యెన్నం కాంచన
షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) మేయర్‌గా ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన తెలుగు మహిళ యెన్నం కాంచన ఎన్నికై రికార్డు సృష్టించారు. షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బుధవారం జరిగిన రెండవ టర్మ్ మేయర్ ఎన్నికల్లో యెన్నం కాంచన ఘన విజయం సాధించారు. అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్‌గా గుర్తింపు పొందిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో రెండేళ్ల క్రితం కృష్ణవేణి రెడ్డి కార్పొరేటర్‌గా విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో తెలుగు మహిళ కాంచన యెన్నం ఏకంగా మేయర్ పదవిని కైవసం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు.
పెళ్లి తర్వాతే తన జీవితంలో మార్పు పచ్చిందని కాంచన యెన్నం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఘనపూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ఈగె అయిలప్ప, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన కాంచన షోలాపూర్‌లోనే పుట్టి పెరిగారు. స్థానిక డీఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. అనంతరం కాంచనకు ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన యెన్నం రమేష్‌తో 1992లో వివాహం జరిగింది. సాధారణ గృహిణిగానే జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఆమె భర్త రమేష్ రాజకీయాల్లో తిరుగుతుండడం చూసి ఆమెకు కూడా కూడా గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజసేవ చేయాలన్న సంకల్పం కలిగింది. దాంతో బీడీ కార్మికులు, కుట్టు పనులు చేసే మహిళలు తదితరుల కోసం పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయగలగడంతో ఆమెలో ఆత్మవిశ్వాసం ఏర్పడింది.
భర్త ప్రేరణ, ప్రోత్సాహం
సమాజసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సమయంలోనే కాంచనకు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ‘‘1997లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేముండే మార్కండేయనగర్ వార్డు మహిళ కోటాలోకి రావడంతో ఈ వార్డు నుంచి టికెట్ కోసం నా భర్త తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఏ పార్టీకోసం పాటు పడుతున్నారో, ఆ పార్టీనే తనను పక్కన పెట్టేసరికి ఇద్దరం పార్టీ మారాం. ఇలా సుమారు గత 22 సంవత్సరాలుగా మేము బీజేపీలో కొనసాగుతున్నాం. 2002లో బీజేపీ నాకు మార్కండేయనగర్ వార్డు (షోలాపూర్ కార్పొరేషన్) నుంచి టికెట్ ఇచ్చింది. అలా నేను నేను మొట్టమొదటిసారిగా కార్పొరేటర్‌గా విజయం సాధించి కార్పొరేషన్‌లో అడుగుపెట్టాను. అప్పటినుంచి ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించాను’’ అని కాంచన తెలిపారు.
ఊహించని విజయం
అయితే మేయర్ పీఠం దక్కుతుందని మాత్రం తను ఊహించలేదని కాంచన అన్నారు. ‘‘బీజేపీ నన్ను అభ్యర్థిగా ప్రకటించింది. నాకు పోటీగా శివసేనకు చెందిన సారిక పిసే, కాంగ్రెస్‌కు చెందిన ఫిర్దోస్ పటేల్, ఎంఐఎంకు చెందిన శహజిదా బానో శేఖ్ బరిలోకి దిగారు. అయితే ఎన్నికకు ముందు సారిక పిసే, ఫిర్దోస్ పటేల్‌లు తప్పుకోవడంతో బానో శేఖ్‌తో నాకు పోటీ ఏర్పడింది. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఐఎంలు జత కట్టాయి. కాని ఎన్నికకు ఒక రోజు ముందే వీడిపోయారు. దాంతో ఈ ఎన్నికలో నాకు 51 ఓట్లు పోలవ్వగా బానో శేఖ్‌కు కేవలం ఎనిమిది ఓట్లు పోలయ్యాయి. ఇలా ఊహించని విధంగా భారీ మెజార్టీతో విజయం సాధించగలిగాను’’ అని ఆమె చెప్పారు.
ఆదర్శ కార్పొరేటర్
కుటుంబ సభ్యులతో (భర్త, కుమారుడు, అల్లుడు, కుమార్తె, మనుమడు) యెన్నం కాంచన
కాంచన యెన్నం అనేక పదవులను అలంకరించారు. సుమారు 17 ఏళ్లనుంచి కార్పొరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పార్టీ పరంగా ప్రస్తుతం షోలాపూర్ బీజేపీ వర్కింగ్ కమిటి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. దీంతోపాటు ఇందిరా మహిళ సహకార బ్యాంకుకు వైస్ చైర్మన్‌గా, షోలాపూర్ మన్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసి) మహిళ సంక్షేమ కమిటీ సభ్యురాలిగా, అదేవిధంగా ఎస్‌ఎంసిలోని పలు పదవులను అలంకరించారు. 2016–17లో స్టాండింగ్ కమిటి చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆదర్శ కార్పొరేటర్ అవార్డు అందుకున్నారు. రాజకీయాల్లోనే కాదు ఏ పనిలోనైనా జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజమని కాని వాటిని తట్టుకుంటేనే విజయం లభిస్తుందని కాంచన యెన్నం అంటారు.
– గుండారపు శ్రీనివాస్, మావునూరి శ్రీనివాస్ సాక్షి, ముంబై
Comments
Please login to add a commentAdd a comment