నీరు-చెట్టు.. అధికారుల కనికట్టు
- అన్నీ కాకిలెక్కలే!
- పూడికతీత మట్టితో పచ్చనేతలకు కాసులు
సాక్షి, విశాఖపట్నం: నీరు-చెట్టు పథకం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారుతోంది. జిల్లాలో వంద ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న మీడియం ఇరిగేషన్ చెరువులు 236 ఉంటే వందలోపు ఆయకట్టు ఉన్న చెరువులు 3111 ఉన్నాయి. ఏప్రిల్‌లో తొలిదశలో రూ.4.97 కోట్ల అంచనాలతో 23 చెరువులకు, ఇటీవలే రెండోదశలో రూ.18.30 కోట్లతో మరో 69 చెరువుల ఆధునీకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది.తొలిదశలో తొమ్మిది చెరువుల్లో పనులు ప్రారంభించి వర్షాలు పడ్డాయనే సాకుతో పదిరోజుల పాటు నిలిపివేశారు. గత నెలాఖరు వరకు ఈ పనులు అసలు ప్రారంభమే కాలేదు.
యలమంచిలి నియోజకవర్గంలో ఒక్క చెరువులో కూడా పనులు చేపట్టిన దాఖలాలు లేవు. బయ్యవరంలో ప్రారంభించి ఆ తర్వాత ఎక్స్‌వేటర్ మరమ్మతుకు గురైందనే సాకుతో పనులు నిలిపేశారు. ఇవి ఉదాహరణలు మాత్రమే.. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పనులు మొక్కుబడిగానే సాగుతున్నాయి. కొద్దిపాటి వర్షాలకే గత నెలలో వారం రోజుల పాటు పనులు నిలిపి వేశారు. ప్రస్తుతం 92 చెరువుల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే ఏకంగా 40 శాతం పూడికతీత పనులు పూర్తయ్యాయని అధికారులు లెక్కలు చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. నామినేషన్ పద్ధతిలో ఈ పనులను అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుయాయులకు కట్టబెట్టారు. వీరు సమకూర్చిన 49 ఎక్సవేటర్స్ అప్పుడే 11వేల గంటలపాటు పూడికతీతపనులు చేశాయని లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి ఎక్కడా పట్టుమని పదిహేను రోజులు కూడా పనిచేసిన దాఖలాలు లేవు.
మట్టి.. గ్రావెల్‌కు రెక్కలు
చెరువుల్లోని మట్టి/గ్రావెల్‌కు రెక్కలొచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం 3.56 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే వెలికితీసినట్టు లెక్కలుచూపుతున్నారు. 92 చెరువుల్లో 40 శాతం పనులు పూర్తయ్యాయంటే ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మట్టంతా ఏమైపోతుందని అడిగితే క్యూబిక్ మీటర్‌కు రూ.22 చొప్పున స్థానిక సంస్థలకు సీనరేజ్ కట్టిన ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఈ మట్టి/గ్రావెల్ అమ్మకాల ద్వారా టీడీపీ నేతలు లబ్ధిపొందుతున్నారనే విమర్శలున్నాయి. వర్షాలు పడేలోగా పనులు పూర్తిచేసినట్టు రికార్డులు సృష్టించుకుని బిల్లులు డ్రా చేసుకోవాలన్నది ఎత్తుగడగా చెబుతున్నారు. మరో 30 నుంచి 40 శాతం పనులుండగానే పూర్తి చేసినట్టుగా చూపించి అందినకాడికి బొక్కేయాలన్న ఆలోచనతో అధికార పార్టీ నేతలున్నట్టు కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ఈ పనులపై నిఘా ఉంచకపోతే కోట్ల విలువైన మట్టి/గ్రావెలే కాదు.. కోట్లాదిరూపాయల ప్రజాధనం కూడా ఈ స్వాహారాయుళ్ల పరమయ్యే అవకాశం ఉంది.