సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువుతీరాడు పార్వతీ తనయుడు.
రాజ్య రక్షకుడు:
రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్ రాజు హమీర్‌కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్‌కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు. ఒక రోజు రాత్రి అతను నిద్రపోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరిపోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసిపోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు.
ఇదీ విశిష్టత: ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన సిద్ధి, బుద్ధి తోపాటు కుమారులైన శుభ్, లాభ్ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ప్రార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.
ఎక్కడ?
రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్‌లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుంచి సవాయ్ మాధోపూర్ జంక్షన్‌కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 17 కి.మీ. దూరంలో ఉన్న రణథంబోర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రణథంబోర్‌కు సమీప విమానాశ్రయం సుమారు 150 కి.మీ. దూరంలోని జైపూర్‌లో ఉంది. రంగులు మార్చే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయమే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా... ప్రాశస్త్యం మాత్రం చాలా పెద్దది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం.
మార్చి నుంచి జూన్ వరకూ నల్లని రంగులో ఉండే ఈ వినాయకుడు జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. అంతే కాదు, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.. నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడి వినాయకుడు తన రంగును మార్చుకు న్నట్లే.. ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి.
అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు. ఇక చారిత్రక విషయాల కొస్తే... ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది ‘శివాలయం’. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది.
ఆ తర్వాతే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్’ ఆలయం అని అంటారు. ఈ ఆలయానికో చరిత్ర కూడా ఉంది. ఆ రోజులలో ‘కేరళపురం’ రాజుగారు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం’ వెళ్లాడట. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..‘దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం’ అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ, మరొక ‘మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు.
కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతనమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం.
దొడ్డ గణపతి ఆలయం, బెంగళూరు
బెంగళూరులోని బసవన గుడి బుల్ ఆలయం పక్కనే ఉంది ఈ ఆలయం. దేవాలయంలోని గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి అని, శక్తి గణపతి అని పిలుస్తుంటారు.విశేషం ఏమిటంటే ... ఆలయం కుడివైపు క్రమంగా పెరగటం. భక్తులు ఇది దేవుని మహిమగా చెబుతారు. బెంగళూరు నుంచే కాక రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించి, తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు.
స్వామి వారి అలంకరణ:
వారంలో అన్ని రోజులలో స్వామి వారికి పూజలు చేసి రకరకాల అలంకరణ చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఈ అలంకరణ లో అతి ముఖ్యమైనది వెన్నతో స్వామిని అలంకరించటం. దీన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు అని భక్తులు చెప్పుకొంటారు. ఇది చూస్తే జన్మ ధన్యం అయినట్లు భావిస్తారు ఈ భారీ గణేషుని శరీరానికి వెన్న పట్టించటానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరం అవుతుంది. ఆలయ వెనక శ్రీ శివ శక్తి బేడర కన్నప్ప, శ్రీ కానేశ్వర, శివాలయాలు ఉన్నాయి.
ఆలయ సందర్శన సమయం
దొడ్డ గణేశ దేవాలయంలో స్వామి దర్శనం ఉదయం ఏడు నుంచి పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం అయిదున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది. వినాయక చవితి నుంచి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.
బెంగళూరు లో వాయు, రోడ్డు, విమాన సౌకర్యాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉంది. అలాగే రెండు రైల్వే స్టేషన్ లు – బెంగళూరు సిటీ, యశ్వంతపుర ఉన్నాయి ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు, విమానాలు వస్తుంటాయి. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బెంగళూరు కు బస్సు సౌకర్యం ఉంది.
తెలుగు రాష్ట్రాలలో సిద్ధివినాయక ఆలయం
ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం దీనికి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. ఉమాసుతుడు ఇక్కడ సిద్ధి వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతల ఆలయాలూ ఉన్నాయి.
స్థల పురాణం
కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం చెబుతోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామం లో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకుని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.
క్షేత్ర ప్రత్యేకత
అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు.
దక్షిణాభిముఖంగా దర్శనం..సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. అలాగే దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం.
వివిధ ఉత్సవాలు..
ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు.
విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష కలములను సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి... లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం.
వివిధ ఆలయాలు...
అయినవిల్లి క్షేత్రంలో గణపతి ఆలయంతో పాటు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరాలయం, శ్రీదేవీ, భూదేవీ సమేత కేశవస్వామి ఆలయం, కాలభైరవ ఆలయాలు ఉన్నాయి.
ఇలా చేరుకోవాలి...
రాజమహేంద్రవరం నుంచి అయినవిల్లికి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం నుంచి బస్సు, ఆటోలో దేవాలయాన్ని చేరుకోవచ్చు. కాకినాడ నుంచి యానాం, అమలాపురం, ముక్తేశ్వరం మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు.
ఇతర సమాచారం..
దేవాలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 8గంటల వరకు తెరిచి ఉంటుంది.
అభిషేకం ఉదయం 7 గం.ల నుంచి 11 గం. వరకు జరుగుతుంది. (సాధారణ రోజుల్లో)
– డి.వి.రామ్ భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment