ఓ తండ్రికి ఫేస్బుక్ క్షమాపణలు!
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ఓ తండ్రికి క్షమాపణలు చెప్పింది. రెండు నెలల వయసున్న తన కొడుకు గుండె మార్పిడి ఆపరేషన్ కోసం ప్రజల నుంచి విరాళాలు కోరుతూ ఒక ప్రకటన ఇస్తానంటే.. ఫేస్బుక్ తొలుత నిరాకరించింది. హడ్సన్ బాండ్ అనే ఆ బాలుడికి పుట్టుకతోనే కార్డియోమయోపతి అనే సమస్య వచ్చింది. దాని చికిత్సకు దాదాపు 45 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఆ మొత్తం సేకరించడానికి ఆస్పత్రి బెడ్ మీద ఉన్న తన కొడుకు ఫొటోతో ఒక ప్రకటన ఇవ్వాలని బాండ్ తల్లిదండ్రులు ఫేస్బుక్ను కోరారు. అయితే ఆ ఫొటో బాగా భయపెట్టేలా, రక్తసిక్తంగా ఉందని, దానివల్ల ప్రతికూల స్పందనలు వస్తాయంటూ ప్రకటన ఇవ్వడానికి ఫేస్బుక్ నిరాకరించింది.
ప్రమాదాలు, కారు ఢీకొన్నవి, మృతుల ఫొటోలు, బాగా పాడైన శవాలు, దెయ్యాలు, రక్తపిశాచుల ఫొటోలను తమ సైట్లో ప్రచురించడానికి అంగీకరించేది లేదని కూడా ఆ సమాధానంలో పేర్కొంది. ఆ తర్వాత మొత్తానికి అసలు విషయం తెలుసుకుని, బాండ్ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి.. ఆ ఫొటోను పోస్ట్ చేయడానికి అంగీకరించింది. తమకు కలిగిన అసౌకర్యానికి ఆ తర్వాత క్షమాపణ కూడా చెప్పారని బాలుడి తండ్రి కెవిన్ బాండ్ తెలిపారు. ఇప్పటివరకు ఆ ప్రకటన ద్వారా రూ. 18,25,350 విరాళాలు వచ్చాయి. బాండ్ పేరిట రిస్ట్ బ్యాండ్లు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఐదేసి డాలర్ల చొప్పున పెట్టి.. ఈ విరాళాలు సేకరిస్తున్నారు.