సాక్షి, శ్రీకాకుళం : నీరు ఉంటేనే చెట్టు.. చెట్టు ఎదిగితేనే నీరు. ఈ రెండు ఉంటేనే జీవరాశుల మనుగడ. వీటికున్న ప్రాధాన్యత ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ గత ప్రభుత్వంలో నీరు లేదూ... చెట్టూ లేదూ.. కానీ నీరు–చెట్టు పథకం పేరుతో అవినీతి మాత్రం వటవృక్షంలా వేళ్లూనుకొనిపోయింది. పర్యావరణానికి దోహదపడాల్సిన వందల కోట్ల నిధులను టీడీపీ ప్రజాప్రతినిధులు అమాంతంగా మింగేశారు. నీటిని ఎంత చిలికినా వెన్న రాదన్నది ఎంత నిశ్చిత సత్యమో... చంద్రబాబు ప్రభుత్వంలో పథకం ఏదైనా నీతికి నీళ్లు వదిలి, పైకం పిండుకోవడం అంతే నిజం. ఏ పథకాన్ని ఏ లక్ష్యంతో ప్రవేశపెట్టినట్టు ప్రకటించినా.. ఆచరణలో దాన్ని తమ జేబులు నింపుకునే ప్రాజెక్టుగా మార్చేశారు. ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. కళ్ల ముందు అక్రమాలు కన్పించినా అడ్డుకోలేకపోయారు. అవినీతి రహిత పాలన దిశగా ముందుకెళ్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడా ప్రయత్నం చేస్తోంది. నీరుచెట్టు నిధులను మేసేసిన నేతల గుట్టు రట్టు చేయాలని చూస్తోంది.
గత నేతల మేత ఇలా..
శ్రీకాకుళం రూరల్‌లోని నారాయణపురం చానెల్‌లో నీరు–చెట్టు పథకం కింద పూడికతీత పనులు చేపట్టారు. అప్పటికే రూ.2.63 లక్షలతో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసినా అదే చానెల్‌లో మళ్లీ పొక్లెయిన్ ద్వారా పూడికతీత పనులు చేపట్టారు. రూ.24 లక్షల వరకు బిల్లు కాజేశారు. విశేషమేమిటంటే నీరు పారుతుండగా పూడికతీత పనులు ఇక్కడ చేపట్టారు. దీన్నిబట్టి ఇక్కడ పనులు ఎలా జరిగాయో అర్థం చేసుకోవచ్చు.
⇔ ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధిలోని 2వ వార్డు కృష్ణాపురం గ్రామంలో కిల్లివానిచెరువులో తూతుమంత్రంగా పూడికతీత పనులు చేపట్టి రూ.10 లక్షలు డ్రా చేసేశారు. ఇదే మండలంలోని చిట్టివలస జగ్గన్న చెరువులో మట్టిని తీసి గట్టును చేసేందుకు రూ.7 లక్షలు పనులను టీడీపీ నేత దక్కించుకుని జేసీబీ సాయంతో ఉమ్మితడి పనులు చేపట్టి నిధుల కైంకర్యం చేశారు.
⇔ జెడ్పీ తాజీ మాజీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి సొంత గ్రామమైన ఎస్‌ఎంపురం పెద్ద చెరువులో నీరు–చెట్టు, ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టారు. ఒక్క నీరు చెట్టు కింద రూ.1.34 కోట్లు ఖర్చు చేశారు. నామమాత్రపు పనులు చేసి నిధులు దోచేశారు. మట్టిని రోడ్డు బెర్మ్‌కు వినియోగించారు.
⇔ నాడు మంత్రిగా వెలగబెట్టిన కింజరాపు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో తుమ్మసాగరంలో సుమారు రూ.45 లక్షలతో నీరు–చెట్టు పనులు చేపట్టారు. అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ కనుసన్నల్లో తాజా మాజీ సర్పంచ్ భర్త గున్న నాగభూషణరావు అరకొర పనులు చేపట్టారు. నిధులు మాత్రం పూర్తిగా డ్రా చేసేశారు.
ఇలా చెప్పుకొనిపోతే జిల్లావ్యాప్తంగా ఇదే తరహాలో నీరు–చెట్టు అక్రమాలు ఎన్నో జరిగాయి. చెరువుల్లో పూడికలు తీయడం ద్వారా గట్లను పటిష్టం చేసి, నీటి వనరులను మెరుగుపర్చుకోవాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం కింద టీడీపీ నేతలు వందల కోట్లు వెనకేసుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో నీరు చెట్టు పనుల కోసం రూ.427.26 కోట్ల మేర ఖర్చు చేశారు. ఇందులో సగానికి పైగా స్వాహా చేసేశారు. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు యథేచ్ఛగా మట్టి మింగేశారు. మట్టి తవ్వకాల పేరుతో ఒకవైపు ప్రభుత్వం నుంచి నిధులు డ్రా చేసుకోగా మరోవైపు తవ్విన మట్టిన అమ్ముకుని కోట్లాది రూపాయలు సంపాదించారు. నీరు చెట్టు పథకం కింద చెరువుల్లో తవ్విన మట్టిని సామాజిక అవసరాలకు వినియోగించాలన్న ఆదేశాలను తెలుగు తమ్ముళ్లు బేఖాతర్ చేశారు. జిల్లావ్యాప్తంగా నీరు చెట్టు అక్రమాలు జరిగాయి. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్ వాల్, చెక్‌డ్యామ్‌లు, స్లూయిజ్‌లు,..ఇలా రకరకాల కాంక్రీటు పనుల రూపంలో కూడా పెద్ద ఎత్తున నిధుల స్వాహాకు పాల్పడ్డారు. కాంక్రీటు పనులు కొన్ని నాసిరకంగా, మరికొన్ని అసంపూర్తిగా చేసిన దాఖలాలు ఉన్నాయి.
కొన్నిచోట్ల పనులు చేపట్టకుండానే నిధులు డ్రా చేసుకోగా, మరికొన్ని చోట్ల పాత పనులకే పైపై మెరుగులు దిద్ది బిల్లులు చేసుకున్నారు. నీరు–చెట్టు పనులు దాదాపు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. ఏకపక్షంగా పనులు దక్కించుకుని నచ్చినట్టుగా నిధులు మింగేశారు. చెరువు తవ్వకాల్లో క్యూబిక్ మీటర్‌కు ప్రభుత్వం రూ.29 చెల్లించింది. ఈ లెక్కన ప్రభుత్వమిచ్చే మొత్తంతోపాటు అదనంగా మట్టి విక్రయంతో వచ్చిన సొమ్ముతో కోట్లు గడించారు. చెప్పాలంటే నీరు–చెట్టు ముసుగులో టీడీపీ నేతలంతా కోట్లకు పడగెత్తారు. తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గత ప్రభుత్వ అక్రమాలపై దృష్టి సారించింది. నేతలు మేసేసిన నీరు–చెట్టు పథకంపై విచారణకు ఉపక్రమించింది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయమని చెప్పడమే కాకుండా ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని ఆదేశించింది. వీటిపై సమగ్ర విచారణ విచారణ చేస్తే నేతల అవినీతి బట్టబయలు కానుంది. గత పాలకులు తిన్నదంతా కక్కించేందుకు అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment