రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవతి వేడుకలు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవతి వేడుకలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణేష్ మండపాలలో విఘ్నేశ్వరుడి విగ్రహాలను చూడ ముచ్చటగా అలంకరించారు. అనేక రూపాలలో విఘ్నేశ్వరుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పలు జిల్లాల్లో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ ఖైరతాబాద్లోని వినాయకుడిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. ఇక్కడ 59 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. దిల్షుక్ నగర్ చైతన్యపురిలో అయ్యప్ప భక్త సమాజ మండలి అధ్వర్యంలో ప్రతిష్టించిన కామదేను గణనాథుడు కనుల విందు చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు ప్రగతి రిసార్ట్‌లో ఏకో ఫ్రెండ్లీ వినాయక మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో వినాయకచవతి ఉత్సవాల సందడి నెలకొంది. వాడవాడలా గణేష్ మండపాలు సిద్ధమయ్యాయి. విగ్రహాల తయారీలో రసాయనాల వాడకాన్ని నియంత్రించేందుకు దేవాలయాలు, స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను పంపిణీ చేశాయి.
విజయనగరంలో స్పార్క్ సొసైటీ, కాలుష్య నియంత్రణ మండలి అధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విగ్రహాలను తీసుకున్నారు. కాలుష్యాన్ని నివారించేందుకే మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టినట్టు నిర్వహాకులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కాలుష్యానికి హానికలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వ్యతిరేకిస్తూ 27 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని తయారు చేశారు. ఇళ్లల్లో పూజించేందుకు మార్కెట్‌లో దొరికే మట్టి విగ్రహాల వైపే భక్తులు ఆసక్తి కనబరిచారు. పాలకొల్లులో రెల్లి యువజన సంఘం అధ్వర్యంలో 52 అడుగుల నాట్య గణపతిని నెలకొల్పొరు.
ఖమ్మం జిల్లా పాల్వంచలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇండియన్ గ్రీన్ హెల్త్ సొసైటీ, మానస అకాడమీ స్వచ్చందసంస్థ అధ్యర్యంలో 5వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకోసం వినాయక ప్రతిమతో పాటు మొక్కలనూ పంపిణీ చేశారు.
చాలా జిల్లాల్లో ప్రజలు పర్యావరణానికి హానికలిగించని మట్టి విగ్రహాల పట్ల ఆసక్తి కనబరచడం హర్షించదగ్గ విషయం.