ఎలీ డయాగ్లెవ్, అరినా గెటప్‌లోనూ అతడే!
2018 మిస్ వర్చ్యువల్ కజకిస్తాన్ అందాల పోటీ ఫైనలిస్ట్ అయిన ఈ పిల్లను చూసినోళ్లంతా ఇదే పాటేసున్నారు...
అందమంటే.. అరినా అలియెవాదే
అని అనేసుకున్నారు...
అందాల కిరీటమూ ఆమెదేనని అందరికీ డప్పేసుకున్నారు..
ఈ పాటేసుకోడాలు.. అనేసుకోడాలు.. డప్పేసుకోడాలు మధ్య.. మనకు తెలియని
మరో కథ ఉంది..
కింగ్‌ఖాన్ అన్నట్లు..
‘అబీ పిక్చర్ బాకీ హై మేరే దోస్త్’
ఇంతకీ మనకు తెలియని ఆ స్టోరీ ఏంటంటే..
ఎలీ డయాగ్లెవ్(22).. ఓ మోడల్.. ఓ రోజు తన ఫ్రెండ్స్‌లో కాఫీ షాపులో కూర్చుని ఉండగా వాళ్ల మధ్య ఓ చర్చ.. ఒకప్పుడు మహిళలు తమ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చేవారని.. ఇప్పుడంతా ట్రెండ్ ఎటు ఉంటే అటు పోతున్నారని ఎలీ అన్నాడు. ఫ్యాషనబుల్‌గా దుస్తులు ధరించడం, మేకప్ వేసుకుంటే చాలు తాము అందంగా ఉంటామని అనుకుంటున్నారని.. ప్రస్తుతమున్న ఆధునిక పద్ధతులతో ఓ మగాడు కూడా అందమైన మహిళగా మారిపోవచ్చని చెప్పాడు.. స్నేహితులు ఇతడి వాదనను వ్యతిరేకించారు. ఎలీ మాత్రం తన మాటే రైట్ అని నిరూపించాలనుకున్నాడు.. అంతే.. మేకప్ ఆర్టిస్టు సాయం తీసుకున్నాడు.. ఎలీ కాస్త.. అరినాగా మారిపోయాడు. వర్చ్యువల్ కజకిస్తాన్ అందాల పోటీలో భాగంగా ఆన్‌లైన్లో తన ఫొటోలను పెట్టాడు.. స్పందన అదిరిపోయింది.. ఫైనలిస్టుగా ఎంపికయ్యాడు.. తన మాట నెగ్గింది.. ఇక నిజం చెప్పాల్సిన టైమొచ్చింది.. దీంతో తాను అరినాను కాదని.. ఎలీ అంటూ ఓ వీడియో నెట్లో పోస్ట్ చేశాడు.. ‘కొంత మంది అమ్మాయిలు ఈ మధ్య బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఆ బాహ్య సౌందర్యాన్ని ఓ మగాడు కూడా సాధించగలడు. వ్యక్తిత్వం, అంతః సౌందర్యం అన్నవి అన్నింటికన్నా ముఖ్యం.. నా ఈ పని కొంతమందైనా అమ్మాయిలను ఆ దిశగా ఆలోచించేలా చేస్తుందని భావిస్తున్నాను’ అంటూ ఎలీ తన వీడియోలో పేర్కొన్నాడు..
మగాళ్ల పరిస్థితి ఏమైంది?
ఓకే.. ఓకే.. అమ్మాయిలకు మెసేజీ ఇచ్చేశాడు సరిపోయింది.. మరి ఎలీని.. అరినా అనుకుని.. పిచ్చపిచ్చగా ఆరాధించేసిన మగాళ్ల పరిస్థితి ఏమైంది? ఏమవుతుంది? వాళ్లే సాంగ్‌ను కాస్త మార్చుకున్నారు.. శాడ్ ట్యూన్‌లో మళ్లీ పాటేసుకున్నారు..
అయ్యయ్యో.. బ్రహ్మయ్య..
అన్యాయం చేశావేమయ్యా..
ఈ బుల్లోడే.. బుల్లెమ్మనుకుని..
ఎంతగానో మోసపోయామయ్యా..
యా.. యా..యా..
– సాక్షి, తెలంగాణ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment