మేమే పాస్ | In E-pass dealers irregularities | Sakshi
Sakshi News home page

మేమే పాస్

Published Sat, Jul 25 2015 3:14 AM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM

మేమే పాస్ - Sakshi

మేమే పాస్

- ఈ-పాస్‌లోనూ డీలర్ల అక్రమాలు
- కమిషనర్ కార్యాలయంలో వెలుగులోకి..
- వారం రోజులుగా కొనసాగుతున్న విచారణ
- రెండు రోజుల్లో జిల్లాకు అక్రమార్కుల జాబితా
కర్నూలు:
పౌర సరఫరాల శాఖలో కొత్తగా అమల్లోకి వచ్చిన బయెమోట్రిక్ విధానం కూడా డీలర్లకు వరంగా మారింది. వేలిముద్రల ఆధారంగా సరుకులు పంపిణీ చేస్తే బోగస్‌ను అరికట్టవచ్చని ప్రభుత్వం ఈ-పాస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ పద్ధతి కూడా అక్రమార్కులను నిలువరించలేకపోతోంది.

సాంకేతిక మిషన్లను సైతం బురిడీ కొట్టించి కొందరు డీలర్లు లాభాలు గడిస్తున్నారు. సరుకుల సరఫరా సందర్భంగా ఒకేసారి రెండు మూడు ఈ-పాస్ మిషన్లను ఓపెన్ చేసి కార్డుదారు వేలిముద్ర సహాయంతో సరుకులను కాజేసిన బాగోతాన్ని హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో సాంకేతిక నిపుణులు గుర్తించారు. ఈ విషయాన్ని డిప్యూటీ డెరైక్టర్ విజయలక్ష్మి దృష్టికి తీసుకుపోవడంతో ఆమె విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

కార్డుదారు వేలిముద్రను ఈ-పాస్ మిషన్‌పై నమోదు చేసిన వెంటనే చిన్న కాగితం ముక్క(బిల్లు) వస్తుంది. అందులోని లెక్కల ప్రకారం ఎలక్ట్రానిక్ కాటాపై కచ్చితమైన తూకంతో కార్డుదారులకు సరుకులను అందించాల్సి ఉంది. ఇక్కడే డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో చేపడుతున్న సంస్కరణలను సైతం డీలర్లు అనుకూలంగా మలచుకున్నట్లు బయటపడింది. రెండు, మూడు మిషన్లను ఒకేసారి ఆన్ చేసి అన్నింటిలోను వేలిముద్రలతో బిల్లింగ్ కొట్టి ఒక మిషన్ ద్వారా వచ్చిన సరుకులను మాత్రం కార్డుదారులకు కట్టబెట్టి, మిగిలిన మిషన్ల ద్వారా వచ్చిన సరుకులను కాజేసి ప్రభుత్వానికి బురిడీ కొట్టించినట్లు గుర్తించారు.
 
పోర్టబిలిటీ విధానంతో డీలర్ల చేతివాటం
రేషన్ పోర్టబిలిటీ(ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానం) అమలులో ఉన్నందున డీలర్లు కూడబలుక్కుని చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. జీపీఆర్ అనుసంధానంతో ఈ-పాస్ మిషన్లు పనిచేస్తున్నందున కర్నూలు డీలర్ల అక్రమాలు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో బయటపడ్డాయి. ఒకటికి మించి చౌక డిపోలు నిర్వహిస్తున్న వారు, సొంత చౌక డిపోలతో పాటు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న డీలర్లు ఇలాంటి తరహా అక్రమాలకు పాల్పడి ప్రభుత్వానికి శఠగోపం పెట్టినట్లు వెలుగు చూసింది.

ఈ- పాస్ విధానం వల్ల రేషన్ బియ్యం భారీగా మిగిలిందని భావిస్తున్న తరుణంలో కొత్త తరహాలో అక్రమాలు వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ తరహా మోసానికి ఎవరెవరు పాల్పడ్డారు, ఎంత మొత్తంలో సరుకులు కాజేసి ప్రభుత్వానికి బురిడీ కొట్టించారనే విషయాలపై కమిషనర్ కార్యాలయంలో జాబితా సిద్ధమయిందని సమాచారం. రెండు మూడు రోజుల్లో జిల్లా అధికారులకు నివేదిక అందే అవకాశముందని పౌర సరఫరాల శాఖ అధికారుల ద్వారా తెలిసింది.
 
పెలైట్ ప్రాజెక్టుగా కర్నూలు

రాష్ట్రంలోనే కర్నూలును పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఏప్రిల్ మాసం నుంచి జిల్లాలో ఈ-పాస్ అమలు చేస్తున్నారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, గూడూరు, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె మున్సిపల్ పట్టణాల్లోని 457 చౌక డిపోల్లో ఈ-పాస్ యంత్రాలతో సరుకుల పంపిణీ జరుగుతోంది. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మరో 680 చౌక డిపోల్లో ఆగస్టు 1 నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే నాలుగు మాసాలు గడవకముందే కర్నూలు నగరంలో డీలర్లు బయోమెట్రిక్ విధానాన్ని కూడా బురిడీ కొట్టించి అక్రమాలకు పాల్పడటం పౌర సరఫరాల శాఖలో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement