా వెంకటేశ్వరరావు, కేవీవీ రమణ, టి.రాజశేఖర్, నందిపాటి ఎల్లయ్య పాల్గొన్నారు.
చౌకదుకాణ డీలర్ల సమ్మెబాట
Published Tue, May 26 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement
Advertisement