ఈ-పాస్ మిషన్‌లతోనే ఎరువుల పంపిణీ
Published Tue, Mar 28 2017 11:35 PM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
- 1 నుంచి పకడ్బందీగా ప్రక్రియ
- కర్నూలు సబ్ డివిజన్ డీలర్ల అవగాహన సదస్సులో ఏడీఏ
కర్నూలు(అగ్రికల్చర్): మే నెల 1నుంచి రసాయన ఎరువులను విధిగా ఈ-పాస్ మిషన్‌ల ద్వారానే పంపిణీ చేయాలని కర్నూలు ఏడీఏ రమణారెడ్డి సూచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఈ-పాస్ మిషన్‌ల ద్వారా ఎరువుల పంపిణీపై కర్నూలు సబ్ డివిజన్‌లోని రసాయన ఎరువుల డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ...డీలర్లకు నాగార్జున, గ్రీన్‌ఫీల్డ్, క్రిప్‌కో కంపెనీలు ఈ-పాస్ మిషన్‌లను సరఫరా చేస్తాయన్నారు. ప్రతి డీలరు విధిగా తమ వివరాలను ఈ-పాస్ మిషన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రైతుల ఆధార్ నెంబర్లు, వెబ్‌ల్యాండు వివరాలను కూడా వీటిలో అప్‌లోడ్ చేస్తామన్నారు. మే నెల 1నుంచి మాన్యువల్‌గా ఒక్క బస్తా కూడా విక్రయించరాదన్నారు. భూసార పరీక్ష పలితాలను బట్టి, సాగు చేసే పంటను బట్టి ఎన్ని బస్తాల ఎరువులు అవసరమో అన్ని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ-పాస్ మిషన్‌ల ద్వారా ఎరువుల పంపిణీ చేయలేమని భావించే డీలర్లు ఈ వ్యాపారం నుంచి వైదొలగవచ్చన్నారు. జేడీఏ కార్యాలయ ఫర్టిలైజర్ ఏఓ వేదమణి, సీ.బెళగల్ ఏఓ సురేష్‌బాబు ఈ-పాస్ మిషన్‌ల ద్వారా ఎరువుల పంపిణీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్నూలు, కల్లూరు వ్యవసాయాధికారులు అశోక్‌కుమార్‌రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement