Clay Ganesh idols
-
మట్టి గణపతితో పుణ్యం, ఫలం : గణపతి బప్పా మోరియా!
గణనాధుని పూజించుకునేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగువారి తొలి పండుగ, ఆది దేవుడైన గణపతి తొమ్మిది రోజుల పాటు పూజలందుకోనున్నాడు. వినాయక చవితి వేడుకలకు వాడ వాడలూ వినాయక మండపాలతో సిద్ధమై పోతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఎక్కడ చూసినా బాల గణపయ్యు, బొజ్జ గణపయ్యలు రక రకాల ఆకారాల్లో, సైజుల్లో కొలువు దీరాయి. నవరాత్రి ఉత్సవాలకు మేం రెడీ.. రారమ్మంటూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. అయితే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మట్టి ప్రతిమలనే పూజించాలని పర్యావరణ పరిరక్షకులు, నిపుణులు సూచిస్తున్నారు. మట్టి గణపతే, మేలైన గణపతి అని నినదిస్తున్నారు. ఈ మేరకు పలు స్వచ్ఛంద సంస్థలు గత కొన్నేళ్లుగా ప్రచారాన్ని చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.వినాయక మండపాల్లో అందం, ఆకర్షణ కోసం రంగురంగుల భారీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకే చాలామంది మొగ్గు చూపుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప అనే ట్రెండ్ ఇటీవలి కాలంలో బాగా వ్యాపిస్తోంది. ఈ ధోరణే పర్యావరణానికి పెద్ద సమస్యగా మారుతోంది. నవరాత్రులు, భక్తితో పూజించడమే ప్రామాణికమని పండితులు సైతం చెబుతున్నారు. పంచభూతాల సమాహారమైన మట్టి గణపతిని పూజించడం అంటే పంచభూతాలు, అధిష్టాన దేవతలు పూజిస్తున్నామని అర్థమని పండితులు చెబుతున్నమాట. పర్యావరణహితంగా వేడుకలు నిర్వహిస్తే ప్రజలను, పర్యావరణాన్ని రక్షించుకున్న వారమవుతామని పిలుపునిస్తున్నారు.పీఓపీ విగ్రహాలతో అన్నీ అనర్థాలేప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల ద్వారా పర్యావరణానికి తీరని ముప్పు అని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. విగ్రహాల అలంకరణకు వాడే రసాయన రంగులు మరింత ప్రమాదం కరమంటున్నారు. ఇవి నీటిని కలుషితం చేయడమే కాదు, అనేక రకాల రోగాలు మూలం అవుతాయి. రసాయ రంగులతో నిండిన విగ్రహాలు చెరువులు, వాగులు, నదుల్లో నిమజ్జనం చేస్తే అవి త్వరగా కరగవు. ఈ నీటిని తాగిన పశువులు, ఇతర జీవుల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. రసాయనాలు కలిసిన నీటితో నరాలపై ప్రభావం చూపి కేన్సర్ వ్యాధికి దారితీస్తుంది. అనేక చర్మవ్యాధులు సైతం వ్యాప్తి చెందుతాయి. ఈ నీరు పంట పొలాల్లో చేరితే భూసారం దెబ్బతింటుంది. ఆహార ఉత్పత్తులు కలుషితం అవుతాయి. అంతేకాదు పూజకు వాడిన పువ్వులను కూడా వృధాగా కాలువల్లో పారవేయడం కాకుండా, రీసైకిల్ చేయడంగానీ, ఇతర ఉత్పత్తులను తయారు చేయడానికి వినియోగించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పీఓపీలో సల్ఫర్, జిప్సం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పదార్థాలు ఉంటాయి. రంగుల్లో పాదరసం, కాడ్మియం, ఆర్సెనిక్, సీసం, కార్బన్ ఉన్నాయి.వీటిని నీటిలో నిమజ్జనం చేస్తే అవి విషపూరితం అవుతాయి. జలచరాలు ,వృక్షసంపదను చంపుతుంది. రసాయన రంగులతో అలర్జీ: ఈ రంగులు, మెరుపులు ఊపిరితిత్తులకు, కళ్లకు హాని కలిగిస్తాయి. వీటిని పీల్చినప్పుడు ఒక్కోసారి తీవ్రమైన ఆగ్నిలొచ్చే ప్రమాదం కూడా ఉంది.మట్టి గణపతే మహాగణపతిపురాణాల ప్రకారం వినాయకుడిని పార్వతీదేవి మేని నలుగు మట్టితోనే తయారు చేసిందట. అందుకే మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలతో పూజించడం మంచిది. . సహజ సిద్ధంగా పొలాల్లో లభించే బంక మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసుకోవాలి. ఇవి నీటిలో ఆరు గంటల్లో పూర్తిగా ,సులభంగా కరిగిపోతాయి, అటు పశు పశుపక్ష్యాదులకు, పంటలకు ఎలాంటి నష్టం ఉండదు. అలాగే సహజసిద్ధమైన చెట్ల ఆకులు, బెరడుతో తయారు చేసే రంగులను మట్టి బొమ్మలకు అద్ది మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు.తద్వారా పర్యావరణాన్ని రక్షించిన వారమవుతాం. అంతేకాదు, గణనాథుడిని పూజించే 21 రకాల పూజా పత్రి కూడా మట్టి నుంచే వస్తాయి కనుక మట్టిలో కలిసి, భూమిని సారవంతం చేస్తాయి.మట్టి గణపతినే ప్రతిష్టిద్దాం..జైబోలో గణేష్ మహారాజ్ కీ అంటూ నినదిద్దాం! తొలి పూజలందుకునే విఘ్న నాయకా ఈ సర్వజగత్తునూ కాపాడు తండ్రీ! అని మనసారా మొక్కుకుందాం! -
పర్యావరణ హితమే లక్ష్యంగా....
తిరుపతి రూరల్: పర్యావరణ హితమే లక్ష్యంగా..ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 1.24 లక్షల బంకమట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా చెవిరెడ్డి బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గురువారం తిరుచానూరు మార్కెట్ యార్డ్‌లో బంకమట్టి విగ్రహాల తయారీని ఆయన పరిశీలించారు. విగ్రహాల తయారీకి అవసరమైన బంకమట్టి మిశ్రమాన్ని కలపడంలో కుమ్మరి కార్మికులతో కలిసి పాలుపంచుకున్నారు. చెవిరెడ్డి మాట్లాడుతూ..చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఏటా, ప్రతి ఇంటికీ బంకమట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను పంపిణీతో పాటు పూజించేలా ప్రోత్సహించటం ఆనవాయితీగా వస్తోందన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 25 ప్రదేశాల్లో.. 7 వేల మంది కుమ్మరి కార్మికులు 25 రోజులుగా బంకమట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారని, 2,500 టన్నుల బంకమట్టిని ఉపయోగించినట్లు చెప్పారు. ప్రజలకు గణనాథుని పూజించే విధానంపై బుక్‌లెట్‌ను అందించనున్నట్లు తెలిపారు. 2వేల మంది వలటీర్లతో ఈ విగ్రహాలను ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. -
hyderabad: మట్టిగణపతుల తయారీ.. సగానికి తగ్గిన వ్యయం
సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ.3 కోట్ల విలువైన మట్టి గణపతుల విగ్రహాల తయారీని కేవలం పెద్ద ఏజెన్సీలకు కట్టబెట్టాలనుకున్న జీహెచ్ఎంసీ.. ‘సాక్షి’లో వెలువడిన కథనంతో దిగివచ్చి చిన్న సంస్థలకు సైతం అవకాశం కలిగేలా పిలిచిన రీటెండర్లలో ఆరు సంస్థలకు విగ్రహాల తయారీ, సరఫరా అవకాశం లభించింది. తప్పదన్నట్లుగా.. రీటెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ 8 అంగుళాల చిన్నవిగ్రహాల సంఖ్యను లక్ష తగ్గించింది. తొలి టెండరులో ఇవి 3.60 లక్షలు కావాలని పేర్కొనగా, రీటెండరు నోటిఫికేషన్లో అసలు ఎన్ని కావాలో పేర్కొనలేదు. టెండర్ల ఖరారు సమయంలో 2.60 లక్షలు చాలునని పేర్కొంది. దీని వెనుక మతలబేమిటో సంబంధిత అధికారులకే తెలియాలి. ఎటొచ్చీ తొలుత అంచనా వ్యయం రూ.3 కోట్లు కాగా, అంతిమంగా రూ. 1.54 కోట్లతో దాదాపు సగానికి తగ్గింది. ఒకే ఏజెన్సీకి కాకుండా ఎక్కువ సంస్థలు పాల్గొనేలా చేయడంతోపాటు ఎల్ 1 ధరకు ముందుకొచ్చే అందరికీ అవకాశం కల్పిస్తామనడంతో 6 సంస్థలు ఆ అవకాశాన్ని దక్కించుకున్నాయి. ఒక అడుగు విగ్రహాలకు ఒక్కో విగ్రహం అంచనా వ్యయం రూ.134 కాగా, టెండరులో రూ.130కి, ఒకటిన్నర అడుగు విగ్రహాలకు ఒక్కోదానికి అంచనా వ్యయం రూ. 349 కాగా, టెండరులో రూ.323లకు అప్పగించారు. 8 అంగుళాలవి అంచనా వ్యయం రూ.34.90 కాగా, టెండరులో రూ.31.90కి అప్పగించారు. చదవండి: గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక: కేసీఆర్ టెండర్లు పూర్తయిన విగ్రహాల వివరాలు ఒక అడుగువి: 30,000 అడుగున్నరవి: 10,000 8 అంగుళాలవి: 2,60,000 ►ఎల్ 1 రేట్లుగా వీటిని ఖరారు చేసి ఆరు సంస్థలకు అప్పగించారు. టెండర్లు దక్కించుకున్న సంస్థల్లో సనాతన ఆహార్ హస్తకళా ప్రైవేట్ లిమిటెడ్, జైగణేశ్ ఆర్ట్స్, స్వామి కన్స్ట్రక్షన్స్ అండ్ కాంట్రాక్టర్స్, ఆర్ట్ ఆఫ్ ఇండియా పాటరీస్, క్లే గణేశ స్టాట్యూస్ మాన్యుఫ్రాక్చరర్స్ సొసైటీలున్నాయి. విగ్రహాలన్నీ ప్రజలకు ఉచితంగా పంచేందుకు ఉద్దేశించినవే అయినప్పటికీ, 8 అంగుళాల విగ్రహాలు ఏకంగా లక్ష ఎందుకు తగ్గించుకున్నట్లో ఉన్నతాధికారులకే తెలియాలి. తొలుత అవసరానికి మించి టెండరు పిలిచారా.. లేక ఇంకేదైనా కారణముందా అన్నది అనుమానాలకు తావిస్తోంది. ఉచితంలోనూ ఔచిత్యం లేకపోవడం కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. -
గుండుపిన్నుపై మట్టి గణపతి విగ్రహాన్ని తయారుచేసిన దయాకర్
-
మట్టి గణపతిని పూజిద్దాం: కరోనా నిబంధనలు పాటిద్దాం!!
సాక్షి, హైదరాబాద్: మనమంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న బొజ్జ గణపయ్యను కొలిచే శుభతరుణం వచ్చేసింది. ముక్కోటి దేవతల్లో తొలి పూజలు అందుకొనే ఆది దేవుడు విఘ్ననాయకుడిని భక్తి శ్రద్దలతో కొలుచుకునే శుభదినం ఈరోజు. తరతమ భేదాలు లేకుండా కలిసికట్టుగా నిర్వహించుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో గణపతి బప్పా మోరియా మంగళ మూర్తి మోరియా నినాదాలు మారు మోగుతాయి. అయితే మనమందరం కొన్ని సంగతులను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ( మహాకాయ.. అభయమీయవయా!) మట్టిగణపతినే పూజిద్దాం! పర్యావరణాన్ని కాపాడుకుందాం!! కరోనా నిబంధనలు పాటిద్దాం! మనల్ని మనం కాపాడుకుందాం!! దయచేసి ప్రసాదాలను, ఇతర ఆహారాన్ని వృధా చేయకండి! గుప్పెడు మెతుకులు కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారికి దానం చేయండి!! మా ప్రియమైన పాఠకులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు!! చదవండి : Ganesh Chaturthi: గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే.. -
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవతి వేడుకలు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవతి వేడుకలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణేష్ మండపాలలో విఘ్నేశ్వరుడి విగ్రహాలను చూడ ముచ్చటగా అలంకరించారు. అనేక రూపాలలో విఘ్నేశ్వరుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పలు జిల్లాల్లో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని వినాయకుడిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. ఇక్కడ 59 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. దిల్షుక్ నగర్ చైతన్యపురిలో అయ్యప్ప భక్త సమాజ మండలి అధ్వర్యంలో ప్రతిష్టించిన కామదేను గణనాథుడు కనుల విందు చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు ప్రగతి రిసార్ట్‌లో ఏకో ఫ్రెండ్లీ వినాయక మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వినాయకచవతి ఉత్సవాల సందడి నెలకొంది. వాడవాడలా గణేష్ మండపాలు సిద్ధమయ్యాయి. విగ్రహాల తయారీలో రసాయనాల వాడకాన్ని నియంత్రించేందుకు దేవాలయాలు, స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను పంపిణీ చేశాయి. విజయనగరంలో స్పార్క్ సొసైటీ, కాలుష్య నియంత్రణ మండలి అధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విగ్రహాలను తీసుకున్నారు. కాలుష్యాన్ని నివారించేందుకే మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టినట్టు నిర్వహాకులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కాలుష్యానికి హానికలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వ్యతిరేకిస్తూ 27 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని తయారు చేశారు. ఇళ్లల్లో పూజించేందుకు మార్కెట్లో దొరికే మట్టి విగ్రహాల వైపే భక్తులు ఆసక్తి కనబరిచారు. పాలకొల్లులో రెల్లి యువజన సంఘం అధ్వర్యంలో 52 అడుగుల నాట్య గణపతిని నెలకొల్పొరు. ఖమ్మం జిల్లా పాల్వంచలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇండియన్ గ్రీన్ హెల్త్ సొసైటీ, మానస అకాడమీ స్వచ్చందసంస్థ అధ్యర్యంలో 5వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకోసం వినాయక ప్రతిమతో పాటు మొక్కలనూ పంపిణీ చేశారు. చాలా జిల్లాల్లో ప్రజలు పర్యావరణానికి హానికలిగించని మట్టి విగ్రహాల పట్ల ఆసక్తి కనబరచడం హర్షించదగ్గ విషయం.