వాషింగ్టన్: తెలుగు మహిళ కాట్రగడ్డ అరుణ మిల్లర్ (58) అమెరికాలో చరిత్ర సృష్టించారు. దేశంలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డుకెక్కారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అరుణ రికార్డు మెజార్టీతో గెలిచారు. రిపబ్లికన్ పార్టీ అనుకూల వర్గాలూ ఆమెకే మద్దతివ్వడంతో గెలుపు సులభమైంది. అమెరికాలో రాష్ట్రస్థాయిలో గవర్నర్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ పదవి అత్యంత కీలకం.
రవాణా ఇంజనీర్‌గా సేవలు
కాట్రగడ్డ అరుణ మిల్లర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం. ఆమె 1964 నవంబర్ 6న జన్మించారు. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి 1972లో అమెరికా చేరుకున్నారు. తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు ఐబీఎం సంస్థలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లో ప్రాథమిక విద్య అనంతరం అరుణ ‘మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు.
1990లో మేరీల్యాండ్‌లోని మాంట్‌గొమెరీ కౌంటీకి మారారు. అక్కడే తన కళాశాల మిత్రుడు డేవిడ్ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు మీనా, క్లోయి, సాషా ఉన్నారు. అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2000లో అమెరికా పౌరసత్వం లభించింది. 2010 నుంచి 2018 దాకా మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో డిస్ట్రిక్ట్ 15కి ప్రాతినిధ్యం వహించారు. 2018లో అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు పోటీపడి ఓడారు. ‘‘మేరీల్యాండ్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి నావంతు కృషి చేస్తా. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ నన్ను గెలిపించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో చిన్న రాష్ట్రం కూడా అద్భుతం సృష్టిస్తుందని ఈ ఎన్నికతో ప్రజలు నిరూపించారు’’ అని అరుణ మిల్లర్ చెప్పారు.
రిపబ్లికన్ల ఆధిక్యం
మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్లు స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో కడపలి వార్తలు అందే సమయానికి 202 స్థానాలు గెలుచుకున్నారు. అధికార డెమొక్రటిక్ పార్టీకి 184 స్థానాలు దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ 218 సీట్లు. సెనేట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు జరగ్గా రిపబ్లికన్లు 19 , డెమొక్రాట్లు 12 సీట్లు నెగ్గారు. కడపటి వార్తలందేసరికి ఈ రెండు పార్టీలకూ సెనేట్లో చెరో 48 సీట్లున్నాయి. 36 గవర్నర్ పదవుల్లో రిపబ్లికన్లకు 16, డెమొక్రాట్లకు 15 దక్కాయి. ఐదింటి ఫలితాలు రావాల్సి ఉంది.
ఐదుగురు భారత అమెరికన్ల విజయం
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఐదుగురు భారత–అమెరికన్లు ఎన్నికయ్యారు. వీరంతా అధికార డెమొక్రాటిక్ పార్టీ తరఫున నెగ్గడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెషనల్ జిల్లాల నుంచి రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీ బేరా, ప్రమీలా జయపాల్, థానేదార్ ప్రతినిధుల సభలో అడుగు పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment