సర్కారు కళ్లలో ఇసుక | Vigilance officers Seized 7 lorries | Sakshi
Sakshi News home page

సర్కారు కళ్లలో ఇసుక

Published Tue, Dec 23 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

సర్కారు కళ్లలో ఇసుక

సర్కారు కళ్లలో ఇసుక

 యరగాం.. సరుబుజ్జిలి మండలంలోని ఈ ఇసుక ర్యాంపు వద్ద 7 లారీలు, ఒక పొక్లెయిన్‌ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వంశధార తీరంలోని ఈ ర్యాంపును ప్రారంభించిన 20 రోజుల్లో రూ. 43 లక్షల ఆదాయం లభిస్తే.. అక్రమంగా తరలించిన ఇసుక ద్వారా అక్రమార్కులు సంపాదించిన ఆదాయం రూ.30 లక్షలని అధికారులు ప్రాథమికంగా గుర్తించడం విశేషం.
 
 తలవరం.. వీరఘట్టం మండలంలో నాగావళి తీరంలో ఉన్న ఈ ర్యాంపు తొలి నుంచి అక్రమాల పుట్టగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా నకిలీ మీ సేవ బిల్లులతో ఇసుక తరలింపు దందా గుట్టు బట్టబయలైంది. ఒకే నెంబరుతో ఉన్న మీ సేవ బిల్లులపై వేర్వేరు సంతకాలు ఉన్న విషయాన్ని గుర్తించిన అధికారులు తీగలాగితే డొంక కదిలింది. ఆరు రోజుల్లోనే ఇలాంటి 9 నకిలీ బిల్లులతో రూ.85,725 విలువైన ఇసుక తరలిపోయినట్లు వెల్లడైంది.
 
 ..ఈ రెండు సంఘటనలు
 జిల్లాలోని ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాలను కళ్లకు కడుతున్నాయి. మహిళా సంఘాల ఆర్థిక ఎదుగుదలకు, అవకతవకల నివారణకు సరికొత్త ఇసుక విధానమంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడిని.. జారీ చేసిన నిబంధనలను అక్రమార్కులు తమ ఎత్తులతో చిత్తు చేస్తున్నారు. నకిలీ బిల్లులు, రాజకీయ పలుకుబడితో సర్కారు కంట్లో ఇసుక కొట్టి లక్షల ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు.
 
 వీరఘట్టం: వీరఘట్టం మండలంలోని తలవరం ఇసుక ర్యాంపులో మరో అక్రమం చోటు చేసుకుంది. అక్రమం గా బిల్లులు తయారు చేసి లారీల్లో ఇసుక తరలిస్తున్న బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.35 లక్షల విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలిం చి పట్టుబడిన వ్యవహరంపై ఇంకా దర్యాప్తులో సాగుతుండగానే నకిలి బిల్లులతో ఇసుక తరలిస్తున్న విషయం బయటపడింది. తలవరం ర్యాంపులో ఆదివారం ఉదయం పాలూరు బంగారునాయుడు పేరిట ఓ లారీకి 20 క్యూబిక్ మీటర్ల ఇసుకను లోడ్ చేసి పంపించారు. మరలా అదే ఆర్డర్‌పై పాలకొండ మండలం బెజ్జి గ్రామానికి చెందిన శివ్వాల రాంబాబుది ఓ లారీ వచ్చింది.
 
 ఈ లారీకి కూడా 20 క్యూబిక్ మీటర్లను ఇసుకను లోడ్ చేసి పంపించారు. మీసేవ నుంచి వచ్చిన బిల్లులను కమ్యూనిటీ సర్వేయర్ దుర్గారావు పరిశీలిస్తూ ఒకే బిల్లుపై రెండు లారీలకు ఇసుకను లోడ్ చేసినట్లు గుర్తించి అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై ఆర్.శ్రీనివాసరావు ఆదివారం రాత్రి ఏపీ31టీయూ 2456 నంబరు గల ఇసుక లారీను పట్టుకొని స్వాధీనం చేసుకుని డ్రైవర్ శంకరావును ప్రశ్నించారు. శివ్వాల రాంబాబు రూ.13,500 విలువ గల మీ-సేవ కేంద్రం వద్ద తీసిన ఎస్‌ఓపీ బిల్లు తన వద్ద ఉందని మరో రూ.500 అదనంగా ఇస్తే ఇస్తానని చెప్పడంతో ఆయన వద్ద ఈ బిల్లును రూ.14 వేలకు కొనుగోలు చేసినట్లు లారీ డ్రైవర్ తెలిపినట్లు సమాచారం. శివ్వాల రాంబాబును కూడా పోలీసులు ప్రశ్నించారు.
 
 అయితే ర్యాంపు నిర్వహకులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో అతనిని విడిచిపెట్టారు. కాగా.. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు విక్రయించిన ఇసుక లారీలో బిల్లులును ర్యాంప్ సిబ్బంది సోమవారం పరిశీలించగా తొమ్మిది బిల్లులతో రెండేసి సార్లు ఇసుక లోడ్‌లను విక్రయించినట్లు గుర్తించారు. ఈ బిల్లులన్నీ పాలకొండ మీ-సేవా కేంద్రం(02361) నుంచి వచ్చినవేనని తెలుసుకున్నారు. మహిళా సంఘాలు, ర్యాంపు సిబ్బంది సమాచారాన్ని ఎంఎంఎస్ అధ్యక్షురాలు కె.లలితకుమారి, జిల్లా ఉన్నతాధికారులకు తెలిపారు. రూ.85,725 విలువ గల 127 క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమంగా తరలిపోయినట్లు గుర్తించారు.  బాధ్యులను ఉపేక్షించం: ఇసుక ర్యాంపులో అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని డీఆర్‌డీఏ పీడీ తనూజరాణి అన్నారు. విషయం తెలిసిన తర్వాత ఆమె తలవరం ర్యాంపునకు చేరుకొని నకిలీ బిల్లులను పరిశీ లించారు. వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని మహిళా సంఘాలను, ఐకేపీ సిబ్బందిని ఆదేశించారు.  
 
 మీ-సేవకేంద్రంపై ఫిర్యాదు
 తలవరం ర్యాంపులో ఇసుక కొనుగోలుకు పాలకొండకు చెందిన మీ సేవ కేంద్రం (02361)నకిలీ బిల్లులు ఇచ్చిందంటూ ర్యాంపు నిర్వహిస్తున్న మహిళా సంఘం సభ్యులు సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ఆర్.శ్రీనువాసరావు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement