అనంతపురం అర్బన్: ప్రజలకు మెరుగైన సేవలందిస్తామంటూ ఆ శాఖ మంత్రి మొదలు అధికారులు చెప్పుకుంటున్నా పౌరసరఫరాల శాఖలో వాస్తవ పరిస్థితులు తద్భిన్నంగా ఉన్నాయి. గత మూడు నెలలుగా నిత్యావసరాల పంపిణీలో అడుగడుగునా లోపాలు కనిపిస్తున్నాయి. కిందిబేడలు విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఉంటే... కిరోసిన్ విషయంలో అధికారులు పర్యవేక్షణ లోపం... హోల్‌సేలర్ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే... ఈ నెల కోటా కిరోసిన్‌ని కొన్ని రేషన్ దుకాణాలు, హాకర్లకు సరఫరానే కాలేదు.
జిల్లా వ్యాప్తంగా 43 వేల లీటర్లు ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. అనంతపురం నగరంలోని దాదాపు 45 మంది డీలర్లు, హాకర్లకు 19 వేల లీటర్లు సరఫరా కాలేదంటున్నారు. కొన్ని చౌక ధర దుకాణాల డీలర్లకు కిరోసిన్ సరఫరా చేయకపోవడం అంటూ ఒక రకంగా ప్రజలను ఇబ్బందికి గురిచేసినట్లే అవుతుంది.
డీలర్ల ఫిర్యాదు వరకు మౌనం
హోల్‌సేలర్ కిరోసిన్‌ని జిల్లాలోని కొన్ని చౌక ధరల దుకాణాలకు, హాకర్లకు ఈ నెల సరఫరా చేయలేదు. ఈ విషయం అధికారులకు డీలర్లు ఫిర్యాదు చేసేంతవరకు మౌనంగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజా పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా అనేదానిపై అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా పర్యవేక్షణ ఉండి ఉంటే హోల్‌సేలర్ సరఫరా కాలేదన్న విషయం వెంటనే తెలిసి ఉండేది. అలా కాకుండా డీలర్లు పిర్యాదు చేసిన తరువాత అధికారుల్లో కదలిక వచ్చిందంటే ఎంత బాధ్యతారహితంగా ఉన్నారో స్పష్టమవుతోంది.
లోగుట్టు వ్యవహారమనే విమర్శలు
హోల్‌సేలర్ కిరోసిన్ సరఫరా చేయలేదన్న విషయాన్ని డీలర్లు చెప్పే వరకు అధికారులు పట్టించుకోక పోవడం వెనుక లోగుట్టు వ్యవహారం ఉందనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ నెల కోటాలో కొన్ని దుకాణాలకు సరఫరాను ఎగనామం పెడితే అది మిగులుగా ఉంటుంది. ఈ మొత్తాన్ని బ్లాక్‌లో విక్రయించే ఎత్తుగడతో భాగంగానే వ్యవహారం నడిపినట్లు ఆరోపలు వినవస్తున్నాయి. కొందరు డీలర్లకు, హాకర్లకు ఈ నెల కోటాని హోల్‌సేలర్ సరఫరా చేయని విషయం కొందరు అధికారులకు తెలిసే జరిగిందనే విమర్శలు ఉన్నాయి.
కిరోసిన్ కష్టాలు!
Published Thu, Oct 1 2015 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM
Advertisement