
గల్ఫ్ అమరుల సంస్మరణ సభకు సన్నాహాలు
గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్‌లో త్వరలో 'గల్ఫ్ అమరుల సంస్మరణ సభ' ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులతో సీఎం ఏ. రేవంత్ రెడ్డి సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని వారికి భరోసా ఇవ్వనున్నారని ఆయన తెలిపారు.
తన విజ్ఞప్తి మేరకు స్పందించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 94 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4 కోట్ల 70 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా సొమ్ము వారి ఖాతాలకు ఈనెల ఒకటిన జమ చేయించారని అనిల్ ఈరవత్రి తెలిపారు. గల్ఫ్ కార్మికులు ఆయురారోగ్యాలతో, క్షేమంగా మాతృభూమికి తిరిగి రావాలని కాంగ్రేస్ ప్రభుత్వం ఆశిస్తున్నది. కానీ... దురదృష్ట వశాత్తు గల్ఫ్ దేశాలలో అకాల మరణం చెందిన మన తెలంగాణ ప్రవాసీ కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన తెలిపారు.
మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
భారత దేశ సరిహద్దులు దాటి ఎడారి దేశాలలో పనిచేస్తూ మృతి చెందిన కార్మికులు సైనికుల లాంటి వారని, విదేశీ మారక ద్రవ్యం పంపిస్తూ ఆర్థిక జవాన్లుగా సేవలందించిన వారిని 'గల్ఫ్ అమరులు' గా స్మరించుకొని వారిని గౌరవించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ 'గల్ఫ్ భరోసా' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అనిల్ ఈరవత్రి తెలిపారు.