ప్రశాంతంగా సీనియర్ ఇంటర్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా సోమవారం సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు లాంగ్వేజ్–2 పరీక్షకు 21,952 మంది విద్యార్థులకు గాను 377 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 20,183 మందికి 19,849 మంది హాజరయ్యారు. 334 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,769 మందికి 1,726 మంది హాజరు కాగా, 43 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్ వెంకటరమణనాయక్ 6 కేంద్రాలు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 4, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు 10, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 16, కస్టోడియన్లు 13 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెంకటరమణనాయక్ వెల్లడించారు.
ప్రజాభిప్రాయం
లేకుండా ముందుకెళ్లొద్దు
● కలెక్టర్ వినోద్‌కుమార్‌కు
శనగలగూడూరు రైతుల వినతి
పుట్లూరు: ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించకుండా బోరుబావులు తవ్వరాదని, అలా కాదని ముందుకెళ్తే కచ్చితంగా అడ్డుకుంటా మని శనగలగూడూరు రైతులు తెలిపారు. ఈ మేరకు సోమవారం గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్ వినోద్‌కుమార్‌కు వినతి పత్రం అందించారు. రెండేళ్ల క్రితం ఓఎన్‌జీసీ అధికారులు చమురు, సహజ వాయువుల అన్వేషణ కోసం సర్వే చేపట్టారన్నారు. 2024 అక్టోబర్‌లో సి. వెంగన్నపల్లి గ్రామంలో సోలార్ లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు శనగలగూడూరులో దాదాపు 10 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారన్నారు. బోరుబావులు తవ్వితే భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పాటు కాలుష్యం పెరిగే అవకాశం ఉందన్నారు. కనీసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా క్షేత్ర స్థాయిలో పనులను ప్రారంభిస్తే భవిష్యత్తులో నష్టం కల్గుతుందని వాపోయారు. ఈ విషయాలపై స్పష్టత ఇవ్వకుండా పనులను చేపట్టరాదన్నారు. కార్యక్రమంలో శనగలగూడూరు రైతులు జయరామిరెడ్డి, నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గోపాల్‌రెడ్డి, అమర్, వీరారెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘టీచర్ల సీనియార్టీ’పై
అభ్యంతరాల స్వీకరణ
● 10 వరకూ గడువు
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపాలిటీ, నగరపాలక సంస్థ పరిధిలోని స్కూళ్లలో పని చేస్తున్న హెచ్‌ఎంలు, టీచర్ల సాధారణ సీనియార్టీ జాబితాను తయారు చేశారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టిస్) ఆధారంగా రూపొందించిన జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్ (బ్లాగ్)లో ఉంచినట్లు డీఈఓ ఎం. ప్రసాద్‌బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా ఆధారాలతో జిల్లా సైన్స్ సెంటర్‌లో అందజేయాలని సూచించారు. టీచరు పూర్తిపేరు, ఐడీ, పదవి తదితర వివరాలు ఉండాలన్నారు. అభ్యంతరం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలన్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోరని, కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
పాల డెయిరీలో తనిఖీలు
యాడికి: ఎలాంటి అనుమతులు లేకుండా యాడికిలో నిర్వహిస్తున్న పాల డెయిరీని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రామచంద్ర సోమవారం తనిఖీ చేశారు. యాడికి నివాసి అమరనాథరెడ్డి గత కొన్నేళ్లుగా డెయిరీ నిర్వహిస్తూ పాలు, పెరుగు, నెయ్యి విక్రయాలతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రామచంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. పాలు, పెరుగు, నెయ్యి నాణ్యతను పరిశీలించారు. కొన్ని శాంపిల్స్ సేకరించి ప్రయోగశాలకు పంపారు. కాగా, అమరనాథరెడ్డి నిర్వహిస్తున్న పాల డెయిరీకి లైసెన్స్ లేకపోవడంతో వెంటనే అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. డెయిరీలో ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీలు చేపట్టారనే విషయం తెలియగానే మండల కేంద్రంలోని పలు డెయిరీలతో పాటు హోటళ్లను నిర్వాహకులు మూసి, అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం.
ప్రశాంతంగా సీనియర్ ఇంటర్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment