TTD To Conduct Srinivasa Kalyanam In Six American Cities - Sakshi
Sakshi News home page

అమెరికాలో ఆ 11 నగరాల్లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం

Published Wed, Jun 28 2023 12:14 PM

TTD Conduct Srinivasa Kalyanam In Six American Cities - Sakshi

అమెరికాలోని 11 నగరాల్లో భాగంగా నాలుగు నగరాల్లో అత్యంత వైభవోపేతంగా జరిగిన శ్రీనివాస కల్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూఎస్‌ఏ లోని జూన్ 17వ తేదీన ర్యాలీ(నార్త్ కరోలినా), 18న జాక్సన్ విల్(ఫ్లోరిడా) 24న డెట్రాయిట్, 25న చికాగో నగరాల్లో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి వారు ఎన్‌ఆర్‌ఐ భక్తులకు దర్శనమిచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆయా నగరాలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించాలని పలు తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల నుంచి ఏపీఎన్ఆర్టీ సొసైటీకి వచ్చిన అభ్యర్థనల మేరకు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్.

మేడపాటి, టిటిడి చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు, ఈవో గారి దృష్టికి తీసుకెళ్లగా ఆమోదం తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ మొదటి నుంచి తితిదేతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయము చేస్తూ వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణోత్సవం జరిగేలా చూసుకుంది. అక్కడి నిర్వాహకులు... భక్తులు, అర్చకులు, వేదపండితులకు, తితిదే అధికారులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నాలుగు నగరాల్లో స్వామివారి కల్యాణానికి వేదికను అలంకరించిన తీరు ఒక్కో నగరంలో ఒక్కోలాగా అందంగా అలంకరించారు. ఈ కల్యాణోత్సవాలకు తెలుగు వారే కాక, తమిళనాడు, కేరళ, కర్నాటక ఇలా ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 12 వేలకు పైగా స్వామివారి ఎన్‌ఆర్‌ఐ భక్తులు హాజరై కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.

ఆయా ప్రాంగణాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. ఆయా నగరాల్లోని నిర్వాహకులు ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకొని, ఏర్పాట్లన్నీ ఘనంగా చేసారు. హాజరైన భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొన్న అనంతరం భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించటం జరిగింది. ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొన్న ప్రవాసాంధ్రుల వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు మరియు ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షులు అయిన శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో నార్త్ అమెరికాలోని 14 నగరాల్లో చేపట్టిన శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాల్లో, ఇప్పటికే తితిదే చైర్మన్ శ్రీ. వై.వి. సుబ్బారెడ్డి గారి పర్యవేక్షణలో కెనడా లోని 03 నగరాల్లో పూర్తయ్యాయి.

ఇప్పుడు యూఎ‍స్‌ఏలోని 04 నగరాల్లో నిర్వహించడం జరిగింది. తితిదే అర్చకులు, వేదపండితుల ద్వారా కల్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధాన, అంకురార్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాలు నిర్వహించారన్నారు. ఇంకా USA లోని జూలై 1వ తేదీ నుండి జూలై 23 వ తేదీ వరకు ౦7 నగరాల్లో జరిగే శ్రీవారి కల్యాణంలో టిటిడి చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు పాల్గొననున్నారని శ్రీ వెంకట్ పేర్కొన్నారు.

యూఎస్‌ఏలో ర్యాలీలో జరిగిన కల్యాణోత్సవంలో ఈశ్వర్ రెడ్డి, మహిపాల్ మాలే, జాక్సన్ విల్‌లో, మల్లికార్జున జెర్రిపోతుల, ప్రభుత్వ సలహాదారు డా ఎన్ వాసుదేవ రెడ్డి, డెట్రాయిట్‌లో మహేష్ చింతలపాటి, బాలాజీ సత్యవరపు, ఎస్ నరేన్, చికాగోలో శరత్ ఎట్టపు, నరసింహ రెడ్డి, పీఎన్ఆర్టీఎస్ ప్రతినిధులు తదితరులు స్వామివారి కల్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమంలో తితిదే నుంచి ఏఈఓ బి వెంకటేశ్వర్లు, ఎస్‌వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆయా నగరాలలోని పలువురు ప్రముఖులు భారతీయులు పాల్గొన్నారు. ఎస్‌వీబీసీ ఛానెల్ కల్యాణోత్సవం మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.

(చదవండి: పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వైఎస్సార్‌సీపీ.. సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ దూకుడు!)

Advertisement
 
Advertisement
 
Advertisement