నో క్యాష్ ప్లీజ్.!
కడప వైఎస్సార్ సర్కిల్ : ప్రజలు ఏ సమయంలోనైనా డబ్బును డ్రా చేసుకునేందుకు వీలుగా దాదాపు అన్ని బ్యాంకులు ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేశాయి. ఖాతాదారులు కూడా నగదు లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఈ కేంద్రాలు ఎంతో అనువుగా ఉన్నాయని భావించారు. అయితే గత రెండు రోజులుగా ఏటీఎం కేంద్రాలలో నగదు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఏటీఎం కేంద్రాలలో నగదు పెట్టగా 1వ తేదీ కావడంతోపాటు వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు అధిక సంఖ్యలో డ్రా చేసుకోవడంతో రెండు, మూడు గంటలకే ఖాళీ అయ్యాయి. ఆ తర్వాత శుక్రవారం సార్వత్రిక సమ్మె కారణంగా బ్యాంకు ఉద్యోగులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడంతో సేవలు నిలిచిపోయాయి. అయితే శనివారం బ్యాంకులు యధావిధిగా పనిచేసినా వివిధ కారణాలతో పలు బ్యాంకుల అధికారులు ఏటీఎం కేంద్రాల్లో నగదు పెట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం నాడు అత్యవసర పరిస్థితుల్లో చాలామంది నగదును డ్రా చేసుకోవడానికి బ్యాంకులకు వెళ్లినా ఏటీఎం కేంద్రాల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించారు. తీరా ఆయా కేంద్రాలకు వెళ్లిన వారికి ఏటీఎంలలో నగదు లేకపోవడంతో దిక్కుతోచలేదు. ఈనెల 4న ఆదివారం, 5న సోమవారం వినాయక చవితి పండుగ సెలవు కావడంతో నగదు అవసరమైన వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఖాతాదారులు బ్యాంకు అధికారులను కోరుతున్నారు.