చైర్‌పర్సన్, సభ్యులకు వేతనాలు నిలిపివేత
టీఏ, డీఏలు, ఆఫీస్ నిర్వహణ ఖర్చులూ ఇవ్వకుండా ఇబ్బందులు
వేతనాలు అడిగితే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అధికారులతో సలహాలు
మిమ్మల్ని ఉండనివ్వరంటూ ఓ అధికారి బెదిరింపు
కమిషన్ ఆదేశాలనుపట్టించుకోని అధికారులు
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వెంకటలక్ష్మి
మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికీ ఫిర్యాదు
న్యాయ పోరాటానికీ సిద్ధమని వెల్లడి
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కూటమి ప్రభుత్వం కక్షకట్టింది. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధంగా నియమితులైన పలు కమిషన్ల చైర్‌పర్సన్లు, సభ్యులను వేధింపులకు గురి చేస్తోంది. వారికి వేతనాలు, టీఏ, డీఏలు నిలిపివేసింది. కనీసం కార్యాలయ నిర్వహణ ఖర్చులూ ఇవ్వడంలేదు. వేతనాలు, టీఏ, డీఏ, నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని కోరితే రాజీనామా చేసి వెళ్లిపోవడం మంచిదని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ అధికారులతో చెప్పిస్తోంది.
చివరకు మహిళలకు రక్షణగా నిలిచే మహిళా కమిషన్‌ను సైతం ఇదే విధంగా కక్షపూరితంగా వేధిస్తోంది. దీంతో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాష్ట్ర గవర్నర్‌కు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికీ ఫిర్యాదు చేశారు. చైర్‌పర్సన్లు, సభ్యులు రాజీనామా చేసి వెళ్లిపోతే, ఆ స్థానాల్లో తమ వారికి పదవులు కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుయుక్తులకు పాల్పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పదవీకాలం 2026 మార్చి వరకు ఉంది. అయితే, గత నాలుగు నెలల వేతన బకాయిలను కోరినా ప్రభుత్వం చెల్లించడంలేదు. సభ్యులకు ఒక నెల వేతనాన్ని నిలిపివేసింది. ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. కమిషన్ చైర్‌పర్సన్, సభ్యులు విశాఖపట్నం, నర్సీపట్నం, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచేలా చర్యలు చేట్టారు. ఈ పర్యటనల టీఏ, డీఏలు విడుదల చేయకుండా ప్రభుత్వం కక్ష సాధిస్తోంది.
మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి నిర్వహణ ఖర్చులూ నిలిపివేసింది. దీంతో ఆఫీస్ నిర్వహణ, టీఏ, డీఏలు సైతం కమిషన్ చైర్‌పర్సన్ సొంతంగా పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలకు గురైన ఘటనల్లో బాధితులను ఆదుకోవలంటూ కమిషన్ ఇస్తున్న ఆదేశాలను సైతం అధికారులు, పలు జిల్లాల ఎస్పీలు బేఖాతరు చేస్తున్నారు. ఎస్పీలు కనీసం యాక్షన్ టేకెన్ రిపోర్టులు కూడా పంపించడంలేదు.
కమిషన్లకు వేతనాలు ఆపాలంటూ సీఎం ఆదేశాలు
రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా గత ప్రభుత్వం నియమించిన అనేక కమిషన్లకు నెలవారీ ఇచ్చే గౌరవ వేతనాలను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అదేశాలు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్, మైనార్టీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఆర్టీఐ కమిషన్ వంటి వాటికి ఈ నెలలో గౌరవ వేతనాలు, టీఏ, డీఏలు ఇవ్వలేదు. ఇలా ఇబ్బందులకు గురిచేసి, రాజకీయంగా వేధించి వారు రాజీనామా చేసి వెళ్లిపోయేలా చేయాలన్నది చంద్రబాబు సర్కారు ఎత్తుగడగా తేటతెల్లమవుతోంది.
న్యాయ పోరాటం చేస్తా: గజ్జల వెంకటలక్ష్మి
నాకు, తోటి సభ్యులకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. సభ్యులకు ఒక నెల వేతనం ఆపేశారు. నాకు 4 నెలల వేతన బకాయిలకు అర్జీ పెట్టుకున్నా చెల్లించలేదు. కనీసం టీఏ, డీఏలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. గౌరవ వేతనం అడిగితే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అధికారులతో ప్రభుత్వం సలహాలు ఇప్పిస్తోంది.
బిల్లులు మంజూరు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్‌ను అడిగితే మహిళా కమిషన్‌గా మిమ్మల్ని ఉండనివ్వరని, రాజీనామా చేయిస్తారంటూ బెదిరించినట్టు మాట్లాడారు. ఇదే విషయమై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జి.జయలక్ష్మికి ఫిర్యాదు చేశాను. వారు ఏ చర్యలు తీసుకుంటారో చూస్తాను. రాజ్యాంగ బద్దమైన నా పదవి రెండేళ్లపాటు (2026 మార్చి వరకు) ఉంటుంది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై ప్రభుత్వం తీరు మారకుంటే న్యాయ పోరాటానికి సిద్ధం.
Comments
Please login to add a commentAdd a comment