సాక్షి, విజయవాడ: ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నూజివీడు బాధిత బాలికను ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి మంగళవారం పరామర్శించారు. నూజివీడు మండలం పల్లెర్లమూడికి చెందిన నాలుగేళ్ల బాలిక పై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి యత్నించిన సంగతి తెలిసిందే. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించామని గజ్జల వెంకటలక్ష్మి తెలిపారు. అలాగే.. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందేలా చూస్తామని హామీచ్చారామె.
‘‘ఊయలలో వేసిన నెలల బిడ్డను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. తూతూ మంత్రంగా కేసులు పెట్టడం వల్ల నిందితులు నెలరోజుల్లోనే బెయిల్‌పై బయటికి వచ్చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. వరకట్న వేధింపులు , అత్యాచారాలు, దాడులు, ఫోక్సో కేసులు పెరిగిపోయాయి. మహిళలు బతకాలంటేనే భయపడిపోతున్నారు‘‘ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ పేర్కొన్నారు.
‘‘ప్రతీ కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుంది. దిశ ద్వారా వచ్చిన కేసుల్లో కూడా త్వరగా శిక్ష పడేలా చేశాం. రమ్య హత్య కేసులో వేగంగా ఛార్జిషీట్ వేయించి.. నిందితుడికి శిక్ష పడేలా చేయగలిగాం. నెల్లూరులో విదేశీ యువతిని వేధించిన కేసులో దిశా యాప్ ద్వారా రక్షించగలిగాం. రాజకీయాలకు అతీతంగా ప్రతీ కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుంది..
.. ఎస్పీలకు యాక్షన్ టేకెన్ కోసం పంపిస్తున్నాము. పోలీసులకు ఏం ఇబ్బందులున్నాయో తెలియడం లేదు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. మహిళా కమిషన్ ప్రతీ మహిళకు భద్రత కల్పించేందుకు పనిచేస్తుంది. దిశ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలకు రక్షణ కల్పించాం‘‘ అని గజ్జల వెంకటలక్ష్మి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment