వేడుకకు వేళాయె : గణనాథునికి తుది మెరుగులు దిద్దుతున్న మహిళ
సాక్షి, అనంతపురం డెస్క్: వినాయక చవితి పండుగ అంటే అందరిలోనూ ఉత్సాహం. వేడుకలను వైభవంగా, విభిన్నంగా, గత ఏడాదికి మించి చేయాలనే తపన. పండుగకు పది, పదిహేను రోజుల ముందు నుంచే ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. చందాల వసూలు, మంటపాల నిర్మాణం, డీజే, ఆర్కెస్ట్రా..ఇలా ప్రతి అంశంలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఒకప్పుడు వేడుకలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే జరిగేవి. నేడు గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాలకు ఏమాత్రమూ తీసిపోకుండా నిర్వహిస్తున్నారు.
యువోత్సాహం..కమిటీల సాయం
గత కొన్నేళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అనంతపురం నగరంతో పాటు తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, ధర్మవరం, కదిరి, హిందూపురం పట్టణాల్లో వేలాది విగ్రహాలు కొలువుదీరుతున్నాయి. వీటితో పాటు ద్వితీయశ్రేణి పట్టణాలు, మండల కేంద్రాలు, చివరకు మారుమూల పల్లెల్లో సైతం వీధివీధినా గణనాథులను కొలువుదీర్చి ఆరాధిస్తున్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఉత్సవ కమిటీలు, ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థలు వేడుకల నిర్వహణలో తగిన సహాయ సహకారాలు అందిస్తున్నాయి. పల్లెల్లో పూర్తిగా యువత ముందుండి నడిపిస్తున్నారు. చిన్నా పెద్ద, పేద, ధనిక, కుల, మతాలకు అతీతంగా అందరినీ వేడుకల్లో భాగస్వాములు చేస్తున్నారు.
సెలవు పెట్టి.. సందడి చేసి
బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో సాఫ్ట్‌వేర్, ఇతరత్రా రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువకులు వినాయక చవితి పండుగ సమయంలో కచ్చితంగా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఉద్యోగాలకు సెలవు పెట్టడమో, కుదరని పక్షంలో వర్క్ ఫ్రం హోం ఆప్షన్‌ను ఎంచుకుని పల్లెల్లో ప్రత్యక్షమవుతున్నారు. ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం ఇతరత్రా సందర్భాలను కాదనుకుని వినాయక చవితి సమయంలో మాత్రం సొంతూళ్లకు చేరుకుంటున్నారు. వీరంతా ముందుండి వేడుకలు నడిపిస్తున్నారు. వీరి ఉత్సాహాన్ని చూసి స్థానికులు కూడా ప్రోత్సహించడంతో పాటు వేడుకల్లో భాగస్వాములవుతున్నారు.
ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పల్లెల్లో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు వెలుస్తున్నాయి. వీటిలో పది, పదిహేను రోజుల ముందు నుంచే చర్చ మొదలవుతోంది. చందాల వివరాలు, వేడుకలకు చేస్తున్న ఏర్పాట్లు, ఎవరెవరు ఏయే సహకారం అందిస్తున్నారన్న సమాచారాన్ని అందులో షేర్ చేస్తున్నారు. మంటపాల వద్ద సందడి, నిమజ్జనోత్సవ దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించి వీడియోలు, ఫొటోలను వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు. తద్వారా ఇతర ప్రాంతాల్లో ఉంటూ అనివార్య కారణాల వల్ల ఊళ్లకు రాలేకపోతున్న వారికి కూడా ఆనందాన్ని పంచుతున్నారు.
సామాజిక బాధ్యత మరవొద్దు..
పట్టణాలతో పాటు పల్లెల్లోనూ గణేశ్ వేడుకలు వైభవంగా నిర్వహిస్తుండడం శుభ పరిణామం. ఇది ఐక్యతకు, సామరస్యానికి దోహదపడుతోంది. కానీ ఇందులో సామాజిక బాధ్యతనూ విస్మరించరాదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయి. జలచరాలకు ప్రమాదం ఏర్పడుతోంది. మనుషులకూ కాలుష్యపు పోటు తప్పడం లేదు. కావున ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఆలోచించి మట్టి గణపయ్యలను ఆరాధించాల్సిన అవసరముంది. అప్పుడు మాత్రమే ఈ వేడుకలకు అర్థం, పరమార్థం ఉంటుంది. గణనాథుని చల్లని దీవెనలూ దక్కుతాయి.
మట్టి గణపతే శ్రేష్టం
జడ పదార్థమైన భూమి.. చైతన్యం కలిగిన నీళ్లతో చేరినప్పుడు ప్రాణ శక్తి కలుగుతుంది. తద్వారా ఆహార పదార్థాలు, ఔషధులను మనకు అందిస్తుంది. ప్రాణధార, జడశక్తుల కలయికతో సృష్టి ముందుకు సాగుతున్నదన్న సంగతిని చెప్పడానికే గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారు చేసి, పూజించే విధానం ఏర్పడింది. మట్టి విగ్రహాలనే పూజించమని శాస్త్రమే ఉద్బోధిస్తున్నది. వాతావరణ కాలుష్యం కాకుండా మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయి. కావున ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే ఆరాధించాలి.
– మహేశ్వర శర్మ, శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు
Comments
Please login to add a commentAdd a comment