Vinayaka Chavithi Festival
-
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : వైఎస్ జగన్
-
#VinayakaChavithi2024 : వినాయక చవితికి నేను సిద్దం..మరి మీరు (ఫొటోలు)
-
వినాయక చవితి స్పెషల్: కేసి మిథోయ్
కేసి మిథోయ్ కావలసినవి: తాజా బియ్యప్పిండి – రెండు కప్పులు; పచ్చికొబ్బరి తురుము – కప్పు; పంచదార పొడి – అరకప్పు; యాలకుల పొడి అరటీస్పూను; కొబ్బరి నీళ్లు – అరకప్పు. తయారీ: ►తడి బియ్యప్పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి ∙దీనిలో కొబ్బరి తురుము, పంచదార పొడి, యాలకుల ΄పొడి వేసి కలపాలి. ► అవసరాన్ని బట్టి కొబ్బరి నీళ్లను కొద్దికొద్దిగా వేసి పిండిని ముద్దలా కలుపుకోవాలి. ► పిండి ముద్దను చిన్న భాగాలుగా చేసి, ఉండలుగా చుట్టుకోవాలి ∙పిండిమొత్తాన్ని ఉండలుగా చుట్టుకుంటే కేసి మిథాయ్ రెడీ. ► కొబ్బరి నీళ్లకు బదులు కొద్దిగా నెయ్యికూడా కలుపుకోవచ్చు ∙రిఫ్రిజిరేటర్లో రెండుమూడురోజుల వరకు ఇవి తాజాగా ఉంటాయి. -
ఇలాంటి ఆలయం దేశంలో మరెక్కడా లేదు.. దీని విశిష్టత ఇదే
ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూణెలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కతంలో ఉంటే మూడోది పెర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయంప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం కింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలనులాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందిట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా. ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పకర్లెద్దు. తొమ్మిది రోజులు పూణె చుట్టుపక్కల ఉన్న ఊరుల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్ నడిపిస్తోంది. -
వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు!
వినాయకచవితి పండుగ వచ్చిందంటే చాలు. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు డ్యాన్సులతో హోరెత్తిస్తారు. పెద్ద పెద్ద డీజేలు, గణనాధుని పాటలతో ఏ గల్లీలో చూసినా సందడే సందడి.. ధూమ్ ధామ్. మరీ ఇంత సంతోషంగా పిల్లలు, పెద్దలు జరుపుకునే పండుగలో గణనాథునిపై మనం రాసుకున్న పాటలకైతే కొదువ లేదాయే. మరీ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంతోషంగా గణనాధున్ని గంగమ్మ ఒడికి చేర్చే వరకు మనకోసం.. మరీ ముఖ్యంగా బొజ్జ గణపయ్య కోసం సినిమాల్లో వచ్చిన పాటలను ఓ సారి గుర్తు చేసుకుందాం. వినాయకచవితి సందర్భంగా లంబోదరుడి సూపర్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం పదండి. సినిమాల్లో మన గణపయ్య సూపర్ హిట్ సాంగ్స్ మెగాస్టార్ 'జై చిరంజీవ'- 'జై జై గణేశా.. జై కొడతా గణేశా' 'జై జై గణేశా.. జై కొడతా గణేశా' అనే సాంగ్ వినాయకచవితి వచ్చిందంటే కచ్చితంగా ఉండాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక ప్రధాప పాత్రల్లో విజయ భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెంకటేశ్ కూలీనెం 1- 'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా' 'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా. నీ అండదండా ఉండాలయ్యా.. దేవా' అంటూ సాగే వినాయకుని పాట ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్. వెంకటేశ్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2002లో రిలీజైంది. 100% లవ్ -'తిరుతిరు గణనాథ..' నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన చిత్రం 100% లవ్. ఈ చిత్రంలో తమన్నా పాడే 'తిరుతిరు గణనాథ..' అంటూ పాడే సాంగ్ హైలెట్. వినాయకచవితి పండుగ రోజు ఈ పాట కచ్చితంగా ఉండాల్సిందే. అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో'- గణపతి బప్పా మోరియా అల్లు అర్జున్, అమలా పాల్ జంటగా నటించిన చిత్రం ఇద్దరమ్మాయిలతో. ఈ చిత్రంలో 'గణపతి బప్ప మోరియా' సాంగ్ వినని వారుండరు. ఐకాన్ స్టార్ ఈ పాటకు తన స్టెప్పులతో అదరగొట్టాడు. వెస్ట్రర్న్ స్టెల్లో బన్నీ దుమ్ములేపారు. దేవుళ్లు- 'వక్రతుండా మహాకాయ' సాంగ్ ఎస్పీ బాలసుబ్రమణ్య ఆలపించిన ఈ సాంగ్ దేవుళ్లు సినిమాలోది. ఇద్దరు చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం దేవుడిని మొక్కులు చెల్లించేందుకు బయలుదేరుతారు. ఈ సినిమాలో 2001లో రిలీజ్ కాగా.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు. బాలయ్య భగవంత్ కేసరి- గణేశ్ ఆంతం సాంగ్ బాలకృష్ణ, శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో గణేశ్ ఆంతం లిరికల్ సాంగ్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. వినాయకచవితికి గణపతి మండపాలు ఈ పాటతో హోరెత్తనున్నాయి. -
రంగులు మార్చుకునే వినాయకుడు..మీరెప్పుడు చూసుండరు!
సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువుతీరాడు పార్వతీ తనయుడు. రాజ్య రక్షకుడు: రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్ రాజు హమీర్‌కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్‌కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు. ఒక రోజు రాత్రి అతను నిద్రపోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరిపోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసిపోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు. ఇదీ విశిష్టత: ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన సిద్ధి, బుద్ధి తోపాటు కుమారులైన శుభ్, లాభ్ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ప్రార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఎక్కడ? రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్‌లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుంచి సవాయ్ మాధోపూర్ జంక్షన్‌కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 17 కి.మీ. దూరంలో ఉన్న రణథంబోర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రణథంబోర్‌కు సమీప విమానాశ్రయం సుమారు 150 కి.మీ. దూరంలోని జైపూర్‌లో ఉంది. రంగులు మార్చే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయమే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా... ప్రాశస్త్యం మాత్రం చాలా పెద్దది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. మార్చి నుంచి జూన్ వరకూ నల్లని రంగులో ఉండే ఈ వినాయకుడు జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. అంతే కాదు, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.. నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడి వినాయకుడు తన రంగును మార్చుకు న్నట్లే.. ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు. ఇక చారిత్రక విషయాల కొస్తే... ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది ‘శివాలయం’. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్’ ఆలయం అని అంటారు. ఈ ఆలయానికో చరిత్ర కూడా ఉంది. ఆ రోజులలో ‘కేరళపురం’ రాజుగారు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం’ వెళ్లాడట. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..‘దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం’ అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ, మరొక ‘మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతనమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. దొడ్డ గణపతి ఆలయం, బెంగళూరు బెంగళూరులోని బసవన గుడి బుల్ ఆలయం పక్కనే ఉంది ఈ ఆలయం. దేవాలయంలోని గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి అని, శక్తి గణపతి అని పిలుస్తుంటారు.విశేషం ఏమిటంటే ... ఆలయం కుడివైపు క్రమంగా పెరగటం. భక్తులు ఇది దేవుని మహిమగా చెబుతారు. బెంగళూరు నుంచే కాక రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించి, తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు. స్వామి వారి అలంకరణ: వారంలో అన్ని రోజులలో స్వామి వారికి పూజలు చేసి రకరకాల అలంకరణ చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఈ అలంకరణ లో అతి ముఖ్యమైనది వెన్నతో స్వామిని అలంకరించటం. దీన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు అని భక్తులు చెప్పుకొంటారు. ఇది చూస్తే జన్మ ధన్యం అయినట్లు భావిస్తారు ఈ భారీ గణేషుని శరీరానికి వెన్న పట్టించటానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరం అవుతుంది. ఆలయ వెనక శ్రీ శివ శక్తి బేడర కన్నప్ప, శ్రీ కానేశ్వర, శివాలయాలు ఉన్నాయి. ఆలయ సందర్శన సమయం దొడ్డ గణేశ దేవాలయంలో స్వామి దర్శనం ఉదయం ఏడు నుంచి పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం అయిదున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది. వినాయక చవితి నుంచి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. బెంగళూరు లో వాయు, రోడ్డు, విమాన సౌకర్యాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉంది. అలాగే రెండు రైల్వే స్టేషన్ లు – బెంగళూరు సిటీ, యశ్వంతపుర ఉన్నాయి ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు, విమానాలు వస్తుంటాయి. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బెంగళూరు కు బస్సు సౌకర్యం ఉంది. తెలుగు రాష్ట్రాలలో సిద్ధివినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం దీనికి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. ఉమాసుతుడు ఇక్కడ సిద్ధి వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతల ఆలయాలూ ఉన్నాయి. స్థల పురాణం కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం చెబుతోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామం లో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకుని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. క్షేత్ర ప్రత్యేకత అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు. దక్షిణాభిముఖంగా దర్శనం..సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. అలాగే దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం. వివిధ ఉత్సవాలు.. ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు. విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష కలములను సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి... లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం. వివిధ ఆలయాలు... అయినవిల్లి క్షేత్రంలో గణపతి ఆలయంతో పాటు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరాలయం, శ్రీదేవీ, భూదేవీ సమేత కేశవస్వామి ఆలయం, కాలభైరవ ఆలయాలు ఉన్నాయి. ఇలా చేరుకోవాలి... రాజమహేంద్రవరం నుంచి అయినవిల్లికి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం నుంచి బస్సు, ఆటోలో దేవాలయాన్ని చేరుకోవచ్చు. కాకినాడ నుంచి యానాం, అమలాపురం, ముక్తేశ్వరం మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు. ఇతర సమాచారం.. దేవాలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 8గంటల వరకు తెరిచి ఉంటుంది. అభిషేకం ఉదయం 7 గం.ల నుంచి 11 గం. వరకు జరుగుతుంది. (సాధారణ రోజుల్లో) – డి.వి.రామ్ భాస్కర్ -
ఈ వినాయకుడ్ని పూజిస్తే వివాహ అడ్డంకులు తొలిగిపోతాయట!
విశిష్ట గణపతికి ... వైవిధ్య రూపాలతో పూజలు పురాణేతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పార్వతీ దేవికి సోదరుని వరస. వినాయకుడు పార్వతీ తనయుడు. శ్రీ కృష్ణుడు మహావిష్ణువు అవతారం. ఈ వరస మేరకు కృష్ణుడు వినాయకుని మేనమామ.అలాటి మేనమామ తన మేనల్లుడి ఒడిలో కూర్చున్న అపూర్వ దర్శనం మీకెప్పుడైనా జరిగిందా ? అలాటి పుణ్యక్షేత్రం ఎక్కడుందో తెలియాలంటే మనం కేరళలోని మళ్ళియూర్ వూరికి వెళ్ళాలి. అక్కడి ఆలయంలో వినాయకుని ఒడిలో బాలకృష్ణుడు ఆసీనుడై భాగవతం వింటున్న అపూర్వ దృశ్యాన్ని మనం చూడగలం.ఇటువంటి దృశ్యం మరెక్కడా దర్శించలేము.వేలసంవత్సరాల ప్రాచీనమైన ఈ ఆలయంలో బీజ గణపతి రూపంలో వినాయకుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయం ప్రసిద్ధి చెందడానికి భాగవత అంశగా ప్రసిద్ధి చెందిన శంకరన్ నంబూద్రియే ముఖ్య కారణంగా చెపుతారు. శంకరన్ నంబూద్రి గణపతి విగ్రహం పక్కనే సాలగ్రామాన్ని పెట్టుకుని పూజిస్తూండేవారు. నిత్యం భాగవత పారాయణం చేసేవారు. ఒకనాడు ఆయనకు తన పూజలో వినాయకుని విగ్రహంలో బాలకృష్ణుని రూపం స్పష్టంగా గోచరించింది. ఆయన తాను చూసిన దృశ్యాన్ని యదాతధంగా చెక్కిన రూపమే ఈనాడు ఆ ఆలయంలో దర్శనమిచ్చే విగ్రహం. తొండం చివర నిమ్మపండు, హస్తాలలో కొడవలి, అంకుశం, తనకు ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు చేత ధరించి తనకు మామ అయిన బాలకృష్ణుని తన ఒడిలో వుంచుకొని దర్శనానుగ్రహాన్ని కలిగిస్తున్నాడు. గర్భగుడిలో ఇతర దైవ విగ్రహాలు ఏవీ వుండవు. భక్తుల కోరికలను తక్షణమే నెరవేర్చే వరప్రసాది మళ్ళియూరు మహాగణపతి. ఇక్కడ ఇష్టసిద్ధికై చేసే పూజలను ముక్కుట్రి పుష్పాంజలి అంటారు. సకల ఐశ్వర్యాలు కలగడానికి ఉదయాస్తమ పూజ జరుగుతున్నది. కష్టాలు తీరడానికి సహస్ర కలశాభిషేకం జరిపించుకుంటారు.వివాహ అడ్డంకులు లేకుండా వుండడానికీ పళ్ళమాలలు సమర్పిస్తారు. 27 కదళీ ఫలాలతో కట్టే యీ మాలను నక్షత్ర మాల అంటారు. అనారోగ్యాల నివారణకై దడి నివేదన చేస్తారు. బియ్యప్పిండి, చక్కెర, కొబ్బరి కలిపి మోదకంగా తయారు చేసి ఆవిరిలో ఉడికించి నివేదిస్తారు. దీనికే దడి నైవేద్యమని పేరు. ఈ ఆలయంలో పితృదోష పరిహారాలు జరుపుతారు. చవితినాడు చతుర్ధియూటు అనే పితృదోష పరిహార పూజలు జరుపుతారు. సంతాన భాగ్యం కోసం పాలు పాయసం నివేదించి పూజిస్తారు. తులాభార మొక్కు లు కూడా తీర్చుకుంటారు. ఈ ఆలయంలో తొమ్మిది రోజుల ఉత్సవం ఫాల్గుణ మాసంలో ఆరంభమై చైత్రమాసంలో వచ్చే విషూ పండుగతో సంపూర్ణమౌతాయి. వినాయకచవితి పండగను ఘనంగా జరుపుతారు.కేరళలోని కొట్టాయం .. ఎర్నాకుళం మార్గంలో కురుప్పన్దర అనే చోట దిగితే 2 కి.మీ దూరంలోను, కురుప్పన్దర రైల్వేస్టేషన్ నుండి 1/2 కి.మీ దూరంలో మళ్లియూరు మహాగణపతి ఆలయం వున్నది. -
ముక్కోటి దేవుళ్ళలో వినాయకుడికే మొదటి పూజ ఎందుకు? గణాధిపత్యం ఎలా దక్కింది?
కుమారస్వామి అప్పటికే దేవసేనాధిపతిగా ఉన్నాడు. అందువల్ల వినాయకుడికి ప్రమథ గణాధిపత్యం ఇవ్వాలనుకున్నాడు శివుడు.‘నువ్వు నా ప్రమథగణాలకు నాయకుడిగా ఉండు’ అని వినాయకుడితో అన్నాడు శివుడు.‘తండ్రీ! నాయకుడిగా ఉండమంటే సరా? అర్హత నిరూపించుకోనిదే నాయకత్వం స్వీకరించడం ఏమంత సమంజసం? తమ్ముడు ఇప్పటికే దేవసేనాధిపతిగా సేనానాయకత్వంలో ఆరితేరి ఉన్నాడు. అతడికే గణాధిపత్యం కట్టబెడితే బాగుంటుంది’ అన్నాడు వినాయకుడు.‘ఇప్పటికే నీ తమ్ముడు దేవసేనాధిపతిగా ఉన్నాడు గనుకనే నిన్ను ప్రమథగణాలకు నాయకత్వం వహించమంటున్నాను. ఒక్కడే రెండు బాధ్యతలు నిర్వహించడం అతడికి భారంగా మారవచ్చు’ అన్నాడు శివుడు.‘తండ్రీ! అయితే, ఏదైనా పరీక్షపెట్టి, నెగ్గినవారికి నాయకత్వం అప్పగించడం న్యాయంగా ఉంటుంది’ అన్నాడు వినాయకుడు. దేవతలు, ప్రమథులు కలసి వినాయకుడికి, కుమారస్వామికి ఒక పందెం పెట్టారు. ముల్లోకాల్లోని తీర్థ క్షేత్రాలను సేవించి ముందుగా ఎవరు కైలాసానికి చేరుకుంటారో వారికే గణాధిపత్యం అప్పగించాలని తీర్మానించారు.కుమారస్వామి తన మయూరవాహనంపై రివ్వుమని ఎగురుతూ బయలుదేరాడు.వినాయకుడు ఎక్కడికీ కదలకుండా, ఉన్నచోటనే చతికిలబడి కూర్చుండిపోయాడు.అప్పుడు విష్ణువు అతణ్ణి ఏకాంతంలోకి తీసుకుపోయి, ‘నాయనా! మేమంతా నిన్ను అభిమానిస్తున్న వాళ్లం. నీ ఓటమి మా ఓటమి అవుతుంది. నువ్వెక్కడికీ తిరగనక్కర్లేదు. నేను చెప్పినట్లు చేస్తే చాలు’ అని చెప్పాడు.విష్ణువు సలహాతో వినాయకుడు ఉన్నచోటనే మఠం వేసుకు కూర్చుని, శివపంచాక్షరి మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు.కుమారస్వామి వెళ్లిన ప్రతి తీర్థంలోనూ, క్షేత్రంలోనూ వినాయకుడు అతడికి తిరుగుముఖం పడుతూ ఎదురవుతూ వచ్చాడు. ఆశ్చర్యపోతూనే ముల్లోకాల్లోని తీర్థ క్షేత్రాలను కుమారస్వామి సేవించుకున్నాడు. కైలాసానికి తిరిగివస్తూనే, ‘తండ్రీ! ఈ పందెంలో నేను ఓడిపోయాను. అన్నదే గెలుపు. నీవనుకున్నట్లు అతడికే గణాధిపత్యాన్ని అప్పగించు’ అన్నాడు. కుమారస్వామి కైలాసంలో కొలువుదీరిన దేవతలు, మునులు, ప్రమథగణాల మధ్యకు వచ్చి, ‘పందెంలో మా అన్న వినాయకుడే గెలిచాడు. అతడికి సత్వరమే గణాధిపత్య పట్టాభిషేకం జరగాలి. శివుని ఆజ్ఞ అందరికీ శిరోధార్యం’ అని చెప్పాడు. కుమారస్వామి ప్రకటనతో దేవతలందరూ హర్షం వెలిబుచ్చారు. అయితే, ప్రమథగణ ప్రముఖులలో శృంగీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, నందీశ్వరులు మాత్రం దీనిని వ్యతిరేకించారు.అదివరకు వినాయకుడు పుత్రగణపతి రూపంలో వారికి గర్వభంగం చేశాడు. ఆ అక్కసుతోనే వారు వినాయకుడికి గణాధిపత్యం కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, ‘మొదటి నుంచి మేము శివుడికి నమ్మినబంట్లుగా ఉంటున్నాం. అలాంటిది వినాయకుడు మాకు ఎలా అధిపతి అవుతాడు? అతడికి తనదంటూ ఎలాంటి బలగమూ లేదు. అతడికి గణాధిపత్య అభిషేకమేమిటి?’ అంటూ నానా మాటలూ అన్నారు.ప్రమథుల కలకలం విన్న శివుడు అక్కడకు చేరుకున్నాడు. వారి మాటలు విని కళ్లెర్రజేశాడు. ‘నా నిర్ణయానికే ఎదురాడేటంత గొప్పవారైపోయారా మీరు?’ అంటూ ఆగ్రహోదగ్రుడయ్యాడు.ఇంత జరుగుతున్నా వినాయకుడు శాంతంగా, ‘నిజమే! నాకు గణాలెక్కడివి? లేవు కాబోలు. అన్నట్లు పుత్రగణపతిగా ఉన్నప్పుడు నాకూ కొన్ని గణాలు ఉన్నట్లు గుర్తు. ఆ గణాలు ఎక్కడ?’ అన్నాడు. వినాయకుడి నోట ఆ మాట వెలువడగానే, ముమ్మూర్తులా వినాయకుడిని పోలి ఉన్న గజముఖులు కోటాను కోట్లుగా పుట్టుకొచ్చారు. దిక్కులు పిక్కటిల్లేలా వినాయకుడికి జయజయ ధ్వానాలు పలుకుతూ అతడికి బాసటగా వచ్చి నిలుచున్నారు. వారందరూ చతుర్భుజులే! కొందరి చేతుల్లో ఘంటాలు, లేఖినులు, కుంచెలు ఉన్నాయి. ఇంకొందరి చేతుల్లో త్రిశూల కరవాల గదా ధనుర్బాణాది ఆయుధాలు ఉన్నాయి. మరికొందరి చేతుల్లో వీణా వేణు మృదంగ ఢక్కాది వాద్యపరికరాలు ఉన్నాయి. వారిలో కొందరు అరుణపతాకాలను పట్టుకున్నారు. ఇంకొందరు వినాయకుడికి ఛత్ర చామరాలు పట్టారు. వారు రత్నఖచితమైన భద్రసింహాసనాన్ని తీసుకువచ్చి, వినాయకుణ్ణి దానిపై కూర్చుండబెట్టారు. ఈ సంరంభానికి వినాయకుడి వాహనమైన మూషికం సింహాసనం కింద ఆనందంతో చిందులు వేయడం మొదలుపెట్టింది. దేవతలు, మునులు వేదస్తోత్రాలు పఠిస్తుండగా ప్రమథ గణాధిపతిగా వినాయకుడికి ఘనంగా అభిషేకం జరిగింది. ∙సాంఖ్యాయన -
వినాయకుడి వివాహం ఎలా జరిగిందో తెలుసా?మనకు తెలియని కథ..
వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభిచాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికము వచ్చిందని గణేశ అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు. బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యేక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు. అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది. సిద్ధిబుద్ధులు యౌవనవతులయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరించాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు. అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు నారదా! మా మధ్య కలహం వస్తుదని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధి ఎవరోకాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం.నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధిబుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పాడు. ఇది వినాయకుడి పెళ్ళి కథ ఆంతర్యం. -
ఈ వినాయక చవితి చాలా ప్రత్యేకం
‘‘నాకు చాలా చాలా ఇష్టమైన పండగ వినాయక చవితి. వినాయక విగ్రహాన్ని ఇంటివద్దకు తీసుకొచ్చేటప్పుడు, నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు బ్యాండ్‌కి తగ్గట్టు ఫుల్‌గా డ్యాన్స్ చేసి అలిసిపోయేదాన్ని. ‘బేబీ’ చిత్రంలో ఓ పాటలో వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు చిన్నతనం గుర్తొచ్చింది. ఇప్పటికి కూడా వినాయకుడి వద్ద ఉండే బ్యాండ్ సౌండ్‌కి డ్యాన్స్ చేయకుండా ఆగలేను’’ అని హీరోయిన్ వైష్ణవీ చైతన్య అన్నారు. ‘బేబీ’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నారు తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య. నేడు వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారామె.. ఆ విశేషాలు... ► ఈ ఏడాది వినాయక చవితిని ఎలా ప్లాన్ చేస్తున్నారు? గతంలో ప్రతిసారి నేను, తమ్ముడు ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఈ సారి మా అమ్మ, నాన్న ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఏడాది తొమ్మిది రోజులు వినాయకుణ్ణి ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్లం.. కాలనీ వాళ్లని పిలిచి అన్నదానం చేసేవాళ్లం. ప్రతిరోజూ సాయంత్రం భజనలు చేసేవాళ్లం. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఫుల్ హంగామా చేస్తూ ట్యాంక్‌బండ్‌కి తీసుకెళ్లి నిమజ్జనం చేసేవాళ్లం. ఈ సారి అలాగే చేయాలనుకుంటున్నాం. ► గత ఏడాదికీ, ఈ ఏడాదికీ మీ స్థాయిలో మార్పు వచ్చింది. గతంలో వైష్ణవీ చైతన్య అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ‘బేబీ’ హీరోయిన్ అని తెలుసు.. దాన్ని ఎలా చూస్తారు? ప్రతి ఏడాది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఇంకా ఎక్కువ ప్రత్యేకం. ఎందుకంటే ‘బేబీ’ సినిమా చేశాం.. చాలా పెద్ద హిట్ అయింది. ఎంతో మంది నుంచి యూనిట్‌కి అభినందనలు వచ్చాయి. దాంతో మేము చాలా మోటివేషన్ (ప్రేరణ) జోన్లో ఉన్నాం. ఇంకా అదే సంతోషంలోనే ఉన్నాం.. కాబట్టి ఈ ఏడాది ఇంకా ప్రత్యేకం అని చెప్పాలి. ► వినాయక చవితి అంటే అమ్మాయిలు ప్రత్యేకించి లెహంగా వంటి బట్టలు కుట్టించుకోవడం చేస్తుంటారు. ఈసారి కూడా అలాంటివి ఏమైనా కుట్టించుకున్నారా? నా చిన్నప్పటి నుంచి నా బట్టలన్నీ మా అమ్మే కుట్టేది.. ఈసారి కూడా అమ్మే కుడుతుంది. తొమ్మిది రోజులు వినాయకుడికి ఇంట్లో పూజలు చేస్తాం కాబట్టి తొమ్మిది జతల బట్టలు కుడుతుంది. నవరాత్రులకు కూడా అలాగే చేస్తాం. నా కోసం తొమ్మిది హాఫ్ శారీస్ రెడీ చేసి పెడుతుంది మా అమ్మ. ► హాఫ్ శారీస్ కట్టుకోవడం మీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నా సంప్రదాయంగా హాఫ్ శారీస్, చీరలు కట్టుకుంటాను. అవి అంటే నాకు అంత పిచ్చి. నేను జీన్స్ వేసుకోవడం చాలా తక్కువ. ఎప్పుడైనా వేసుకున్నా బొట్టు మాత్రం కచ్చితంగా పెట్టుకుంటా. మన సంప్రదాయం, బొట్టు అనేవి నాకు మంచి ప్రేరణ, నమ్మకాన్ని ఇస్తాయి. ► చవితికి పిండి వంటలు చేయడం మీకు వచ్చా? నేను చేస్తాను.. నాకు బాగా వస్తాయి. పిండి వంటలు, ఉండ్రాళ్లు, పులిహోర నేను చేస్తాను. స్వీట్స్ మాత్రం అమ్మ చేస్తుంది. స్వీట్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి నేను చేయను. వంటలన్నీ బాగా వండుతాను. ► మీ అమ్మ మన సంప్రదాయాల గురించి చెబుతూ మిమ్మల్ని పెంచారా? మన ఇంట్లో వాళ్లు ఎలా ఉంటే మనం కూడా అలా ఉంటాం కదా! మా అమ్మ ఎప్పుడూ పూజలు, వంటలు చేస్తూ పాజిటివ్ వైబ్స్‌తో ఉండేది. ఆమెను చూస్తూ నేను కూడా నేర్చుకున్నా. నన్ను అయితే నేర్చుకో అంటూ ఎప్పుడూ ఒత్తిడి చేయదు. ► ఇప్పుడు హీరోయిన్గా బిజీగా ఉన్నారు కాబట్టి వంట గదిలోకి వెళ్లే సమయం ఉండదేమో? అవును. ‘బేబీ’ తర్వాత ఆశిష్‌కి జోడీగా ఓ సినిమా, సిద్ధు జొన్నలగడ్డకి జతగా ఓ చిత్రం చేస్తున్నా. ► ఖైరతాబాద్ వినాయకుడు అంటే బాగా ఫేమస్.. అక్కడికి వెళుతుంటారా? ప్రతి ఏడాది వెళు తుంటాం. గత ఏడాది కూడా వెళ్లాను. ఈ ఏడాది కూడా వెళ్లాల్సిందే. ‘బేబీ’ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా గుర్తు పడుతున్నారు. నన్నే కాదు.. మా కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టి మాట్లాడటం సంతోషంగా ఉంది. ► చిన్నప్పుటి నుంచి హీరోయిన్ కావాలనే లక్ష్యం ఉండేదా? లేకుంటే వేరే ఏదైనా..? నాకు పదిహేనేళ్ల నుంచి సినిమా అంటే ఇష్టం ప్రారంభమైంది. సినిమా అంటే ఏంటో తెలియని వయసులో ప్రారంభమైన ఇష్టం ఇప్పుడు సినిమానే నా జీవితం అయింది. ► మీకు సినిమా నేపథ్యం లేదు. చిత్ర పరిశ్రమలో ఎలా రాణించగలుగుతామనిపించిందా? పైగా తెలుగమ్మాయి అంటే అవకాశాలు తక్కువగా ఉంటాయి కదా... తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరనే మాట ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ, నేనయితే సినిమాలపై ఇష్టం, ప్రేమతో ప్రయత్నాలు చేయడం ప్రారంభించా.. ఆడిషన్స్‌కి వెళ్లేదాన్ని. నమ్మకం కోల్పోకుండా అలా ప్రయత్నించగా అవకాశాలు వచ్చాయి. దేనికైనా సమయం పడుతుంది. అది నటనే కాదు.. వేరే ఏ కెరీర్ అయినా కూడా. మనం కోరుకున్నది వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ► నటన ఒక్కటేనా? లేకుంటే డైరెక్షన్, ఇతర ఆలోచనలేమైనా ఉన్నాయా? నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. కూచిపూడి, వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ► మీ జీవితంలో మరచిపోలేని వినాయక చవితి ఏది? స్కూల్లో చదువుతున్న సమయంలో అందరూ నిద్రపోయాక కాలనీలోని వినాయక మండపం వద్ద ఉన్న లడ్డును దొంగతనం చేయాలనుకునేవాళ్లం. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మండపం వద్దకు వెళ్లి లడ్డు దొంగతనం చేసి అందరికీ పంచేవాళ్లం (నవ్వుతూ). -
గణపయ్య పండుగ..వైవిధ్య వేడుక
సాక్షి, అనంతపురం డెస్క్: వినాయక చవితి పండుగ అంటే అందరిలోనూ ఉత్సాహం. వేడుకలను వైభవంగా, విభిన్నంగా, గత ఏడాదికి మించి చేయాలనే తపన. పండుగకు పది, పదిహేను రోజుల ముందు నుంచే ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. చందాల వసూలు, మంటపాల నిర్మాణం, డీజే, ఆర్కెస్ట్రా..ఇలా ప్రతి అంశంలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఒకప్పుడు వేడుకలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే జరిగేవి. నేడు గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాలకు ఏమాత్రమూ తీసిపోకుండా నిర్వహిస్తున్నారు. యువోత్సాహం..కమిటీల సాయం గత కొన్నేళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అనంతపురం నగరంతో పాటు తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, ధర్మవరం, కదిరి, హిందూపురం పట్టణాల్లో వేలాది విగ్రహాలు కొలువుదీరుతున్నాయి. వీటితో పాటు ద్వితీయశ్రేణి పట్టణాలు, మండల కేంద్రాలు, చివరకు మారుమూల పల్లెల్లో సైతం వీధివీధినా గణనాథులను కొలువుదీర్చి ఆరాధిస్తున్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఉత్సవ కమిటీలు, ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థలు వేడుకల నిర్వహణలో తగిన సహాయ సహకారాలు అందిస్తున్నాయి. పల్లెల్లో పూర్తిగా యువత ముందుండి నడిపిస్తున్నారు. చిన్నా పెద్ద, పేద, ధనిక, కుల, మతాలకు అతీతంగా అందరినీ వేడుకల్లో భాగస్వాములు చేస్తున్నారు. సెలవు పెట్టి.. సందడి చేసి బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో సాఫ్ట్వేర్, ఇతరత్రా రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువకులు వినాయక చవితి పండుగ సమయంలో కచ్చితంగా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఉద్యోగాలకు సెలవు పెట్టడమో, కుదరని పక్షంలో వర్క్ ఫ్రం హోం ఆప్షన్‌ను ఎంచుకుని పల్లెల్లో ప్రత్యక్షమవుతున్నారు. ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం ఇతరత్రా సందర్భాలను కాదనుకుని వినాయక చవితి సమయంలో మాత్రం సొంతూళ్లకు చేరుకుంటున్నారు. వీరంతా ముందుండి వేడుకలు నడిపిస్తున్నారు. వీరి ఉత్సాహాన్ని చూసి స్థానికులు కూడా ప్రోత్సహించడంతో పాటు వేడుకల్లో భాగస్వాములవుతున్నారు. ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పల్లెల్లో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు వెలుస్తున్నాయి. వీటిలో పది, పదిహేను రోజుల ముందు నుంచే చర్చ మొదలవుతోంది. చందాల వివరాలు, వేడుకలకు చేస్తున్న ఏర్పాట్లు, ఎవరెవరు ఏయే సహకారం అందిస్తున్నారన్న సమాచారాన్ని అందులో షేర్ చేస్తున్నారు. మంటపాల వద్ద సందడి, నిమజ్జనోత్సవ దృశ్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరించి వీడియోలు, ఫొటోలను వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు. తద్వారా ఇతర ప్రాంతాల్లో ఉంటూ అనివార్య కారణాల వల్ల ఊళ్లకు రాలేకపోతున్న వారికి కూడా ఆనందాన్ని పంచుతున్నారు. సామాజిక బాధ్యత మరవొద్దు.. పట్టణాలతో పాటు పల్లెల్లోనూ గణేశ్ వేడుకలు వైభవంగా నిర్వహిస్తుండడం శుభ పరిణామం. ఇది ఐక్యతకు, సామరస్యానికి దోహదపడుతోంది. కానీ ఇందులో సామాజిక బాధ్యతనూ విస్మరించరాదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయి. జలచరాలకు ప్రమాదం ఏర్పడుతోంది. మనుషులకూ కాలుష్యపు పోటు తప్పడం లేదు. కావున ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఆలోచించి మట్టి గణపయ్యలను ఆరాధించాల్సిన అవసరముంది. అప్పుడు మాత్రమే ఈ వేడుకలకు అర్థం, పరమార్థం ఉంటుంది. గణనాథుని చల్లని దీవెనలూ దక్కుతాయి. మట్టి గణపతే శ్రేష్టం జడ పదార్థమైన భూమి.. చైతన్యం కలిగిన నీళ్లతో చేరినప్పుడు ప్రాణ శక్తి కలుగుతుంది. తద్వారా ఆహార పదార్థాలు, ఔషధులను మనకు అందిస్తుంది. ప్రాణధార, జడశక్తుల కలయికతో సృష్టి ముందుకు సాగుతున్నదన్న సంగతిని చెప్పడానికే గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారు చేసి, పూజించే విధానం ఏర్పడింది. మట్టి విగ్రహాలనే పూజించమని శాస్త్రమే ఉద్బోధిస్తున్నది. వాతావరణ కాలుష్యం కాకుండా మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయి. కావున ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే ఆరాధించాలి. – మహేశ్వర శర్మ, శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు -
గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టం.. హుస్సేన్‌సాగర్ వద్ద భారీ ఏర్పాట్లు (ఫొటోలు)
-
వినాయక చవితి పండగ నిర్వహణపై ఎల్లాంటి ఆంక్షలు లేవు
-
Hyderabad: వినాయకుడి ఊరేగింపు ఉత్సవాలు.. ఈ నియమాలు తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: పల్లె, పట్నం, చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తున్న వినాయక చవివి రానే వచ్చింది. ఆగస్టు 31 నుంచి చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.భక్తులు మండపాల ఏర్పాటు, విగ్రహాల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. మండపాలు ఏర్పాటు, పూజలు, ఊరేగింపు, నిమజ్జనం తదితర అంశాల్లో జాగ్రత్తలు పాటిస్తే నవరాత్రులు విజయవంతమైనట్లే, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు లభించినట్లే. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో పాటించాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం. రాకపోకలకు భంగం కలిగించొద్దు... వినాయక మండపాలు ఏర్పాటు చేసే సమయంలో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. రహదారి మధ్యలో మండపాలు నిర్మిస్తే వాహనాల రాకపోకలు, ఇతర ఇబ్బందులు ఎదురవుతాయి. ఖాళీ స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. విగ్రహాల పరిమాణం.. విగ్రహాల పరిమాణం చిన్నగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే నిమజ్జనం సమయంలో విద్యుత్ తీగలు తాకే ప్రమాదముంది. తరలించే సమయం, మండపాల స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న విగ్రహాలను ప్రతిష్టించాలి. చదవండి: తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1 పర్యవరణాన్ని కాపాడాలి.. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి హానికరమైన వాటితో చేసిన విగ్రహాలతో నీటి కాలుష్యం ఏర్పడుతుంది. మట్టి, పీచు, సహజ సిద్ధమైన రంగులతో తయారైన విగ్రహాలను పూజించాలి. డీజేలకు పోలీసుల అనుమతి తీసుకోవాలి.. పూజా సమయంలో మాత్రమే మైకులు ఉపయోగించాలి. అనవసర సమయంలో బంద్ చేయాలి. భక్తి గీతాలు మాత్రమే వినిపింంచాలి. డీజేలు, భారీ స్పీకర్లకు పోలీసుల అనుమతి తీసుకోవాలి. వ్యయం తగ్గించాలి... మండపాల నిర్వాహకులు చందాలు డిమాండ్ చేయకుండా భక్తులు ఇచ్చింది తీసుకోవాలి. మండపాల అలంకరణ, నిమజ్జనం రోజు భారీగా ఖర్చు చేయడం కంటే అన్నదానం, పిల్లలకు వినోద, విజ్ఞానం వచ్చే అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి. సాఫీగా నిమజ్జనం చేయాలి... నిమజ్జనం రోజున మద్యం సేవించి డ్యాన్స్‌లు చేస్తూ సమస్యలు సృష్టించవద్దు. చెరువుల వద్ద అధికారుల సూచనలు పాటించాలి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలి. పోలీసులకు సహకరించాలి.. పండుగ మూలాలు తెలుసుకొని బాథ్యతగా వినాయక ఉత్సవాలను జరుపుకోవాలి. విగ్రహ ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఇతరులతో పోటీ పడకుండా సాంప్రదాయాలు పాటించాలి. ప్రభుత్వ సూచనలను పాటించాలి. శాంతిభద్రతల విషయమై పోలీసులకు సహకరించాలి. – చంద్రబాబు, సీఐ ఘట్కేసర్ -
ఆ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు.. మల్లాది విష్ణు క్లారిటీ
సాక్షి, తాడేపల్లి: వినాయక చవితిని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అబద్దాల కోరుగా మారాడని విమర్శించారు. వినాయకుడిని అడ్డం పెట్టుకుని బీజేపీ, చంద్రబాబు బురద జల్లాలని చూస్తున్నారన్నారు. వినాయక చవితి పందిళ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలోనే మండపాలకు విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారన్నారు. సీఎం జగన్ వచ్చాక ఎలాంటి చార్జీలు పెంచలేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సోమువీర్రాజు, చంద్రబాబుపై కేసు పెట్టాలని పోలీసుల్ని కోరారు. సోము వీర్రాజుకు దమ్ముంటే పోలవరానికి నిధులు ఇప్పించాలన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని కోరారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. అబద్ధపు ప్రచారాలు తగదు గణేష్ మండపాల విషయంలో ఎలాంటి రుసుంలు వసూలు చేయడం లేదని దేవాదాయశాఖ తెలిపింది. సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయడం తగదని సూచించింది. రుసుంలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ హెచ్చరించింది. చదవండి: (కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల) -
ప్రగతిభవన్‌లో వినాయకుడికి సీఎం కేసీఆర్ దంపతుల పూజలు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిష్టించిన మట్టి గణపతికి తన సతీమణి శోభతో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, ఎంపీ సంతోశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పూజలకు కేసీఆర్ మనమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య రావు కూడా హాజరయ్యారు. -
గ్రామానికి ఒకే వినాయకుణ్ణి ప్రతిష్ఠించాలి
చౌటుప్పల్ : కరోనా తీవ్రరూపం దాలుస్తు న్న నేపథ్యంలో ప్రజలు వినాయకచవితి వేడుకల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా గ్రామానికి ఒకే వినాయకుణ్ణి, మూడు అడుగుల ఎత్తుకు మించకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూ చించారు. జనం గుమికూడకుండా ఉండాలన్నారు. ఉత్సవ నిర్వాహకులు బలవంతంగా చందాలు వసూలు చేయొద్దని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకన్న ఉన్నారు. -
నో క్యాష్ ప్లీజ్.!
కడప వైఎస్సార్ సర్కిల్ : ప్రజలు ఏ సమయంలోనైనా డబ్బును డ్రా చేసుకునేందుకు వీలుగా దాదాపు అన్ని బ్యాంకులు ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేశాయి. ఖాతాదారులు కూడా నగదు లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఈ కేంద్రాలు ఎంతో అనువుగా ఉన్నాయని భావించారు. అయితే గత రెండు రోజులుగా ఏటీఎం కేంద్రాలలో నగదు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఏటీఎం కేంద్రాలలో నగదు పెట్టగా 1వ తేదీ కావడంతోపాటు వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు అధిక సంఖ్యలో డ్రా చేసుకోవడంతో రెండు, మూడు గంటలకే ఖాళీ అయ్యాయి. ఆ తర్వాత శుక్రవారం సార్వత్రిక సమ్మె కారణంగా బ్యాంకు ఉద్యోగులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడంతో సేవలు నిలిచిపోయాయి. అయితే శనివారం బ్యాంకులు యధావిధిగా పనిచేసినా వివిధ కారణాలతో పలు బ్యాంకుల అధికారులు ఏటీఎం కేంద్రాల్లో నగదు పెట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం నాడు అత్యవసర పరిస్థితుల్లో చాలామంది నగదును డ్రా చేసుకోవడానికి బ్యాంకులకు వెళ్లినా ఏటీఎం కేంద్రాల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించారు. తీరా ఆయా కేంద్రాలకు వెళ్లిన వారికి ఏటీఎంలలో నగదు లేకపోవడంతో దిక్కుతోచలేదు. ఈనెల 4న ఆదివారం, 5న సోమవారం వినాయక చవితి పండుగ సెలవు కావడంతో నగదు అవసరమైన వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఖాతాదారులు బ్యాంకు అధికారులను కోరుతున్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవతి వేడుకలు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవతి వేడుకలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణేష్ మండపాలలో విఘ్నేశ్వరుడి విగ్రహాలను చూడ ముచ్చటగా అలంకరించారు. అనేక రూపాలలో విఘ్నేశ్వరుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పలు జిల్లాల్లో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని వినాయకుడిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. ఇక్కడ 59 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. దిల్షుక్ నగర్ చైతన్యపురిలో అయ్యప్ప భక్త సమాజ మండలి అధ్వర్యంలో ప్రతిష్టించిన కామదేను గణనాథుడు కనుల విందు చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు ప్రగతి రిసార్ట్‌లో ఏకో ఫ్రెండ్లీ వినాయక మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వినాయకచవతి ఉత్సవాల సందడి నెలకొంది. వాడవాడలా గణేష్ మండపాలు సిద్ధమయ్యాయి. విగ్రహాల తయారీలో రసాయనాల వాడకాన్ని నియంత్రించేందుకు దేవాలయాలు, స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను పంపిణీ చేశాయి. విజయనగరంలో స్పార్క్ సొసైటీ, కాలుష్య నియంత్రణ మండలి అధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విగ్రహాలను తీసుకున్నారు. కాలుష్యాన్ని నివారించేందుకే మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టినట్టు నిర్వహాకులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కాలుష్యానికి హానికలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వ్యతిరేకిస్తూ 27 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని తయారు చేశారు. ఇళ్లల్లో పూజించేందుకు మార్కెట్లో దొరికే మట్టి విగ్రహాల వైపే భక్తులు ఆసక్తి కనబరిచారు. పాలకొల్లులో రెల్లి యువజన సంఘం అధ్వర్యంలో 52 అడుగుల నాట్య గణపతిని నెలకొల్పొరు. ఖమ్మం జిల్లా పాల్వంచలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇండియన్ గ్రీన్ హెల్త్ సొసైటీ, మానస అకాడమీ స్వచ్చందసంస్థ అధ్యర్యంలో 5వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకోసం వినాయక ప్రతిమతో పాటు మొక్కలనూ పంపిణీ చేశారు. చాలా జిల్లాల్లో ప్రజలు పర్యావరణానికి హానికలిగించని మట్టి విగ్రహాల పట్ల ఆసక్తి కనబరచడం హర్షించదగ్గ విషయం.