మహిళలు భద్రంగా ఉండే సమాజాన్ని నిర్మిద్దాం
● కలెక్టర్ వినోద్ కుమార్
అనంతపురం ఎడ్యుకేషన్: మహిళలు భద్రంగా ఉండే సమాజాన్ని నిర్మిద్దామని కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. మహిళలు, బాలికల భద్రత, స్వీయరక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అనంత ఆత్మరక్షణ’ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక శ్రీకృష్ణదేవరాయ నగరపాలక ఉన్నత పాఠ శాలలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీయరక్షణ ద్వారా విద్యార్థినులు, మహిళలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారన్నారు. జిల్లాలోని 495 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో 6–9 తరగతులు చదువుతున్న 45,640 మంది విద్యార్థినులకు ఆత్మరక్షణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థినులకే కాకుండా మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లులను కూడా భాగస్వాములను చేయాలని నిర్వాహకులకు సూచించారు. వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు పీటీఐలు విధిగా హాజరుకావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఆత్మరక్షణ, మానసిక ధైర్యం తదితర అంశాలపై విద్యార్థినులు, యువతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ మాట్లాడుతూ విద్యార్థుల పరీక్షల సన్నద్ధతకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా సజావుగా కార్యక్రమాలను పూర్తిచేసేలా ఇన్‌స్ట్రక్టర్లతో ప్రధానోపాధ్యాయులు సహకరించి కార్యక్రమం విజయ వంతం అయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటస్వామి, తహసీల్దార్ హరి కుమార్, సమగ్ర శిక్ష సీఎంఓ గోపాలకృష్ణ, ఏఎంఓ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment