గణనాధుని పూజించుకునేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగువారి తొలి పండుగ, ఆది దేవుడైన గణపతి తొమ్మిది రోజుల పాటు పూజలందుకోనున్నాడు. వినాయక చవితి వేడుకలకు వాడ వాడలూ వినాయక మండపాలతో సిద్ధమై పోతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఎక్కడ చూసినా బాల గణపయ్యు, బొజ్జ గణపయ్యలు రక రకాల ఆకారాల్లో, సైజుల్లో కొలువు దీరాయి. నవరాత్రి ఉత్సవాలకు మేం రెడీ.. రారమ్మంటూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. అయితే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మట్టి ప్రతిమలనే పూజించాలని పర్యావరణ పరిరక్షకులు, నిపుణులు సూచిస్తున్నారు. మట్టి గణపతే, మేలైన గణపతి అని నినదిస్తున్నారు. ఈ మేరకు పలు స్వచ్ఛంద సంస్థలు గత కొన్నేళ్లుగా ప్రచారాన్ని చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
వినాయక మండపాల్లో అందం, ఆకర్షణ కోసం రంగురంగుల భారీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకే చాలామంది మొగ్గు చూపుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప అనే ట్రెండ్ ఇటీవలి కాలంలో బాగా వ్యాపిస్తోంది. ఈ ధోరణే పర్యావరణానికి పెద్ద సమస్యగా మారుతోంది. నవరాత్రులు, భక్తితో పూజించడమే ప్రామాణికమని పండితులు సైతం చెబుతున్నారు. పంచభూతాల సమాహారమైన మట్టి గణపతిని పూజించడం అంటే పంచభూతాలు, అధిష్టాన దేవతలు పూజిస్తున్నామని అర్థమని పండితులు చెబుతున్నమాట. పర్యావరణహితంగా వేడుకలు నిర్వహిస్తే ప్రజలను, పర్యావరణాన్ని రక్షించుకున్న వారమవుతామని పిలుపునిస్తున్నారు.
పీఓపీ విగ్రహాలతో అన్నీ అనర్థాలే
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల ద్వారా పర్యావరణానికి తీరని ముప్పు అని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. విగ్రహాల అలంకరణకు వాడే రసాయన రంగులు మరింత ప్రమాదం కరమంటున్నారు. ఇవి నీటిని కలుషితం చేయడమే కాదు, అనేక రకాల రోగాలు మూలం అవుతాయి. రసాయ రంగులతో నిండిన విగ్రహాలు చెరువులు, వాగులు, నదుల్లో నిమజ్జనం చేస్తే అవి త్వరగా కరగవు. ఈ నీటిని తాగిన పశువులు, ఇతర జీవుల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. రసాయనాలు కలిసిన నీటితో నరాలపై ప్రభావం చూపి కేన్సర్ వ్యాధికి దారితీస్తుంది. అనేక చర్మవ్యాధులు సైతం వ్యాప్తి చెందుతాయి. ఈ నీరు పంట పొలాల్లో చేరితే భూసారం దెబ్బతింటుంది. ఆహార ఉత్పత్తులు కలుషితం అవుతాయి.
అంతేకాదు పూజకు వాడిన పువ్వులను కూడా వృధాగా కాలువల్లో పారవేయడం కాకుండా, రీసైకిల్ చేయడంగానీ, ఇతర ఉత్పత్తులను తయారు చేయడానికి వినియోగించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పీఓపీలో సల్ఫర్, జిప్సం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పదార్థాలు ఉంటాయి. రంగుల్లో పాదరసం, కాడ్మియం, ఆర్సెనిక్, సీసం, కార్బన్ ఉన్నాయి.వీటిని నీటిలో నిమజ్జనం చేస్తే అవి విషపూరితం అవుతాయి. జలచరాలు ,వృక్షసంపదను చంపుతుంది.
రసాయన రంగులతో అలర్జీ: ఈ రంగులు, మెరుపులు ఊపిరితిత్తులకు, కళ్లకు హాని కలిగిస్తాయి. వీటిని పీల్చినప్పుడు ఒక్కోసారి తీవ్రమైన ఆగ్నిలొచ్చే ప్రమాదం కూడా ఉంది.
మట్టి గణపతే మహాగణపతి
పురాణాల ప్రకారం వినాయకుడిని పార్వతీదేవి మేని నలుగు మట్టితోనే తయారు చేసిందట. అందుకే మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలతో పూజించడం మంచిది. . సహజ సిద్ధంగా పొలాల్లో లభించే బంక మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసుకోవాలి. ఇవి నీటిలో ఆరు గంటల్లో పూర్తిగా ,సులభంగా కరిగిపోతాయి, అటు పశు పశుపక్ష్యాదులకు, పంటలకు ఎలాంటి నష్టం ఉండదు. అలాగే సహజసిద్ధమైన చెట్ల ఆకులు, బెరడుతో తయారు చేసే రంగులను మట్టి బొమ్మలకు అద్ది మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు.తద్వారా పర్యావరణాన్ని రక్షించిన వారమవుతాం. అంతేకాదు, గణనాథుడిని పూజించే 21 రకాల పూజా పత్రి కూడా మట్టి నుంచే వస్తాయి కనుక మట్టిలో కలిసి, భూమిని సారవంతం చేస్తాయి.
మట్టి గణపతినే ప్రతిష్టిద్దాం..జైబోలో గణేష్ మహారాజ్ కీ అంటూ నినదిద్దాం! తొలి పూజలందుకునే విఘ్న నాయకా ఈ సర్వజగత్తునూ కాపాడు తండ్రీ! అని మనసారా మొక్కుకుందాం!
Comments
Please login to add a commentAdd a comment