అక్రమార్కులకు అభయహస్తం | TTD Vigilance Department proved an illegal activities done in Tirumala | Sakshi
Sakshi News home page

అక్రమార్కులకు అభయహస్తం

Published Thu, Aug 14 2014 5:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

అక్రమార్కులకు అభయహస్తం

అక్రమార్కులకు అభయహస్తం

* శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టులో రూ.వంద కోట్లు మింగారని తేల్చిన విజిలెన్స్
* విజిలెన్స్ విభాగం నివేదికను బుట్టదాఖలు చేసిన టీటీడీ ఉన్నతాధికారులు
* అక్రమాల గుట్టును రట్టుచేసిన విజిలెన్స్ అధికారిపై బదిలీ వేటు!

 
 శ్రీవారి పేరుతో రూ.వంద కోట్లు కొల్లగొట్టిన అక్రమార్కులకు టీటీడీ ఉన్నతాధికారులు దన్నుగా నిలుస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేశారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టులో అక్రమాల గుట్టు రట్టుచేసిన ఓ ఉన్నతాధికారిపై మంగళవారం బదిలీ వేటు వేయడం టీటీడీలో కలకలం రేపుతోంది.  
 
 సాక్షి ప్రతినిధి, తిరుపతి: నాలుగేళ్ల క్రితం లోక కల్యాణం కోసం దేశ, విదేశాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు ‘శ్రీనివాస కల్యాణం’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును టీటీడీ చేపట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును అక్రమార్జనకు అనువుగా మల్చుకోవడానికి అప్పటి ఓ ఉన్నతాధికారి పథకం వేశారు. ఆ క్రమంలోనే టీటీడీ సర్వీసు ఉన్న అధికారులను కాదని.. తనకు సమీప బంధువైన ఓ రిటైర్డ్ అధికారికి ఆ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించారు. ఎక్కడైనా శ్రీనివాస కల్యాణం నిర్వహణకు స్థానికంగా 60 శాతం ఖర్చులు భరించడానికి ఎవరైనా దాతలు ముందుకు వస్తే.. తక్కిన 40 శాతం వ్యయాన్ని టీటీడీ భరించేలా  రూపొందించారు. శ్రీవారి కల్యాణం పేరుతో టీటీడీ ముద్రవేసుకుని భక్తులకు టికెట్లు విక్రయించకూడదని..ఆ పేరుతో విరాళాలు సేకరించకూడదని ఈ ప్రాజెక్టు నిబంధనలు రూపొందించారు. కానీ.. ఆ నియమనిబంధనలను టీటీడీ ఉన్నతాధికారులు తుంగలో తొక్కారు.
 
 దేశంలో బెంగళూరు, భద్రావతి, కుముదం, ముంబయి, చెన్నై, పాండిచ్చేరి, కాంచీ పురం తదితర ప్రాంతాలతోపాటు అమెరికా, ఇంగ్ల్లండ్ వంటి విదేశాల్లోనూ 175ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలను నిర్వహించారు. శ్రీనివాసకల్యాణం ప్రాజెక్టుకు టీటీడీ నిధులను రూ.3కోట్ల మేర మాత్రమే వెచ్చించి నట్లు అధికారవర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కానీ.. ఆ ముసుగులో శ్రీవారి కల్యాణోత్సవం పేరుతో టీటీడీ లోగోను ముద్రించిన టికెట్లను విక్రయించి.. విరాళాలు సేకరించి.. శ్రీవారి విగ్రహాలను విక్రయించి రూ.వంద కోట్లకుపైగా కొల్లగొట్టారని టీటీడీ విజిలెన్స్ విభాగం తేల్చింది. ఏప్రిల్ 30, 2012న కర్ణాటకలో కుముదంలోని కేంద్రీయ విద్యాలయ ఆవరణలో శ్రీనివాస కల్యాణోత్సవంలోనూ.. అక్టోబర్ 18, 2012న ముంబయిలో 3,500 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఓ ప్రైవేటు ఆడిటోరియంలో నిర్వహించిన కల్యాణోత్సవంలోనూ టికెట్లను భక్తులకు విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ ఆధారాలను సేకరించింది.
 
 అమెరికాలో టెక్సాస్, న్యూజెర్సీ వంటి 20 నగరాల్లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణోత్సవాల్లోనూ టికెట్లను భక్తులకు విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం నిర్ధారించింది. ఒక్కో కల్యాణోత్సవానికి సగటున రూ.మూడు కోట్ల వరకూ దోచుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. మే 27, 2012న అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో  బాలాజీ ఆలయంలో కల్యాణోత్సవం పూర్తయిన తర్వాత శ్రీవారు, పద్మావతి అమ్మవార్ల విగ్రహాలను రూ.1.50 కోట్లకు ఓ పారిశ్రామికవేత్తకు విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది.
 
 అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని రెండేళ్ల క్రితం విజిలెన్స్ విభాగం ప్రాథమిక నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు ఇచ్చింది. ఇటీవల తుది నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు అందజేసింది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి టీటీడీ ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారు. అక్రమార్కులకు దన్నుగా నిలుస్తూ విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేశారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టులో అక్రమాల గుట్టు రట్టు చేసిన టీటీడీ వీజీవో హనుమంతుపై మంగళవారం బదిలీ వేటు వేశారు. తుది నివేదిక ఇచ్చిన కొద్ది రోజుల్లోనే టీటీడీ వీజీవోపై బదిలీ వేటు వేయడంపై టీటీడీ అధికారులు నివ్వెరపోతున్నారు.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement