పోటీలో తెలుగు బ్యూటీ మనకు... మిస్ యూనివర్స్ పోటీలు... బాగా తెలుసు. మిస్ వరల్డ్ కూడా... పరిచయమే. అలాగే... మిస్ ఎర్త్ గురించి తెలుసు. మరి... మిసెస్ యూనివర్స్? మిసెస్ వరల్డ్?? మిసెస్ ఇంటర్నేషనల్??? పెద్దగా తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం. మిసెస్ ఇంటర్నేషనల్‌కు అర్హత సాధించిన తెలుగు మహిళ రాధికామూర్తిని పరిచయం చేసుకుందాం.
మిసెస్ ఇంటర్నేషనల్ పోటీల్లో దేహం కొలతల చట్రంలో ఇమడాల్సిన అవసరం లేదు. ఆత్మసౌందర్యం, అంతఃసౌందర్యమే ప్రధానం. అంతఃసౌందర్యం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఉలి. ఆ ఉలి చెక్కిన శిల్పమే ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం... భావవ్యక్తీకరణలో బహిర్గతమవుతుంది. భావవ్యక్తీకరణకు సాధనం మాట. మాటలో వెలుగు చూసే భావమే అంతఃసౌందర్యానికి కొలమానం. బాధ్యతాయుతమైన వ్యక్తి అని, ఒక సామాజిక బాధ్యత అప్పగిస్తే కర్తవ్యానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తారనే విశ్వాసం కలిగించడానికి ఒక వేదిక ఈ మిసెస్ ఇంటర్నేషనల్ పీజంట్.
అమెరికాలో జరిగే ఈ మిసెస్ ఇంటర్నేషనల్ పోటీలకు ఈ ఏడాది కూడా అనేక దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. జూలై 18 నుంచి 23 వరకు జరిగే ఈ పోటీల్లో పొల్గొంటున్న వారిలో ఓ తెలుగు మహిళ ఉంది. ఆమె రాధికామూర్తి. మరో విశేషం ఏమిటంటే... ఆమె పాల్గొంటున్నది యూకే నుంచి. అవును, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పన్నెండేళ్ల నాడు లండన్‌లో అడుగుపెట్టిన రాధిక అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. భర్త, ఇద్దరు పిల్లల బాధ్యత చూసుకుంటూ కెరీర్‌ను బాలెన్స్ చేసుకుంటూ గడిచిపోయిన కాలాన్ని, విద్యార్థి దశలో మొగ్గలు విచ్చుకున్న అభిరుచులను, సామాజిక కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన శూన్యత తనను అంతరయానం చేయించిందన్నారు రాధికామూర్తి.
రొటీన్ చట్రం బయట ప్రపంచం ఉంది
‘‘నేను పుట్టింది పెరిగింది, చదువుకున్నది అంతా నెల్లూరులోనే. ఉద్యోగం కోసం బెంగళూరులో ఐదేళ్లు ఉన్నాను. యూకేలో ఉద్యోగం రావడంతో 2010లో లండన్‌కి వచ్చాను. ఆరేళ్ల తర్వాత సిటిజన్‌షిప్ కూడా వచ్చింది. పెళ్లి, ఇద్దరు అబ్బాయిలు, ఉద్యోగం... ఈ చట్రంలో గడిచిపోతూ ఉన్న సమయంలో కరోనా వచ్చింది. జ్ఞాపకాల్లోకి వెళ్లడానికి కొంత విరామం దొరికింది మనసుకి. స్కూల్లో, కాలేజ్‌లో నేను ఫ్యాషన్ షోలు, డాన్స్, పాటల పోటీలు, చిన్న చిన్న నాటికలు... ఇలా స్టేజ్ షోలలో చురుగ్గా పాల్గొనేదాన్ని. యూకేలో నివసిస్తున్న భారతీయులు పరస్పరం కలవడం కోసం మిసెస్ ఇండియా యూకే వంటి అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. నా సెకండ్ ఇన్నింగ్స్ అలా మొదలైంది’’ అన్నారామె.
కరోనా వదల్లేదు
కరోనా తగ్గినట్లే తగ్గి తిరిగి విజృంభించడంతో ఆ పోటీలు ఎప్పటిలాగ ఆఫ్‌లైన్‌లో జరగలేదు. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. అలా ఎంపికైన నేను ఈ ఏడాది యూఎస్‌లో జరిగే మిసెస్ ఇంటర్నేషనల్‌కు యూకే ప్రతినిధిగా పాల్గొంటున్నాను. ఈ పోటీల్లో ఉండే సంతృప్తి ఏమిటంటే... విజేతలు ఏ రంగంలో సేవలందించాలనేది ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు. నేను మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ కోసం పని చేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు రాధికామూర్తి.
కెరీర్, కుటుంబం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ కాలంతో పోటీ పడి పరుగులు తీస్తున్న సమయంలో కూడా రాధికామూర్తి ఫిట్‌నెస్‌ను నిర్లక్ష్యం చేయలేదెప్పుడూ. రోజూ వర్కవుట్‌కి, యోగసాధనకు తప్పనిసరిగా కొంత టైమ్ కేటాయిస్తారు. ఆమె ఒక హెర్బల్ ఉత్పత్తికి ప్రమోటర్ కూడా. కొత్త ప్రదేశాలను చూడడం, అక్కడి జీవనశైలి, ఆహారపు అలవాట్లను తెలుసుకోవడం ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు.
కుటుంబ బంధం సమాజం పట్ల బాధ్యత
మిసెస్ పోటీల్లో పాల్గొనే వాళ్ల నేపథ్యాన్ని నిశితంగా పరిశీలిస్తారు. కుటుంబాన్ని, కుటుంబంతో ఉన్న బంధాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన ట్రాక్ రికార్డ్‌ను కూడా. స్థూలంగా చెప్పాలంటే సమాజంలో ఒక వ్యక్తిగా, కుటంబంలో కీలకమైన వ్యక్తిగా ఎంత బాధ్యతగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నారనేది ముఖ్యం. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఇతరుల పోస్టులకు ప్రతిస్పందించే తీరు కూడా ముఖ్యమైన అంశమే. సమాజాన్ని సానుకూల ధోరణిలో ప్రభావితం చేయగలరా లేదా అనే నిర్ధారణకు రావడానికి ఆ పోస్టులు కూడా కొలమానం అవుతాయి. నేను నా వంతు సామాజిక బాధ్యతగా చేసిన కొన్ని పనుల గురించి ఆ ఇంటర్వ్యూలో ప్రభావవంతంగా తెలియచేయగలిగాను. మిసెస్ ఇండియా యూకే టీమ్ గత ఏడాది నుంచి నాకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఈ పోటీలకు మనదేశం నుంచి వచ్చే ప్రతినిధిని కలిసి పరిచయం చేసుకుంటాను.
– జె. రాధికా మూర్తి, ‘మిసెస్ ఇంటర్నేషనల్’ (యూకే) పార్టిసిపెంట్
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment