helping baby
-
కీర్తి కథ.. కన్నీటి వ్యథ
తల్లి ఒడిలో ఓలలాడాల్సిన చంటి’పాప’.. అంగట్లో సరుకుగా మారింది. ఆడపిల్లగా పుట్టడమే పాపమన్నట్లు కన్నతల్లిదండ్రులే చిన్నచూపు చూశారు. కుటుంబం గడవని స్థితిలో చిన్నారిని అమ్మకానికి పెట్టారు. మానవత్వానికి మాయని మచ్ఛగా ఈ ఘటన నిలవకుండా చిన్నారిని అక్కున చేర్చుకుంది నాన్నమ్మ. అయినా పసికందును కష్టాలు వీడడం లేదు. తాను రాలిపోయేలోపు ఆ చిన్నారికి ఏదైనా ఆదరవు చూపాలని ఒంటరి పోరు సాగిస్తున్న పండుటాకు ఆశిస్తోంది. ఆ దిశగా మానవతావాదులు స్పందించాలని వేడుకుంటోంది. అనంతపురం కల్చరల్: సాంకేతికత ఎన్ని కొత్త పుంతలు తొక్కినా ఆడపిల్ల జీవితం ఇంకా మధ్య యుగ భావజాలంలోనే కొట్టుమిట్టాడుతోంది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియగానే గర్భస్థ దశలోనే చిదిమేస్తున్నారు కొందరు. పుట్టిన తర్వాత రోడ్డు పాలు చేస్తున్నారు మరికొందరు. ‘ఆడ పిల్ల ఇంటికి దీపం’.. ‘ఆడపిల్లను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం, బతకనిద్దాం’, ‘బేటీ బచావో... బేటీ పడావో’ నినాదాలు కేవలం రాత‘కోతల’కే తప్ప ఆచరణలో ఏ మాత్రమూ కనిపించడం లేదనేందుకు నిదర్శనంగా నిలిచిన ఘటన జిల్లా కేంద్రం అనంతపురంలో వెలుగు చూసింది. యాంత్రిక జీవనంలో సాటి మనిషి గురించి ఆలోచించడమే మానేసిన నేటితరం రోజూ తమ కంటి ముందే కనిపిస్తున్న ఈ దయనీయ చిత్రాన్ని గమనించలేకపోతోంది. కన్నపేగునే కాదనుకున్నారు అనంతపురం నగరంలోని పాతూరు మున్నానగర్‌లో నివాసముంటున్న వెంకటలక్ష్మి, బ్రహ్మయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పాతికేళ్ల క్రితం బ్రహ్మయ్య మృతిచెందాడు. ఆ సమయంలో కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్న వెంకటలక్ష్మి ఊరూరా తిరిగి రెడీమేడ్ దుస్తులు విక్రయిస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. అందరికీ పెళ్లిళ్లు అయిన తర్వాత ఎవరి స్వార్థం వారు చూసుకుని తలో దారికి వెళ్లిపోయారు. కన్నతల్లి వీధి పాలైంది. చిన్న కొడుకుకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఈ క్రమంలో రెండోసారి కొడుకు పుడతాడన్న ఆశతో ఉన్న వారికి భంగపాటు తప్పలేదు. రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టేసరికి విపరీతమైన ద్వేషంతో నెలల పసికందును అమ్మేయడానికి తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నాన్నమ్మ వెంకటలక్ష్మి రగిలిపోయింది. కుమారుడు, కోడలు నిర్ణయాన్ని కాదని పోలీసుల సాయంతో మనవరాలి పోషణ భారాన్ని తీసుకుంది. చిన్నారికి కీర్తి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఈ క్రమంలో వయస్సు మీదపడుతుండడంతో తాను కాలం చేసేలోపు చిన్నారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశిస్తోంది. ఆస్తిపాస్తులేమీ లేక బొరుగుల బండిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆమె ఆశ కలగా మిగిలిపోకుండా మానవతావాదులు స్పందించాలని వేడుకుంటోంది. ఆడబిడ్డను ఆదుకోండయ్యా ‘అయ్యా నా జీవితం ముగిసిపోతోంది. ముగ్గురు కొడుకులు పుడితే వారెవరికీ నా బాగోగులు పట్టలేదు. ఒక్కగానొక్క కుమార్తెను రాజు అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తే ఆయన ఊరంతా అప్పులు చేసి భార్యను వదిలేసి వెళ్లిపోయాడు. నా పరిస్థితి చూసి జాలిపడి బ్యాంకు వాళ్లు బొరుగుల బండి పెట్టించారు. డీఈఓ ఆఫీసు పక్క సందులో సోనోవిజన్ కింద బొరుగులమ్ముకుంటూ బతుకుతున్నా. ఈ పాప (మనవరాలు కీర్తి)ను రోడ్డుపాలు చేసి వెళ్లిపోయిన వారు నా బిడ్డలంటే నాకే అసహస్యంగా ఉంది. ‘సుప్రీం’ ఆదేశాలు.. తల్లి వద్దే అతుల్ సుభాష్ కుమారుడు!ఇప్పటికైతే పాపను కంటికి రెప్పలా చూసుకుంటున్నా. నా తర్వాత పాపకు ఎలాంటి కష్టం రాకూడదని ఆ దేవుడికి మొక్కుకుంటున్నా. చుట్టుపక్కల వాళ్లు పాపకు పాలో, తిండో ఇచ్చిపోతుంటారు. పాప పెరిగి పెద్దయి బాగా చదువుకుని జీవితంలో స్థిరపడేలా దాతలు కనికరిస్తే చాలు. సాయం చేయండయ్యా. మీ సాయం వృధా కాకుండా బ్యాంక్‌లో పాప పేరున ఫిక్స్డ్ డిపాజిట్టు చేయిస్తా. లేదా మీరే చేయించండి.’ – వెంకటలక్ష్మి, చిన్నారి నాన్నమ్మ, అనంతపురం -
డెంగీతో.. 'పసి హృదయం' విలవిల..! ఆదుకోవాలంటూ కన్నోళ్ల వేదన..!!
మహబూబాబాద్: ఓ పసి హృదయం విష జర్వంతో విలవిలాడుతోంది. పట్టుమని పది నెలలు కూడా నిండని ఆ శిశువును డెంగీ మహమ్మారి ఆవహించింది. వాంతులు, విరోచనాలతో చుట్టుముట్టింది. దీనికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. చిన్నారిని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఎక్కడా తగ్గలేదు. వైద్యుల సూచన మేరకు చివరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రోజుకు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తూ చిన్నారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై దాతలు స్పందించి ఆర్థిక చేయూతనందించాలని వారు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ముల్కనూరు గ్రామ పంచాయతీ పరిధి దుబ్బగూడెం గ్రామానికి చెందిన చిన్నారి తోటకూర బాలకృష్ణ, లలిత దంపతుల 9 నెలల పాప ప్రణిద ఉంది. ఈ క్రమంలో ప్రణితకు ఈనెల 13న జ్వరం రావడంతో బయ్యారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ జ్వరం తగ్గకపోవడంతో 14వ తేదీన ఖమ్మంలోని జాబిల్లి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఖమ్మంలో కూడా జ్వరం తగ్గకపోగా, వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో అక్కడి వైద్యులు ఈనెల 17న హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రికి రెఫర్ చేయగా చిన్నారిని అక్కడికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే వైద్యఖర్చుల రోజుకు రూ.2 లక్షలు అవుతుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీనిపై దాతలు స్పందించి 9949803665 నంబర్‌కు ఫోన్ పే చేసి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాగా, దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ముల్కనూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో బుధవారం దుబ్బగూడెంలో వైద్యశిబిరం నిర్వహించారు. -
ఓ తండ్రికి ఫేస్బుక్ క్షమాపణలు!
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ఓ తండ్రికి క్షమాపణలు చెప్పింది. రెండు నెలల వయసున్న తన కొడుకు గుండె మార్పిడి ఆపరేషన్ కోసం ప్రజల నుంచి విరాళాలు కోరుతూ ఒక ప్రకటన ఇస్తానంటే.. ఫేస్బుక్ తొలుత నిరాకరించింది. హడ్సన్ బాండ్ అనే ఆ బాలుడికి పుట్టుకతోనే కార్డియోమయోపతి అనే సమస్య వచ్చింది. దాని చికిత్సకు దాదాపు 45 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఆ మొత్తం సేకరించడానికి ఆస్పత్రి బెడ్ మీద ఉన్న తన కొడుకు ఫొటోతో ఒక ప్రకటన ఇవ్వాలని బాండ్ తల్లిదండ్రులు ఫేస్‌బుక్‌ను కోరారు. అయితే ఆ ఫొటో బాగా భయపెట్టేలా, రక్తసిక్తంగా ఉందని, దానివల్ల ప్రతికూల స్పందనలు వస్తాయంటూ ప్రకటన ఇవ్వడానికి ఫేస్బుక్ నిరాకరించింది. ప్రమాదాలు, కారు ఢీకొన్నవి, మృతుల ఫొటోలు, బాగా పాడైన శవాలు, దెయ్యాలు, రక్తపిశాచుల ఫొటోలను తమ సైట్లో ప్రచురించడానికి అంగీకరించేది లేదని కూడా ఆ సమాధానంలో పేర్కొంది. ఆ తర్వాత మొత్తానికి అసలు విషయం తెలుసుకుని, బాండ్ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి.. ఆ ఫొటోను పోస్ట్ చేయడానికి అంగీకరించింది. తమకు కలిగిన అసౌకర్యానికి ఆ తర్వాత క్షమాపణ కూడా చెప్పారని బాలుడి తండ్రి కెవిన్ బాండ్ తెలిపారు. ఇప్పటివరకు ఆ ప్రకటన ద్వారా రూ. 18,25,350 విరాళాలు వచ్చాయి. బాండ్ పేరిట రిస్ట్ బ్యాండ్లు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఐదేసి డాలర్ల చొప్పున పెట్టి.. ఈ విరాళాలు సేకరిస్తున్నారు.