కుమారస్వామి అప్పటికే దేవసేనాధిపతిగా ఉన్నాడు. అందువల్ల వినాయకుడికి ప్రమథ గణాధిపత్యం ఇవ్వాలనుకున్నాడు శివుడు.‘నువ్వు నా ప్రమథగణాలకు నాయకుడిగా ఉండు’ అని వినాయకుడితో అన్నాడు శివుడు.‘తండ్రీ! నాయకుడిగా ఉండమంటే సరా? అర్హత నిరూపించుకోనిదే నాయకత్వం స్వీకరించడం ఏమంత సమంజసం? తమ్ముడు ఇప్పటికే దేవసేనాధిపతిగా సేనానాయకత్వంలో ఆరితేరి ఉన్నాడు. అతడికే గణాధిపత్యం కట్టబెడితే బాగుంటుంది’ అన్నాడు వినాయకుడు.‘ఇప్పటికే నీ తమ్ముడు దేవసేనాధిపతిగా ఉన్నాడు గనుకనే నిన్ను ప్రమథగణాలకు నాయకత్వం వహించమంటున్నాను. ఒక్కడే రెండు బాధ్యతలు నిర్వహించడం అతడికి భారంగా మారవచ్చు’ అన్నాడు శివుడు.‘తండ్రీ! అయితే, ఏదైనా పరీక్షపెట్టి, నెగ్గినవారికి నాయకత్వం అప్పగించడం న్యాయంగా ఉంటుంది’ అన్నాడు వినాయకుడు.
దేవతలు, ప్రమథులు కలసి వినాయకుడికి, కుమారస్వామికి ఒక పందెం పెట్టారు. ముల్లోకాల్లోని తీర్థ క్షేత్రాలను సేవించి ముందుగా ఎవరు కైలాసానికి చేరుకుంటారో వారికే గణాధిపత్యం అప్పగించాలని తీర్మానించారు.కుమారస్వామి తన మయూరవాహనంపై రివ్వుమని ఎగురుతూ బయలుదేరాడు.వినాయకుడు ఎక్కడికీ కదలకుండా, ఉన్నచోటనే చతికిలబడి కూర్చుండిపోయాడు.అప్పుడు విష్ణువు అతణ్ణి ఏకాంతంలోకి తీసుకుపోయి, ‘నాయనా! మేమంతా నిన్ను అభిమానిస్తున్న వాళ్లం. నీ ఓటమి మా ఓటమి అవుతుంది. నువ్వెక్కడికీ తిరగనక్కర్లేదు. నేను చెప్పినట్లు చేస్తే చాలు’ అని చెప్పాడు.విష్ణువు సలహాతో వినాయకుడు ఉన్నచోటనే మఠం వేసుకు కూర్చుని, శివపంచాక్షరి మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు.కుమారస్వామి వెళ్లిన ప్రతి తీర్థంలోనూ, క్షేత్రంలోనూ వినాయకుడు అతడికి తిరుగుముఖం పడుతూ ఎదురవుతూ వచ్చాడు.
ఆశ్చర్యపోతూనే ముల్లోకాల్లోని తీర్థ క్షేత్రాలను కుమారస్వామి సేవించుకున్నాడు. కైలాసానికి తిరిగివస్తూనే, ‘తండ్రీ! ఈ పందెంలో నేను ఓడిపోయాను. అన్నదే గెలుపు. నీవనుకున్నట్లు అతడికే గణాధిపత్యాన్ని అప్పగించు’ అన్నాడు. కుమారస్వామి కైలాసంలో కొలువుదీరిన దేవతలు, మునులు, ప్రమథగణాల మధ్యకు వచ్చి, ‘పందెంలో మా అన్న వినాయకుడే గెలిచాడు. అతడికి సత్వరమే గణాధిపత్య పట్టాభిషేకం జరగాలి. శివుని ఆజ్ఞ అందరికీ శిరోధార్యం’ అని చెప్పాడు. కుమారస్వామి ప్రకటనతో దేవతలందరూ హర్షం వెలిబుచ్చారు. అయితే, ప్రమథగణ ప్రముఖులలో శృంగీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, నందీశ్వరులు మాత్రం దీనిని వ్యతిరేకించారు.అదివరకు వినాయకుడు పుత్రగణపతి రూపంలో వారికి గర్వభంగం చేశాడు.
ఆ అక్కసుతోనే వారు వినాయకుడికి గణాధిపత్యం కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, ‘మొదటి నుంచి మేము శివుడికి నమ్మినబంట్లుగా ఉంటున్నాం. అలాంటిది వినాయకుడు మాకు ఎలా అధిపతి అవుతాడు? అతడికి తనదంటూ ఎలాంటి బలగమూ లేదు. అతడికి గణాధిపత్య అభిషేకమేమిటి?’ అంటూ నానా మాటలూ అన్నారు.ప్రమథుల కలకలం విన్న శివుడు అక్కడకు చేరుకున్నాడు. వారి మాటలు విని కళ్లెర్రజేశాడు. ‘నా నిర్ణయానికే ఎదురాడేటంత గొప్పవారైపోయారా మీరు?’ అంటూ ఆగ్రహోదగ్రుడయ్యాడు.ఇంత జరుగుతున్నా వినాయకుడు శాంతంగా, ‘నిజమే! నాకు గణాలెక్కడివి? లేవు కాబోలు. అన్నట్లు పుత్రగణపతిగా ఉన్నప్పుడు నాకూ కొన్ని గణాలు ఉన్నట్లు గుర్తు. ఆ గణాలు ఎక్కడ?’ అన్నాడు.
వినాయకుడి నోట ఆ మాట వెలువడగానే, ముమ్మూర్తులా వినాయకుడిని పోలి ఉన్న గజముఖులు కోటాను కోట్లుగా పుట్టుకొచ్చారు. దిక్కులు పిక్కటిల్లేలా వినాయకుడికి జయజయ ధ్వానాలు పలుకుతూ అతడికి బాసటగా వచ్చి నిలుచున్నారు. వారందరూ చతుర్భుజులే! కొందరి చేతుల్లో ఘంటాలు, లేఖినులు, కుంచెలు ఉన్నాయి. ఇంకొందరి చేతుల్లో త్రిశూల కరవాల గదా ధనుర్బాణాది ఆయుధాలు ఉన్నాయి. మరికొందరి చేతుల్లో వీణా వేణు మృదంగ ఢక్కాది వాద్యపరికరాలు ఉన్నాయి. వారిలో కొందరు అరుణపతాకాలను పట్టుకున్నారు. ఇంకొందరు వినాయకుడికి ఛత్ర చామరాలు పట్టారు. వారు రత్నఖచితమైన భద్రసింహాసనాన్ని తీసుకువచ్చి, వినాయకుణ్ణి దానిపై కూర్చుండబెట్టారు. ఈ సంరంభానికి వినాయకుడి వాహనమైన మూషికం సింహాసనం కింద ఆనందంతో చిందులు వేయడం మొదలుపెట్టింది. దేవతలు, మునులు వేదస్తోత్రాలు పఠిస్తుండగా ప్రమథ గణాధిపతిగా వినాయకుడికి ఘనంగా అభిషేకం జరిగింది.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment