కూతురి వేదన చూసి కుంగిన తండ్రి
బిర్యానీలో విషం కలుపుకొని ఇద్దరూ తిన్న వైనం..
చికిత్స పొందుతూ తండ్రి మృతి.. కోలుకున్న కూతురు
అల్వాల్ (సికింద్రాబాద్): ఎన్నారై అల్లుడు, అతని కుటుంబీకుల వేధింపులు భరించలేక..ఇంటికి తిరిగి వచ్చేసిన కూతురి వేదన చూసి కుంగిపోయిన ఓ తండ్రి కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈ విషాద ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా రాంనగర్ ప్రాంతానికి చెందిన జగన్‌మోహన్‌రెడ్డి (60) ఆర్టీసీ ఉద్యోగి. 2021లో తన కుమారై సేహ్న (30)కు సూరారం ప్రాంతానికి చెందిన నవీన్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన వెంటనే నవీన్‌రెడ్డి, స్నేహలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల నిమిత్తం అమెరికా వెళ్లారు.
మార్చి 2024లో నవీన్‌రెడ్డి, స్నేహ దంపతులకు ఒక పాప పుట్టింది. డెలివరీ సమయంలోనే స్నేహ అనారోగ్యానికి గురైంది. దీంతో భర్త నవీన్‌రెడ్డి భార్యను నెలన్నర పసిపాపతో సహా అల్వాల్ రీట్రీట్ కాలనీలో ఉంటున్న స్నేహ తండ్రి జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు పంపించేశాడు. ఈ క్రమంలో నవీన్ తల్లిదండ్రులు మహేందర్‌రెడ్డి, పద్మలు వీరిని వేధించారు. అనారోగ్యానికి గురయ్యావంటూ నిందించారు. అనంతరం చిన్నారిని బలవంతంగా సూరారం తీసుకెళ్లారు. ఈ విషయంపై మాట్లాడేందుకు జగన్‌మోహన్‌రెడ్డి, స్నేహలు సూరారం వెళ్లి పాపను తమకు ఇచ్చేయాలని కోరారు. దీనికి నిరాకరించిన నవీన్ కుటుంబ సభ్యులు దూషించారు.
వారి వేధింపులు భరించలేక అనారోగ్యానికి గురైన కుమార్తెను తీసుకొని జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 12వ తేదీన నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ ఆమెకు చూపించి.. తిరిగి వస్తూ బోయిన్‌పల్లిలో బిర్యానీ కొనుగోలు చేసి..దాంట్లో విషం కలుపుకొని కారులో కూర్చొని తిన్నారు. ఇంటికి వచ్చిన అనంతరం వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం జగన్‌మోహన్‌రెడ్డి మృతి చెందగా కూతురు స్నేహ కోలుకుంది. కూతురు జీవితం చిన్నాభిన్నం అయిందన్న వేదనతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అల్వాల్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఊహించని విధంగా మరణం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు..
Comments
Please login to add a commentAdd a comment