![Help a Young Girl Stay with Grandmother after her parents wants her to sold](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/11.jpg.webp?itok=7lFh1qO-)
ఆడపిల్లగా పుట్టడమే ఆ చిట్టి తల్లి చేసుకున్న పాపం
అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు
దారుణాన్ని ఎదురించి అండగా నిలిచిన నాన్నమ్మ
చిన్నారిని ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
తల్లి ఒడిలో ఓలలాడాల్సిన చంటి’పాప’.. అంగట్లో సరుకుగా మారింది. ఆడపిల్లగా పుట్టడమే పాపమన్నట్లు కన్నతల్లిదండ్రులే చిన్నచూపు చూశారు. కుటుంబం గడవని స్థితిలో చిన్నారిని అమ్మకానికి పెట్టారు. మానవత్వానికి మాయని మచ్ఛగా ఈ ఘటన నిలవకుండా చిన్నారిని అక్కున చేర్చుకుంది నాన్నమ్మ. అయినా పసికందును కష్టాలు వీడడం లేదు. తాను రాలిపోయేలోపు ఆ చిన్నారికి ఏదైనా ఆదరవు చూపాలని ఒంటరి పోరు సాగిస్తున్న పండుటాకు ఆశిస్తోంది. ఆ దిశగా మానవతావాదులు స్పందించాలని వేడుకుంటోంది.
అనంతపురం కల్చరల్: సాంకేతికత ఎన్ని కొత్త పుంతలు తొక్కినా ఆడపిల్ల జీవితం ఇంకా మధ్య యుగ భావజాలంలోనే కొట్టుమిట్టాడుతోంది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియగానే గర్భస్థ దశలోనే చిదిమేస్తున్నారు కొందరు. పుట్టిన తర్వాత రోడ్డు పాలు చేస్తున్నారు మరికొందరు. ‘ఆడ పిల్ల ఇంటికి దీపం’.. ‘ఆడపిల్లను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం, బతకనిద్దాం’, ‘బేటీ బచావో... బేటీ పడావో’ నినాదాలు కేవలం రాత‘కోతల’కే తప్ప ఆచరణలో ఏ మాత్రమూ కనిపించడం లేదనేందుకు నిదర్శనంగా నిలిచిన ఘటన జిల్లా కేంద్రం అనంతపురంలో వెలుగు చూసింది. యాంత్రిక జీవనంలో సాటి మనిషి గురించి ఆలోచించడమే మానేసిన నేటితరం రోజూ తమ కంటి ముందే కనిపిస్తున్న ఈ దయనీయ చిత్రాన్ని గమనించలేకపోతోంది.
కన్నపేగునే కాదనుకున్నారు
అనంతపురం నగరంలోని పాతూరు మున్నానగర్‌లో నివాసముంటున్న వెంకటలక్ష్మి, బ్రహ్మయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పాతికేళ్ల క్రితం బ్రహ్మయ్య మృతిచెందాడు. ఆ సమయంలో కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్న వెంకటలక్ష్మి ఊరూరా తిరిగి రెడీమేడ్ దుస్తులు విక్రయిస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. అందరికీ పెళ్లిళ్లు అయిన తర్వాత ఎవరి స్వార్థం వారు చూసుకుని తలో దారికి వెళ్లిపోయారు. కన్నతల్లి వీధి పాలైంది. చిన్న కొడుకుకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఈ క్రమంలో రెండోసారి కొడుకు పుడతాడన్న ఆశతో ఉన్న వారికి భంగపాటు తప్పలేదు.
రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టేసరికి విపరీతమైన ద్వేషంతో నెలల పసికందును అమ్మేయడానికి తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నాన్నమ్మ వెంకటలక్ష్మి రగిలిపోయింది. కుమారుడు, కోడలు నిర్ణయాన్ని కాదని పోలీసుల సాయంతో మనవరాలి పోషణ భారాన్ని తీసుకుంది. చిన్నారికి కీర్తి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఈ క్రమంలో వయస్సు మీదపడుతుండడంతో తాను కాలం చేసేలోపు చిన్నారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశిస్తోంది. ఆస్తిపాస్తులేమీ లేక బొరుగుల బండిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆమె ఆశ కలగా మిగిలిపోకుండా మానవతావాదులు స్పందించాలని వేడుకుంటోంది.
ఆడబిడ్డను ఆదుకోండయ్యా
‘అయ్యా నా జీవితం ముగిసిపోతోంది. ముగ్గురు కొడుకులు పుడితే వారెవరికీ నా బాగోగులు పట్టలేదు. ఒక్కగానొక్క కుమార్తెను రాజు అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తే ఆయన ఊరంతా అప్పులు చేసి భార్యను వదిలేసి వెళ్లిపోయాడు. నా పరిస్థితి చూసి జాలిపడి బ్యాంకు వాళ్లు బొరుగుల బండి పెట్టించారు. డీఈఓ ఆఫీసు పక్క సందులో సోనోవిజన్ కింద బొరుగులమ్ముకుంటూ బతుకుతున్నా. ఈ పాప (మనవరాలు కీర్తి)ను రోడ్డుపాలు చేసి వెళ్లిపోయిన వారు నా బిడ్డలంటే నాకే అసహస్యంగా ఉంది.
‘సుప్రీం’ ఆదేశాలు.. తల్లి వద్దే అతుల్ సుభాష్ కుమారుడు!
ఇప్పటికైతే పాపను కంటికి రెప్పలా చూసుకుంటున్నా. నా తర్వాత పాపకు ఎలాంటి కష్టం రాకూడదని ఆ దేవుడికి మొక్కుకుంటున్నా. చుట్టుపక్కల వాళ్లు పాపకు పాలో, తిండో ఇచ్చిపోతుంటారు. పాప పెరిగి పెద్దయి బాగా చదువుకుని జీవితంలో స్థిరపడేలా దాతలు కనికరిస్తే చాలు. సాయం చేయండయ్యా. మీ సాయం వృధా కాకుండా బ్యాంక్‌లో పాప పేరున ఫిక్స్డ్ డిపాజిట్టు చేయిస్తా. లేదా మీరే చేయించండి.’
– వెంకటలక్ష్మి, చిన్నారి నాన్నమ్మ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment