ఈ వినాయక చవితి చాలా ప్రత్యేకం | Baby Movie Actress Vaishnavi Chaitanya Talks About Vinayaka Chavithi | Sakshi
Sakshi News home page

ఈ వినాయక చవితి చాలా ప్రత్యేకం

Sep 18 2023 4:45 AM | Updated on Sep 18 2023 4:45 AM

Baby Movie Actress Vaishnavi Chaitanya Talks About Vinayaka Chavithi - Sakshi

‘‘నాకు చాలా చాలా ఇష్టమైన పండగ వినాయక చవితి. వినాయక విగ్రహాన్ని ఇంటివద్దకు తీసుకొచ్చేటప్పుడు, నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు బ్యాండ్‌కి తగ్గట్టు ఫుల్‌గా డ్యాన్స్‌ చేసి అలిసిపోయేదాన్ని. ‘బేబీ’ చిత్రంలో ఓ పాటలో వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు నాకు చిన్నతనం గుర్తొచ్చింది. ఇప్పటికి కూడా వినాయకుడి వద్ద ఉండే బ్యాండ్‌ సౌండ్‌కి డ్యాన్స్‌ చేయకుండా ఆగలేను’’ అని హీరోయిన్‌ వైష్ణవీ చైతన్య అన్నారు. ‘బేబీ’ సినిమాతో సూపర్‌హిట్‌ అందుకున్నారు తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య. నేడు వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారామె.. ఆ విశేషాలు...

► ఈ ఏడాది వినాయక చవితిని ఎలా ప్లాన్‌ చేస్తున్నారు?
గతంలో ప్రతిసారి నేను, తమ్ముడు ప్లాన్‌ చేసేవాళ్లం. కానీ, ఈ సారి మా అమ్మ, నాన్న ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతి ఏడాది తొమ్మిది రోజులు వినాయకుణ్ణి ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్లం.. కాలనీ వాళ్లని పిలిచి అన్నదానం చేసేవాళ్లం. ప్రతిరోజూ సాయంత్రం భజనలు చేసేవాళ్లం. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఫుల్‌ హంగామా చేస్తూ ట్యాంక్‌బండ్‌కి తీసుకెళ్లి నిమజ్జనం చేసేవాళ్లం. ఈ సారి అలాగే చేయాలనుకుంటున్నాం.
► గత ఏడాదికీ, ఈ ఏడాదికీ మీ స్థాయిలో మార్పు వచ్చింది. గతంలో వైష్ణవీ చైతన్య అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ‘బేబీ’ హీరోయిన్‌ అని తెలుసు.. దాన్ని ఎలా చూస్తారు?
ప్రతి ఏడాది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఇంకా ఎక్కువ ప్రత్యేకం. ఎందుకంటే ‘బేబీ’ సినిమా చేశాం.. చాలా పెద్ద హిట్‌ అయింది. ఎంతో మంది నుంచి యూనిట్‌కి అభినందనలు వచ్చాయి. దాంతో మేము చాలా మోటివేషన్‌ (ప్రేరణ) జోన్‌లో ఉన్నాం. ఇంకా అదే సంతోషంలోనే ఉన్నాం.. కాబట్టి ఈ ఏడాది ఇంకా ప్రత్యేకం అని చెప్పాలి.
► వినాయక చవితి అంటే అమ్మాయిలు ప్రత్యేకించి లెహంగా వంటి బట్టలు కుట్టించుకోవడం చేస్తుంటారు. ఈసారి కూడా అలాంటివి ఏమైనా కుట్టించుకున్నారా?
నా చిన్నప్పటి నుంచి నా బట్టలన్నీ మా అమ్మే కుట్టేది.. ఈసారి కూడా అమ్మే కుడుతుంది. తొమ్మిది రోజులు వినాయకుడికి ఇంట్లో పూజలు చేస్తాం కాబట్టి తొమ్మిది జతల బట్టలు కుడుతుంది. నవరాత్రులకు కూడా అలాగే చేస్తాం. నా కోసం తొమ్మిది హాఫ్‌ శారీస్‌ రెడీ చేసి పెడుతుంది మా అమ్మ.
► హాఫ్‌ శారీస్‌ కట్టుకోవడం మీకు ఇష్టమేనా?
చాలా ఇష్టం. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నా సంప్రదాయంగా హాఫ్‌ శారీస్, చీరలు కట్టుకుంటాను. అవి అంటే నాకు అంత పిచ్చి. నేను జీన్స్‌ వేసుకోవడం చాలా తక్కువ. ఎప్పుడైనా వేసుకున్నా బొట్టు మాత్రం కచ్చితంగా పెట్టుకుంటా. మన సంప్రదాయం, బొట్టు అనేవి నాకు మంచి ప్రేరణ, నమ్మకాన్ని ఇస్తాయి.
► చవితికి పిండి వంటలు చేయడం మీకు వచ్చా?
నేను చేస్తాను.. నాకు బాగా వస్తాయి. పిండి వంటలు, ఉండ్రాళ్లు, పులిహోర నేను చేస్తాను. స్వీట్స్‌ మాత్రం అమ్మ చేస్తుంది. స్వీట్స్‌ అంటే నాకు ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి నేను చేయను. వంటలన్నీ బాగా వండుతాను.
► మీ అమ్మ మన సంప్రదాయాల గురించి చెబుతూ మిమ్మల్ని పెంచారా?
మన ఇంట్లో వాళ్లు ఎలా ఉంటే మనం కూడా అలా ఉంటాం కదా! మా అమ్మ ఎప్పుడూ పూజలు, వంటలు చేస్తూ పాజిటివ్‌ వైబ్స్‌తో ఉండేది. ఆమెను చూస్తూ నేను కూడా నేర్చుకున్నా. నన్ను అయితే నేర్చుకో అంటూ ఎప్పుడూ ఒత్తిడి చేయదు.  
► ఇప్పుడు హీరోయిన్‌గా బిజీగా ఉన్నారు కాబట్టి వంట గదిలోకి వెళ్లే సమయం ఉండదేమో?  
అవును. ‘బేబీ’ తర్వాత ఆశిష్‌కి జోడీగా ఓ సినిమా, సిద్ధు జొన్నలగడ్డకి జతగా ఓ చిత్రం చేస్తున్నా.
► ఖైరతాబాద్‌ వినాయకుడు అంటే బాగా ఫేమస్‌.. అక్కడికి వెళుతుంటారా?
ప్రతి ఏడాది వెళు తుంటాం. గత ఏడాది కూడా వెళ్లాను. ఈ ఏడాది కూడా వెళ్లాల్సిందే. ‘బేబీ’ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా గుర్తు పడుతున్నారు. నన్నే కాదు.. మా కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టి మాట్లాడటం సంతోషంగా ఉంది.
► చిన్నప్పుటి నుంచి హీరోయిన్‌ కావాలనే లక్ష్యం ఉండేదా? లేకుంటే వేరే ఏదైనా..?
నాకు పదిహేనేళ్ల నుంచి సినిమా అంటే ఇష్టం ప్రారంభమైంది. సినిమా అంటే ఏంటో తెలియని వయసులో ప్రారంభమైన ఇష్టం ఇప్పుడు సినిమానే నా జీవితం అయింది.
► మీకు సినిమా నేపథ్యం లేదు. చిత్ర పరిశ్రమలో ఎలా రాణించగలుగుతామనిపించిందా? పైగా తెలుగమ్మాయి అంటే అవకాశాలు తక్కువగా ఉంటాయి కదా...
తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరనే మాట ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ, నేనయితే సినిమాలపై ఇష్టం, ప్రేమతో ప్రయత్నాలు చేయడం ప్రారంభించా.. ఆడిషన్స్‌కి వెళ్లేదాన్ని. నమ్మకం కోల్పోకుండా అలా ప్రయత్నించగా అవకాశాలు వచ్చాయి. దేనికైనా సమయం పడుతుంది. అది నటనే కాదు.. వేరే ఏ కెరీర్‌ అయినా కూడా. మనం కోరుకున్నది వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి.
► నటన ఒక్కటేనా? లేకుంటే డైరెక్షన్, ఇతర ఆలోచనలేమైనా ఉన్నాయా?
నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. కూచిపూడి, వెస్ట్రన్‌ డ్యాన్స్‌ నేర్చుకున్నాను.
► మీ జీవితంలో మరచిపోలేని వినాయక చవితి ఏది?
స్కూల్‌లో చదువుతున్న సమయంలో అందరూ నిద్రపోయాక కాలనీలోని వినాయక మండపం వద్ద ఉన్న లడ్డును దొంగతనం చేయాలనుకునేవాళ్లం. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మండపం వద్దకు వెళ్లి లడ్డు దొంగతనం చేసి అందరికీ పంచేవాళ్లం (నవ్వుతూ).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement