సదాశివపేట, న్యూస్‌లైన్: ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతంపడుతున్నారు. మొన్న తూప్రాన్‌లో సబ్ రిజిస్ట్రార్, నిన్న వర్గల్‌లో వర్‌క ఇన్‌స్పెక్టర్, నేడు సదాశివపేటలో మున్సిపల్ ఇంజినీర్ అధికారులను పట్టుకున్నారు. సదాశివపేట మున్సిపల్ ఇంజినీర్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనుల బిల్లుల మంజూరు కోసం రూ. 30 వేలు తీసుకుంటూ శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్‌కు చెందిన కుషిమా ఎలక్ట్రికల్ యజమాని ఆర్‌ఎస్ సుధాకర్ గత సంవత్సరం సదాశివపేటలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులకు రూ. 6,58,815 టెండర్ ద్వారా 20.4 శాతం లెస్‌కు దక్కించుకున్నారు. పనులను పూర్తిచేసిన కాంట్రాక్టర్ బిల్లు మంజూరుకు మున్సిపల్ ఇంజనీర్ భూమేశ్వర్ వద్దకు వచ్చి ఎంబీ రికార్డు చేసి బిల్లు ఇప్పించాలని కోరారు. దీంతో ఆ అధికారి ఎంబీ రికార్డు చేయడానికి రూ. 80 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తాము లెస్‌కు టెండర్ వేసి పనులను దక్కించుకున్నామని పనులు చేసి నష్టపోయామని కాంట్రాక్టర్ సుధాకర్ అధికారిని కోరారు. అయినా అధికారి ససేమిరా అనడంతో రూ.50 వేలకు ఒప్పందం కుదిరింది.
పది రోజుల క్రితం సుధాకర్ సూపర్‌వైజర్ సమ్మాల్ ద్వారా రూ. 20 వేలను భూమేశ్వర్‌కు అందజేశారు. ఈ నెల 5న సమ్మాల్ మున్సిపల్ కార్యాలయంలో భూమేశ్వర్‌ను కలసి బిల్లు ఇప్పించాలని కోరారు. ఒప్పందం ప్రకారం మిగతా రూ. 30 వేలు ఇస్తేనే బిల్లు చేస్తానని ఖరాఖండిగా చెప్పడంతో సమ్మాల్ తన యజమాని సుధాకర్‌కు ఫోన్‌లో విషయం చెప్పారు. చేసేదిలేక ఈ నెల 6న సుధాకర్, సూపర్‌వైజర్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సమ్మాల్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే తన క్వార్టర్‌కు రావాలని సమ్మాల్‌కు సూచించి ఇంజనీర్ వెళ్ల్లిపోయారు.
దీంతో క్వార్టర్‌కు వెళ్లి రూ. 30 వేలు ఇస్తుండగా అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు తన సిబ్బందితో దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్టు పనికి సంబంధించిన రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపుతామని ఏసీబీ డీఎస్పీ విలేకరులకు వివరించారు. లంచం డిమాండ్ చేస్తున్న ప్రభుత్వ అధికారుల గురించి తమకు 9440446155 ఫోన్‌కు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన ప్రజలకు సూచించారు.
హడలెత్తిస్తున్న ఏసీబీ
Published Fri, Feb 7 2014 11:39 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement