
- మహిళా దినోత్సవం, మహా శివరాత్రి వేడుకలు.
- కుటుంబాలతో సహా వచ్చి ఆడిపాడిన ఉత్సాహం.
- వేడుకగా జరిగిన నైటా పండగలు. ముఖ్య అతిధిగా న్యూయార్క్ మేయర్.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.
ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.
తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.
న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.
నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment