దోచేస్తే ఓకే.. తప్పు చేస్తే వేటే!
డీఆర్‌డీఏ ఉన్నతాధికారుల తీరు
- అక్రమార్కులను వదిలిపెట్టి చిరుద్యోగులపై చర్యలు
- అవినీతిపరులకు అధికార పార్టీ అండదండలు
అనంతపురం సెంట్రల్: డీఆర్‌డీఏ- వెలుగు ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలకు పాల్పడి లక్షలు దోచేస్తే చర్యలు తీసుకోరు కానీ, చిన్న తప్పిదాలు చేస్తే మాత్రం వేటు వేస్తారు. వివరాల్లోకి వెళితే, బుక్కపట్నం మండలంలో కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రామాంజులు ఏకంగా ఓ బినామి ఖాతాను ప్రారంభించి రూ.22 లక్షలు అప్పనంగా భోంచేశాడు. ఈ విషయం బయటపడినా, ఆయనపై చర్యలు తీసుకోకుండా ప్రస్తుతమున్న ఓ మంత్రే నేరుగా రంగంలోకి దిగాడు. అయితే పత్రికలలో వరుస కథనాలు రావడంతో వేరే మండలానికి బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఉల్లికల్లు ఇసుకరీచ్‌లో రూ.44 లక్షలు అవినీతి జరిగిందని స్వయంగా ఆర్‌డీఓ హుస్సేన్‌సాహేబ్ తేల్చారు.
అయితే ఇంత వరకూ ఏ ఒక్కరిపైనా చర్యలు లేవు. గతంలో అనంతపురం మండల సమాఖ్యలో మహిళల పేరుతో సీఐఎఫ్ రూ.2 లక్షలు, కూడేరు మండలంలో స్త్రీ నిధి నిధులు రూ. 6 లక్షలు, కళ్యాణదుర్గంలో స్త్రీనిధి రుణాలు రూ.1.80 లక్షలు దుర్వినియోగం అయ్యాయి. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. కనీసం రికవరీ కూడా సరిగా చేయలేదు. అంతోఇంతో కట్టించుకొని ఫైల్స్ మూసేశారు. జిల్లా సమాఖ్యలో ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేస్తున్నారని ఆడిట్‌లో స్పష్టంగా తేలింది. కానీ నిధుల ఖర్చుపై కనీసం సమీక్ష కూడా లేదు. కానీ ఈ విషయం బయటకు ఎలా పొక్కిందని ఆరా తీస్తూ అక్రమార్కులను వ్యతిరేకించే ఓ అధికారిణి పేరు చెప్పారు. అంతే ఆమెను టర్మినేట్ చేయాలని పీడీ వెంకటేశ్వర్లు ఆదేశించినట్లు సమాచారం.
రెండు రోజుల క్రితం బుక్కపట్నం సీసీ రామేశ్వరమ్మను సస్పెండ్ చేసి, స్థానిక ఏపీఎంకు షోకాజ్‌లు జారీ చేశారు. కారణమేమంటే టీడీపీ ప్రభుత్వంపై సానుభూతిని పెంచేందుకు నిర్వహిస్తున్న అనంత మహిళా వారోత్సవాలను సరిగా నిర్వహించకపోవడమే. అయితే జిల్లాలో ఇప్పటి వరకూ ఎన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. ఎంతమంది రాత్రిళ్లు గ్రామాల్లో బస చేస్తున్నారని ఆరా తీస్తే నామమాత్రమే. పనిచేసే చోటే నివాసముండాలనే నిబంధన ఉన్నా మారుమూల పని చేస్తున్న ఏపీఎంలు, ఏరియా కో ఆర్డినేటర్లు జిల్లా కేంద్రంలోనే నివాసముంటున్నారు. వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే కార్యాలయాలకు వెళుతూ మిగతా రోజులు ఫోన్లలోనే విధులు నిర్వహిస్తున్న అధికారులెవరో కూడా ఉన్నతాధికారులకు తెలుసు. కానీ వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. చిన్న స్థాయి ఉద్యోగులపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు.