యాప్‌సోపాలు
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సాంకేతిక సమస్యలు చుట్టుముట్టాయి. వారం రోజులుగా అగ్రీస్టాక్ యాప్ సక్రమంగా పనిచేయడం లేదు. 72 వేల రిజిస్ట్రేషన్ల దగ్గర ఆగిపోయింది. త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది ‘యాప్’సోపాలు పడుతున్నారు. అత్యధికంగా పెద్దవడుగూరు మండలంలో 7,663 మంది రైతుల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఆ తర్వాత గుంతకల్లులో 6,997, గుత్తిలో 6,614, తాడిపత్రిలో 5,972, కణేకల్లులో 5,761, విడపనకల్లులో 5,714, రాయదుర్గంలో 5,047 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ మండలాల్లో పరిస్థితి బాగానే ఉన్నా... మిగతా మండలాల్లో సాంకేతిక సమస్య అధికం కావడంతో ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కుందుర్పి మండలంలో అత్యల్పంగా కేవలం 359 మందివి పూర్తయ్యాయి. శెట్టూరు మండలంలో 382, వజ్రకరూరు–400, కళ్యాణదుర్గం–424, బెళుగుప్ప– 440, కంబదూరు–503, ఆత్మకూరు–510, బ్రహ్మసముద్రం– 537, శింగనమల–540, ఉరవకొండ–558, అనంతపురం–594... ఇలా రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మందగించిపోయింది.
పరిష్కారం దొరక్క దిక్కులు..
సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ఎన్‌ఐసీ అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఈ క్రమంలోనే రిజిస్ట్రీ ద్వారా యూనిక్ నంబర్ల కేటాయింపు వేగవంతం చేయాలంటూ వ్యవసాయశాఖ అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు, ఏఈఓలు, ఏఓలు దిక్కులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. రైతు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, వాటికి అనుసంధానం అయిన మొబైల్ నంబరు ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రైతుకు 11 నంబర్లతో కూడిన ఐడీ నంబరు కేటాయిస్తున్నారు. ఇందుకు మూడు సార్లు ఓటీపీ సక్సెస్ కావాలి. చాలా వరకు రెండు ఓటీపీలు సక్సెస్ అవుతున్నా, మూడోది కాక ప్రక్రియ నిలిచిపోతున్నట్లు ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు చెబుతున్నారు.
ఇబ్బంది పడుతున్న రైతులు..
విశిష్ట సంఖ్య లేకుంటే ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, పావలావడ్డీ, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, యాంత్రీకరణ, రాయితీ విత్తనాలు, పంట ఉత్పత్తుల అమ్మకాలు తదితర ప్రభుత్వ ఫలాలు వర్తించే పరిస్థితి ఉండదని మెలిక పెట్టడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. కూటమి ప్రభుత్వం కొర్రీలు వేయడానికి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో రైతులకు నయా పైసా విదిలించ కుండా మోసం చేసిన సీఎం చంద్రబాబు.. వచ్చే సంవత్సరంలో సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరకుండా రిజిస్ట్రేషన్ల కార్యక్రమానికి తెరతీశారనే ఆరోపణలున్నాయి.
సక్రమంగా పనిచేయని అగ్రీస్టాక్ యాప్
72 వేల దగ్గర ఆగిపోయిన రైతు రిజిస్ట్రేషన్లు
దిక్కులు చూస్తున్న సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment